Sunday, March 11, 2018

సైదాపురం సీతారాముడు
                ఇటీవల యాదగిరిగుట్ట దగ్గర సైదాపురంలో కొత్తగా బయటపడ్డ దేవాలయాన్ని నేను, నాతోపాటు చంటి  సందర్శించాం. శిల్పాల ప్రతిమాలక్షణాల్ని పరిశీలించాం. శాసనాలను చదివాం.
యాదాద్రి-భువనగిరి జిల్లా సైదాపురంగ్రామం శివార్లో మల్లన్నబోడులు అని పిలువబడే చిన్నగుట్టలున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలు. ఆ గుట్టల్లో మధ్య ఇప్పటికీ అక్కడక్కడ కైరన్ సమాధులు అగుపిస్తున్నాయి. ఆ బోడులలో ఒక బోడు మీద రామాలయం బయటపడ్డది. ఆ పక్కన వ్యవసాయం చేస్తున్న కుటుంబంలోని పల్లెపాటి మల్లేశ్ కాస్తున్న పశువులు తప్పిపోయి ఈ గుట్టమీద చెట్లల్లో చిక్కువడిపోతే వెతుక్కుంటున్న వెళ్ళిన తనకు ఈ ఆలయం కనిపించింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు దట్టమైన కంపచెట్లను తొలగించి చూస్తే రాతిగుండ్ల కప్పుకింద రాతిగుండుకు చెక్కివున్న సీతారాములు అర్ధశిల్పం (Bas-Relief) కనిపించింది.
ఈ విగ్రహశిల్పం దేశంలోనే రెండవది. సాధారణంగా రాముని విగ్రహానికి మానవువలవలెనె రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు వున్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో వుంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న విల్లును పట్టుకున్నట్టుగా చెక్కివుంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ధరించబడ్డాయి. ప్రలంబాసనంలో కూర్చున్న రాముని ఎడమతొడపై సీతాదేవి కూర్చునివుంది. ఇటువంటి రాముని శిల్పం ఒక్క భద్రాచలంలోనే వుంది. దేశంలో మరెక్కడాలేదు. భద్రాచల రాముణ్ణి వైకుంఠరాముడంటారు. ఇక్కడి రాముడు కూడా విష్ణువురూపంలో వుండడం వల్ల ‘వైష్ణవరాముడు’ అనవచ్చు. 5అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుండడం వల్ల, నల్లరాతిలో పూర్తిగా విగ్రహంగా చెక్కబడిన  భద్రాచల రాముని  శిల్పం కన్నా ఈ విగ్రహమే ముందరిదవుతుంది. అపుడు భద్రాచలరాముని శిల్పానికి ఈ సైదాపురం రామునిశిల్పమే మూలం అవుతుంది కూడా. ప్రతిమాలక్షణాన్ని బట్టి ఈ శిల్పం 16వ శతాబ్దంనాటిదని చెప్పవచ్చు. భద్రాచలరాముని శిల్పం 17వ శతాబ్దం నాటిది. అక్కడి  రామునికి లక్ష్మణుని శిల్పం అదనంగా చేర్చబడ్డది. ఇక్కడ లక్ష్మణుడు లేడు. ఏదులాబాద్ లో సిరిచాఫశాసనంవున్న రాతిబోడుమీద లక్ష్మీనారాయణుల విగ్రహం కూడా విల్లమ్ములు లేవు కాని, ఇవే లక్షణాలతో వున్న సంపూర్ణశిల్పం అది.
దేవాలయం ముందర ఒక రాతిగుండుకు ఆళ్వారుల వంటి ఇద్దరి శిల్పాలున్నాయి. అందులో ఒకటి నమస్కారముద్రతో వుంది. అది భక్తుని శిల్పం. పక్కన వున్న శిల్పం వైష్ణవమతగురువువలె వున్నాడు.వారిముందర రాతిగుండుమీద లింగం ఆకారం చెక్కివుంది.గుడిలోపల కూడా పానవట్టమొకటి వుంది.
                ఈ దేవాలయానికి రక్షణగా ప్రకృతి సహజంగావున్న రాతిగుండ్లే కాక చిన్న ద్వారం, ఒకరాతిగోడ కట్టివున్నాయి. గుడికి ఉత్తరాన వున్న చిన్నరాతిగుండుమీద వున్న చెక్కిన రెండువరుసల లేఖనం వుంది. అది మంత్రబీజాక్షరాలలెక్క వుంది. తెలుస్తున్నంతవరకు శంఖు,చక్రచిహ్నాలు తరువాత ‘‘శ్రీ రాం బోన(భువన)గాండీవ (రామ)’’ అనివుంది. గుడికి ముందర వున్న మరోరాతిగుండుమీద దానశాసనం వుంది.కాని, అందులో దాతపేరు లేదు. కాలం లేదు. ఒక శాసనభాగంలో ‘‘ శ్రీ రామసముద్రం వెనుక మరియు తూర్పునూతి పొలం శ్రీ రగుపతికి తూమెడు పాలూ’ అని వుంది. అక్కడే మరో చిన్న శాసనభాగంలో ‘శ్రీ మదహరికి తలకి పాలు తూమెడు’ అనివుంది. ఈ శాసనాల్లో కనిపిస్తున్నలిపిని బట్టి ఇవి 16వ శతాబ్దకాలంనాటివి అని చెప్పవచ్చు.  ఇంకొక చిన్న భాగంలోని లిపి అస్పష్టంగా వుంది. ఇవే గాక గుడిలో ఆగ్నేయం మూలనున్న రాతిగుండుమీద పెద్ద అక్షరాలతో చెక్కివున్న లేబుల్ శాసనం వుంది. అది కూడా చదవడానికి అనువుగా లేదు.
          అక్కడి రాతిగుండ్ల మీద శంఖు,చక్రాలు చెక్కివున్నాయి. 4అడుగుల ఎత్తున్న రాతిఫలకంమీద హనుమంతుని విగ్రహం వుంది.బోడు కింద మరో ఆంజనేయుని శిల్పం పైమూలభాగం విరిగి కనిపించింది.ఈ శిల్పం సైదాపురం వీరభద్రస్వామి దేవాలం ముందరున్న బలభద్రుని శిల్పలక్షణాలతో వుంది. బోడుకు కొంతదూరంలో పాదాలగుర్తులను స్థానికులు స్వామిపాదాలుగా భావించివపూజిస్తున్నారు. అక్కడున్న మర్రిచెట్టు వేళ్ళల్లో చిక్కి వున్న శంఖు,చక్రాలతో వున్న తిరునామఫలకం కనిపించింది.
          ఈ సందర్శనలో వారివెంట ఈ దేవాలయాన్ని బయటపెట్టిన పల్లెపాటి మల్లేశ్, సాక్షి విలేకరి సంపత్ కుమార్, ఫోటోగ్రాఫర్, పూజారి వున్నారు.











No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...