Sunday, March 11, 2018

వెల్దుర్తిః
                ఇటీవల నేను(శ్రీరామోజు హరగోపాల్), వేముగంటి మురళీకృష్ణ, బండి మురళీధర్ రెడ్డి, చంటిలతో కలిసి వెల్దుర్తిని సందర్శించాము. మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామం మెదక్ జిల్లాలో చారిత్రకంగా చాలా ప్రసిద్ధమైనది. అక్కడ పుట్టిపెరిగిన  వెల్దుర్తి మాణిక్యరావు స్వాతంత్ర్య సమరయోధులు, ప్రఖ్యాత కవి, రచయిత, నాటకకర్త, ప్రయోక్త, బహుముఖ ప్రజ్ఞావంతు డాయన.
          ఆ వూరిలో కాకతీయ తోరణద్వారాలను పోలిన ఒక తోరణద్వారముంది. ఈ ద్వారం కాకతీయతోరణ ద్వారాలకన్నా ముందరిది అనిపిస్తున్నది. దాదాపు 20 అడుగుల ఎత్తున్న ఈ ద్వారంపై  కీర్తిముఖాలు చెక్కి వున్నాయి. పైనున్న ఉత్తరాశిపైన రెండువైపుల శిల్పాలు చెక్కిన అర్థవృత్తాకారపు నల్లరాతిఫలకం వుంది. దానికి  ఉత్తరాభిముఖంగా  గజలక్ష్మి, కింద క్షీరసాగరమథనం శిల్పాలు, వెనకవైపు దక్షిణాభిముఖంగా శృంగార నారసింహుడు, అతని కాళ్ళకింద రాక్షసుడు(హిరణ్యకశ్యపుడు?) దేవతాదులు చెక్కబడివున్నారు. శిల్పాలకు ఇరువైపుల మకరతోరణాలు చెక్కబడివున్నాయి. ఇవి కాకతీయశిల్పాలతో పోలికలు కల్గివున్నాయి. ఉత్తరాశికి కిందుగా 7 మొగ్గలు చెక్కువున్నాయి. వాటిపైన ఆరురంధ్రాలున్నాయి. వీటి నుంచి వెళ్ళే సూర్యకిరణాలు ఆరురుతువుల్లో దేవాలయంలోని దేవుని పాదాలపై పడతాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ద్వారానికి బ్రాకెట్టు శిల్పాలుగా సింహాలున్నాయి.
          ఈ తోరణద్వారం నందికంది దేవాలయ తోరణద్వారాన్ని పోలివుంది. అక్కడ కూడా ద్వారం ఉత్తరాశిపై గజలక్ష్మి శిల్పం తూర్పువైపు, లోపలివైపు పడమరదిశగా వున్న  తాండవ శివుని శిల్పాలతో అర్దవృత్తాకార శిల్పఫలకం వుంది. ద్వారస్తంభాలు కూడా కీర్తిముఖాలతో అలంకరించబడ్డాయి. కాని, బ్రాకెట్టు శిల్పాలు లేవు.
ఆ ద్వారానికి ఆనించిపెట్టిన వినాయకవిగ్రహం రాష్ట్రకూట శిల్పం. తోరణద్వారం గుండా ఒక చిన్నగుడి కనిపిస్తుంది. ఆ గుడిలో అనంతశయనుని 4అడుగుల పొడవు, 2అడుగుల ఎత్తైన విగ్రహముంది. ఆ గుడి ఒకే గర్భగుడిని కలిగివుంది. లోపల కొత్తగా కట్టిన గద్దెమీద అనంతశయనుని విగ్రహాన్ని పెట్టారు. దాన్నిపుడు విష్ణు దేవాలయంగానే పిలుస్తున్నారు. కాని, అనంతశయనుని ఎదురుగా చిన్ననందివిగ్రహం వుంది. అది కూడా రాష్ట్రకూటులనాటిదే.
