Saturday, March 31, 2018


గ్రామదేవతలుః

          మనరాష్ట్రంలో, మనదేశంలో ఊరూరా ఆరాధించబడే ఆదిమదేవతలు గ్రామదేవతలు. ఈ దేవతలనే అమ్మదేవతలని పిలుస్తారు. ఇంగ్లీష్లో ‘మదర్ గాడెస్సెస్’ అంటారు. ఆయా గ్రామాల ఆచార, సంప్రదాయాలకు, సంస్కృతికి చిహ్నాలు గ్రామదేవతలు. ఆయా గ్రామాల ప్రజలు తమ విశ్వాసాలకు, సంప్రదాయాలకు ప్రతినిధులు ఈ గ్రామదేవతలు. ప్రజల విశ్వాసాలు వాళ్ళని కొన్ని ప్రత్యేకసందర్భాల్లో ఒక్కటిచేసే విశ్వాససృష్టి గ్రామదేవతలు. నిజానికి గ్రామదేవతలకు రూపమేదీ వుండదు. ఆకారంలేని రాళ్ళని కాని, కొయ్యబొమ్మల్నికాని, కొన్నిసార్లు గూడు(డోల్మన్)వంటి రాతిసలపలగుడిలో దీపం, గురుగులు పెట్టి దేవతలంటారు. కాని, రూపాలను ధ్యానించు కుంటారు. హిందూదేవతలలో కొందరు అమ్మదేవతల విగ్రహాలు గ్రామాల్లో గ్రామదేవతలుగా పూజలందు కుంటున్నాయి. ఈ దేవతలకు ప్రత్యేకమైన దినాల్లో, పండుగలపుడు జాతరలు చేస్తుంటారు.
          పురాణాల్లో గ్రామదేవతలను శక్తిస్వరూపిణులుగా వర్ణించారు. దాదాపు కాళీదేవతను, సప్తమాతృకలలో ఒకరైన చాముండిని గ్రామదేవతలుగా ప్రతిష్టించారు. గ్రామదేవతలు మహిమగలవారని, తమ గ్రామప్రజలను, పంటలను, పసులను, పిల్లలను కాపాడే ఏకైకదేవతలుగా గ్రామీణప్రజల విశ్వాసం.
గ్రామదేవతల పుట్టుకః
          గ్రామదేవతలు గ్రామాల పుట్టుకకన్నా ముందే పుట్టినవారు. ఆదిమజాతి ప్రజలు సంచారజీవనం వదిలి, స్థిరనివాసం కొరకు ప్రయత్నించే సందర్భాల్లోనే కలిగిన భయాల నివృత్తికి ప్రకృతిని వేడుకున్నారు. చెట్టునో, పుట్టనో, రాయినో, రప్పనో ఆరాథించారు. భయపెట్టే ఉరుములు, మెరుపులు, వానలు, వరదలు, పాములు, చెట్లు, జంతువులు వాళ్ళకు వేడుకోదగినవిగా అనిపించాయి. చాలినంత ఆహారం దొరికినపుడు, పంటలు బాగా పండినపుడు, వాళ్ళు కావాలనుకున్నవి లభించినపుడు, ఆపదలు తప్పిపోయినపుడు ఆ సంఘటనలకు మూలమనుకున్న వారే దేవతలని, వారికి నమస్కరించడం అలవర్చుకున్నారు. ఆరాథించడం సంప్రదాయంగా చేసుకున్నారు. తమకు దొరికిన ఆహారం, ఇతర ఉత్పత్తులను రాశులుగా పోసి, బోనాలుపెట్టి, సాకలుపెట్టి ధన్యవాదాలు తెలిపే ఆచారమే గ్రామదేవతల పూజలుగా గ్రామసంస్కృతిలో భాగమైపోయాయి.
గ్రామదేవతల ఆరాధనః
1.       కొందరు గ్రామదేవతలకు తప్ప ఎక్కువమట్టుకు రాతిసలపలతో కట్టిన గూడుగుళ్ళే వుంటాయి.
2.       ఈ గుళ్ళల్లో విగ్రహాలు చెక్కిన శిలారూపాలు శైవదేవీరూపాలై వుంటాయి.
3.       ఎక్కువపాళ్ళు శిల్పం లేని రాళ్ళో, బొమ్మచెక్కిన కర్రలో, ప్రత్యేకంగా కుండలో పెట్టి పూజింపబడుతుంటాయి.
4.       ఈ గ్రామదేవతల గుళ్ళు గ్రామంలో పొలిమేరల్లో, వేపచెట్లకింద, పొలాల దగ్గర, పర్రెలు, చెరువులు, గడులు, కోటల వద్ద వుంటాయి.
5.       గ్రామదేవతలను పూజించడానికి బ్రాహ్మణులు కాక శూద్రవర్ణాలవాళ్ళు పూజలు జరుపుతుంటారు. మంత్రాలుండవు. పసుపు,కుంకుమలు, గండదీపాలు, వేపమండలు, ఆకులు,పూలు, బోనాలు, జంతుబలులు ఆరాధనలో పూజాద్రవ్యాలుగా వుంటాయి. దీపాల గూళ్ళు, తొట్టెలలు, కొబ్బరికాయలు ముడుపులుగా కడుతారు.
6.       గ్రామదేవతలందరు భయంకరమూర్తులుగానే గ్రామీణప్రజలు నమ్ముతుంటారు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికే జంతుబలులు,కల్లు,సారా సాకలు, బోనాలు కావాలని నమ్ముతుంటారు. అందుకే గావుపట్టడం, పొలిజల్లడం వంటి తంతులు చేస్తుంటారు.
7.       గ్రామదేవతలను కొందరు కాళీరూపంగానే చెప్పడం వల్ల మహిషాసురమర్దిని రూపంలోనో, చాముండి రూపంలోనో కొలువడం, ఆ విగ్రహాలను ప్రతిష్టించి పూజంచడం ఆనవాయితీగా వస్తున్నది.
8.       కొన్నిచోట్ల వేపవంటి చెట్లకు  పసుపు,కుంకుమలు పెట్టి పూజించడం కూడా గ్రామదేవతల అర్చనగానే భావిస్తున్నారు.
9.       పొలాల్లో వరి అలుకుచల్లినపుడు 5రాళ్ళు పెట్టి పూజించడం, అలుకుబోనం పెట్టడం, పంటకోసినపుడు పంటబోనం పెట్టడం కూడా గ్రామదేవతల పూజలో భాగంగానే చెప్పవచ్చు.
10.   గ్రామదేవతలకు ఏడాదికొకసారి,రెండేండ్ల కొకసారి జాతరలు చేస్తుంటారు. పోషమ్మ పండుగ, మైసమ్మపండుగ, దుర్గమ్మపండుగ వంటివి అట్లాంటివే.
11.   గ్రామదేవతల పూజలలో సిగం లేదా పూనకం వచ్చిన సివసత్తులు(శివశక్తులు) పాల్గొంటారు. నిప్పుల గుండాలు తొక్కుతుంటారు.
12.   గ్రామదేవతలకు అన్నపురాశుల కుంభంపోసి, దున్నపోతును బలియిచ్చే ఆచారమొకటి వుండేది. దున్నపోతు బలిరక్తంతో తడిసిన అన్నాన్ని గంపల్లో,చేటల్లో ఎత్తి ఊరిచుట్టు పొలి చల్లుతారు.

