కాకతీయ కళాతోరణాలుః కొన్ని సామ్యాలు
కాకతీయ
కళాతోరణాలు అపూర్వమైన శిల్పానికి తార్కాణంగా నిలిచివున్నాయి. వరంగల్ కోట
అవశేషాలున్న చోటుకు నలువైపుల నాలుగు తోరణద్వారాలున్నాయి.వీటి నిర్మాణానికి ఏవి
ఆదర్శమైనవి. వీటి గురించి రాసిన స్వదేశీ, విదేశీ చరిత్రకారులు సాంచీస్తూపానికి
నలువైపుల నిలిపివున్న నాలుగు ద్వారతోరణాలే కాకతీయ తోరణద్వారాలకు మోడల్స్ అని
అభిప్రాయపడ్డారు.వరంగల్లులో బౌద్ధస్తూపాలుండేవని క్రీడాభిరామంలో చెప్పబడ్డది.
బౌద్ధం ప్రభావం కీర్తితోరణద్వారాల మీద వుందనడంలో అబద్ధం లేదనుకుంటాను.
అయితే ఈ
తోరణాలకు మూలం అనిపించేవి, ఏ శిల్పాలతో అలంకరింపబడని నాలుగు రాతిస్తంభాల ద్వారాలు
హన్మకొండ ప్రధానరహదారిలో ఒకటి, సిద్ధులగుట్ట వైపు మరోమూడు అంతంత దూరంలోనే నిలిపి వున్నాయి.
వీటికి కోటతలుపులు పెట్టిన ఆనవాళ్ళేమీ లేవు. ఈ ద్వారాలు కాకతీయ
కీర్తితోరణద్వారాలకన్నా ఎంతో ప్రాచీనమైనవనిపిస్తున్నాయి. గుట్టలే కోటగోడలుగా ఆ
ద్వారాల నడుమ ఒక పురాతన రాజ్యం వుండేది. అది ప్రజలలో ప్రచారంలో వున్న ఎరుకరాజు
రాజ్యమా?
ఈ ద్వారాల
తర్వాతి కాలానివి అనిపంచే రెండు తోరణద్వారాలు కొలనుపాకలో కనిపిస్తాయి. ఒకటి సోమేశ్వరాలయం
ముందరున్న ఆర్కియాలజీ మ్యూజియంలోకి ప్రవేశించే ద్వారం. ఈ ద్వారానికి నిలువు
స్తంభాలకు అడుగున కలశాలు చెక్కివున్నాయి. ద్వారం ఉత్తరాశిమీద గజలక్ష్మిని పోలిన
శిల్పముంది. ఆ శిల్పానికి రెండువైపులా మకరవ్యాళుల రేఖాచిత్రాలున్నాయి. రెండు
నిలువుస్తంభాలకు వెలుపలివైపు, ఉత్తరాశికి రెండుచివరలలో కిందివైపు రెండు
సింహశిల్పాల బ్రాకెట్లున్నాయి. మరొకటి రాజద్వారం లేదా Gate way of
Kolanpaka అని పిలిచే తోరణద్వారం కళ్యాణీచాళుక్యుల కాలంలో
తవ్వించిన వంశవర్థన కాలువ అంచున వుంది. ఈ ద్వారానికి స్తంభాలకు, పైన
తోరణస్తంభానికి శిల్పాలున్నాయి. ఇవి శైవమతచిహ్నాలు కలిగివున్న పురుష
శిల్పాలున్నాయి. ఈ రాజద్వారం, సోమేశ్వరాలయ తోరణద్వారం రెండుకూడా
రాష్ట్రకూటశిల్పశైలిలో వున్నాయి.
కొలనుపాక
ద్వారాలకు తర్వాతికాలంలో నిలిపినవి ఐనవోలు మల్లన్నగుడికి నలువైపుల నిలిపిన
తోరణద్వారస్తంభాలు. ఇవి అచ్చంగా కాకతీయ కీర్తితోరణద్వారాలకు సమానమైన
ఎత్తు,వెడల్పులు, స్తంభాల కొలతలు, శిల్పనమూనాలు, ఏడేసి మామిడిపిందెలు,
మకరవ్యాళులు, సింహాల బ్రాకెట్లు కలిగివున్నాయి.
తోరణద్వారాలు
మెదక్ జిల్లాలోని నంది కంది శివాలయం ముందర ఒకటి, వెల్దుర్తిలో ఒకటి ఉన్నాయి. వాటి
ఉత్తరాశుల కిందివైపు 7 మొగ్గలు(డ్రాప్స్), బ్రాకెట్ శిల్పాలు, స్తంభాలపై
కీర్తిముఖాలు కనిపిస్తాయి.
ఈ తోరణద్వారాలన్నింటికి
నిర్మాణ ప్రేరణనిచ్చినవి సాంచీ స్తూప ద్వారతోరణాలే. హన్మకొండ, వరంగల్లులో, ఐనవోలు,
కొలనుపాకలలో బౌద్ధప్రభావంతోనే ఈ ద్వారాలు నిర్మాణం అయ్యాయి.
Kakatiya sculpture (1964) అనే పుస్తకాన్ని రాసిన చరిత్రకారులు ఎస్.గోపాలకృష్ణమూర్తి, కాకతీయ కీర్తిద్వారాలను హన్మకొండ, ఐనవోలు,
కొలనుపాక ద్వారాలతో పోల్చాడు. The Antiquities of Kulpak (1915) రాసిన టి.శ్రీనివాస్,
అసిస్టెంట్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆహ్ ఆర్కియాలజీ, హైద్రాబాద్, కొలనుపాక
ద్వారస్తంభానికి 8 చిన్న ఆర్చీలు, 7 డ్రాప్స్ వున్నాయని, వాటికి కిందుగా
రెండువైపుల బ్రాకెట్టులున్న రాతితొలులు వున్నాయని,కొందరు ఈ ద్వారాలను
కీర్తిస్తంభాలన్నారు. బౌద్ధనిర్మాణాల్లో భాగంగా వీటిని రూపొందించివుంటారు. కాని
అట్లాంటి ఆధారాలు దొరకలేదు అన్నారు.
No comments:
Post a Comment