 గుడి బయట పడేసివున్న 7అడుగులు ఎత్తున్న శైవద్వారపాలకుని విగ్రహం వుంది. శోభాయమానమైన అలంకృత శిల్పమది. నాలుగుచేతులున్న మూర్తి కుడివైపు ముందుచేతిలో గద, వెనకచేతిలో త్రిశూలం, ఎడమ వెనకచేతిలో ఖట్వాంగం, ముందు చేయి విరిగిపోయివుంది. బహుశః ఈ శిల్పం గుడికి కుడివైపున నిలిపివుంచే శైవద్వారపాలకునిదయివుంటుంది.  త్రిభంగిమలో వున్న ఈ శిల్పం కుడికాలు కొంచెం పైకెత్తి గదమీద నుంచి వేసి నిల్చున్నట్టుగా వుంది. పాదాల నుంచి తలపై కిరీటం దాకా హొయసలశైలి శిల్పమిది. పాదాలకు మంజీరాలు, కడియాలు, పిక్కలపై కీర్తిముఖం,నడుమున దట్టి, కుడిభుజం నుంచి వేసిన కపాలజంధ్యం, కంఠహారాలు, నుదుట మూడోకన్ను, కాకతీయశైలి కిరీటం, కిరీటం మీద త్రిశూలబింబంతో సర్వాంగసుందరంగా వుంది. గద లేకపోతే సాక్షాత్తు శివుని శిల్పమే అనిపిస్తుంది. ఈ శిల్పంతో పొలిన శిల్పాలు మనకు వరంగల్ కోట ప్రాంగణంలో, గణపురం కోటగుళ్ళ వద్ద చూడవచ్చు.
ఈ శిల్పం ద్వారానికి కుడివైపున మట్టిలోపల దొరికిందంట. అయితే రెండో ద్వారపాలకుని శిల్పం ద్వారానికి రెండోవైపున మట్టిలో పూడిపోయివుంటుంది. ద్వారానికి ఎడమవైపున పదులసంఖ్యలో నాగశిల్పాలున్నాయి. వాటిలో చాలాప్రాచీనమైనవి కూడావున్నయి. అటువైపుననే ఆంజనేయుని గుడి వుంది. గుడిలో హనుమంతుని విగ్రహం, ముందర పిడికెంత లింగం ప్రతిష్టించిన చిన్నపానవట్టం, చిన్ననంది వున్నాయి. ఆ ప్రాంగణంలోనే శిఖరమంటపంలో గరుడుని విగ్రహమున్న 20అడుగుల ఎత్తున్న రాతిధ్వజస్తంభం వుంది. ఈ స్తంభం జైనమానస్తంభాన్ని పోలివుంది. ఇటువంటి స్తంభాలు కొలనుపాక,జనగామ, వేల్పుగొండలలో కనిపిస్తాయి.ఈ స్తంభానికి ఎదురుగా గుడిప్రాంగణం బయట మంటపం కట్టి నిలిపిన మరోస్తంభం వుంది. నాలుగుపలకలుగావున్న 15అడుగుల ఎత్తున్న ఈ స్తంభం ఎవరి విజయస్తంభమోననిపిస్తున్నది. కట్టిన మంటపం నాలుగుమూలలలో నాలుగు బ్రాకెట్లలో నాలుగు సింహాల శిల్పాలున్నాయి. మనకివి తోరణద్వారస్తంభాలకే కనిపిస్తుంటాయి.
వీటన్నింటికి ఉత్తరంగా కొంచెం దూరంలో పదిసోపానాల శిఖరంతో విఠలుని దేవాలయముంది. 16స్తంభాల రంగమంటపం, అంతరాళం,గర్భగుడులతో వున్న ఈ దేవాలయం చాలాసార్లు పునరుద్ధరణకు గురైంది. స్థానికులు చెప్తున్నదాన్ని బట్టి ఈ గుడిలోని మూలవిగ్రహాలు భగ్నమైనవని బయటపెట్టి కొత్తగా(50యేండ్ల కింద) రుక్మిణీ సహిత విఠ్ఠలుని విగ్రహాలను ప్రతిష్టించారని తెలుస్తున్నది. ఈ ఆలయప్రాంగణంలో 4అడుగుల ఎత్తున్న వైష్ణవ శిల్పముంది. ఈ శిల్పానికి తలవైపున దశావతారాలన్ని చెక్కివున్నాయి. ఈ మూర్తి చతుర్భుజుడు. కుడివైపు ముందరిచేయి  చేతివేళ్ళమధ్య తామరపువ్వుతో అభయహస్తంగా వుంది. వెనకకుడిచేతిలో శంఖం వుంది. విరగివున్న ఎడమ ముందరిచేయి వరదహస్తంగా వుండివుండాలి. వెనక ఎడమచేతిలో చక్రమున్నది. తలపై కరండమకుటముంది. కంఠహారాలు, భుజకీర్తులు, పెద్దకుండలాలతో అందమైన శిల్పం.