గ్రామదేవతలు-స్త్రీలుః
          ఆదిమకాలంలో మాతృస్వామ్యమే వుండేది. కుటుంబ యజమాని స్త్రీనే. బయటవుండి గ్రామరక్షణ, వేట వంటి పనులు పురుషులు చూసుకుంటే, స్త్రీలు సమస్తమైన ఇంటిపనులన్నీ నిర్వహించేవారు. వ్యవసాయం, నేతపని, బుట్టల అల్లిక, అలంకరణ వస్తువుల తయారీ, కుండల తయారీ వంటి అనేకమైన ఇంటికవసరమైన పనులన్నీ స్త్రీలే చూసుకునేవారు. పురుషులంతా స్త్రీలమీదే ఆధారపడివుండేవారు.
          ప్రత్యుత్పత్తిశక్తి స్త్రీకే వున్నదని, పిల్లల్నికని, పాలిచ్చి పెంచే సహజశక్తులను స్త్రీల ప్రత్యేకశక్తులుగా గుర్తించి సమాజం స్త్రీలను దేవతలుగా గౌరవించేవారు. అన్ని రకాల రక్షణ, పోషణ, ఉత్పత్తిశక్తుల అనుగ్రహ, ఉపసంహార దైవీభావశక్తులున్నట్లుగా భావించిన గ్రామీణప్రజలు గ్రామదేవతలందరిని స్త్రీరూపాల్లోనే పూజించారు. గ్రామదేవతల సంఖ్య 101 వుంటాయంటారు. కాని, గ్రామాలవారీగా లెక్కిస్తే గ్రామదేవతలు లెక్కకు మిక్కిలిగానే వుంటారు.
తెలంగాణాలో అమ్మదేవతలుః కొందరి పేర్లు
1.పోచమ్మ,            2. మైసమ్మ      3. బాలమ్మ      4. ఉప్పలమ్మ              5. దుర్గమ్మ
6.మాతమ్మ,           7.మార్కమ్మ     8.భూదేవమ్మ    9.మావురాల ఎల్లమ్మ     10. మహంకాళి
11. ముత్యాలమ్మ     12.ఈదమ్మ      13.సరద్దుల పోచమ్మ 14.వనం మైసమ్మ    15.గిద్దెలమ్మ
16.డొక్కలమ్మ         17.మాచానమ్మ  18.మారెమ్మ     19.పెద్దమ్మ                 20.చౌడమ్మ
21.కట్టమైసమ్మ       22. గడిమైసమ్మ 23. పోలి మైసమ్మ 24. గండి మైసమ్మ     25.నల్లపోషమ్మ
26. బంగారు మైసమ్మ 27. పోలేరమ్మ  28. మమ్మాయి 29. అంకాలమ్మ           30.సుంకులమ్మ