వెల్దుర్తి మాణిక్యరావు ఇంటివద్ద రాజరాజేశ్వరుని గుడి వుంది. గుడిని బయటినుండే చూడవలసివచ్చింది. ఆ గుడికి వున్న దక్షిణదిశలో వుండేటి మొదటి రాతిద్వారాన్ని తీసి తూర్పు ఈశాన్యంలో పెట్టారు. లలాటబింబంగా గజలక్ష్మి వుంది. శైవద్వారపాలకులున్నారు. గుడిగోడల్లో పెట్టికట్టిన  జైన కలశాలున్న పాత దేవాలయ ద్వారస్తంభాలు కనిపించాయి. గుడిలోపల దుర్గ, శివలింగం, వీరభద్రుడు, వేంకటేశ్వరుడు,వినాయకుడు వున్నాయని ఆలయపోషకులు చెప్పారు.
ఊరిబయటికి వెళ్లే తొవ్వలో ఎత్తైన రాతిగద్దెమీద పోచమ్మ దేవతతో పాటు పలుదేవతలు శిల్పాలున్నాయి. పోచమ్మదేవత చాముండి ప్రతిమాలక్షణాలతో వుంది.కాని, మడిచిన కుడికాలికింద గొర్రెపోతు, ఎడమకాలికింద అసురుని తలలున్నాయి. సాధారణంగా చాముండి దేవతప్రతిమకు కాళ్ళకింద మూడుతలలుంటే కామాక్షి శిల్పమని, మమ్మాయి దేవతని అంటారు. ఇక్కడున్న శిల్పం ప్రత్యేకం మరెక్కడా ఇంతకు మునుపు చూడని దేవతాశిల్పమిది. ఈ దేవతకు ఎదురుగా తలలేని రెండుచేతుల చాముండి శిల్పం, నాలుగుచేతులతో మరొక చాముండి శిల్పలున్నాయి. అక్కడున్న చింతచెట్టు వందలయేండ్లనాటిదట. ఆ చెట్టుమొదట్లో పెట్టివున్న శిథిల మహిషాసురమర్దిని శిల్పం రాష్ట్రకూటశైలిలో చెక్కివుంది.
శాస్త్రుల రఘురామశర్మ రాసిన ‘మెదకుసీమ విజ్ఞానసర్వస్వము’లో వెల్దుర్తి గురించి రాస్తూ ‘ కాకతీయ రుద్రదేవుడు హన్మకొండలో వేయిస్తంభాలగుడి కట్టించిన కాలంలోనే ఇక్కడ శివాలయాన్ని నిర్మించినట్టు తెలిసింద’ ని రాసాడు. ఇక్కడున్న ద్వారస్తంభాలలో (కుడివైపు స్తంభంపై) ఒకదానిపై చెక్కివున్న శాసనంవల్ల ఈ గుడి కాకతీయులు నిర్మించినట్టు చెప్పవచ్చని భావించారు.(శాసనపాఠం లేదు).
మేం చదివిన శాసనం:
వెల్దుర్తి శాసనం:

శ్రీమతు పా
కేదల మ...
బూదేవీ దే
యాపజుర్వ
లి దొమ్మహు
సేస పాలిన
బన కా….
తి చసి మ
....తిదేనిన/(ర్ణ)

యం...




























No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...