గ్రామదేవతలు- పురుషులుః
          గ్రామదేవతల్లో పోతురాజొక్కడే ఎక్కువగా కనిపిస్తుంటాడు. గ్రామదేవతల తమ్ముడుగా పోతురాజు ఆయా గ్రామదేవతల గుళ్ళముందు ఆలయపాలకుడుగా వుంటాడు. రాతిగుండునో, కొయ్యబొమ్మనో గ్రామదేవత గుడిముందు పాతి పూజిస్తారు.

గ్రామదేవతల ప్రాధాన్యతః
          పెద్ద,పెద్ద గుడులలోని పెద్దదేవతల కన్నా గ్రామీణులు గ్రామదేవతలనే ఎక్కువగా పూజిస్తారు. వారి నిత్యజీవన కార్యకలాపాల్లో గ్రామదేవతలు భాగమైవుంటారు. అడుగడుగునా మొక్కుతుంటారు. ముడుపులు కడుతుంటారు. ఈ ఆచారం, సంప్రదాయం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా, ఈజిప్టు, గ్రీకు, మెక్సికో వంటి దేశాల్లో అమ్మదేవతల ఆరాధన కనిపిస్తుంది. సృష్టికర్తను వెతకరు గ్రామీణప్రజలు, కాని, అంతకన్నా గ్రామదేవతలనే ముఖ్యంగా భావిస్తారు.
          తెలుగుసాహిత్యంలో వినుకొండ వల్లభరాయుని ‘క్రీడాభిరామం’లో, శ్రీనాథుడు రచించిన ‘హరవిలాసం’లో గ్రామదేవతల ఆచార,వ్యవహారాలు తెలుస్తున్నాయి.




No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...