Monday, July 2, 2018

షితాబుఖాన్ అనబడే చిత్తాపుఖాన్
షితాబుఖాన్ ను చిత్తాపుఖాన్ అని పిలిచేవారు. షితాబుఖాన్ మొదటిపేరు సీతాపతిరాజు. పసులమందలను కాచే బోయకులంలో పుట్టినవాడు.బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా సైన్యంలో కాల్బంటుగా పనిచేసాడు. పెద్దస్థాయి సైనికాధికారిగా ఎదిగాడు. షితాబుఖాన్ అనే పేరుతో సొంతజాగీరును ఏర్పరుచుకున్నాడు. షితాబుఖాన్ అనే పేరును హోదాకోసమే వాడుకున్నాడో లేక ముస్లింగా మారాడో తెలియదు.
‘తారిఖ్ ఇ ముహమ్మద్ ఖుతుబ్షాహి’లో షితాబుఖాన్ నిర్భయయోధుడైన ఖమ్మంమెట్టు రాజుగా వర్ణించబడ్డాడు. బ్రిగ్స్ అనే చరిత్రకారుడు ‘హిస్టరీ ఆఫ్ ది రైజ్ ది ముహమ్మడన్ పవర్ ఇన్ ఇండియా’ లో షితాబుఖాన్ ను హిందువైన సీతాపతిగా రాస్తాడు. వరంగల్లులోని 1503నాటి శాసనంలో షితాబుఖాన్ వంశక్రమం వివరించబడ్డది. షితాబుఖాన్ వరంగల్, ఖమ్మం, నల్లగొండల పాలకుడుగా వుండేవాడు.
బహమనీల మీద దండయాత్ర అనంతరం గోల్కొండకు తిరిగివచ్చిన సుల్తాన్ఇబ్రహింకు షితాబుఖాన్ కుతుబ్షా రాజ్యాన్ని ఆక్రమించజూస్తున్నాడని ఫిర్యాదులొచ్చాయి. ప్రతిఘటించకుండానే వరంగల్ సుల్తాన్ స్వాధీనమైంది. హిందూపాలకుల సంఘటనను కూడగట్టుకునే లోపల మళ్ళీ సుల్తాన్ దాడి. ఆ రాజులు షితాబుఖానుకు ఎంత మద్దతిచ్చినా ఫలితం లేకపోయింది.
క్రీ.శ. 1480 నుంచి 1485వరకు షితాబుఖాన్ రాచకొండ గవర్నర్ గా వుండేవాడు. బహమనీరాజ్యంలోని అంతఃకలహాలను తనకనుకూలం చేసుకొన్న షితాబుఖాన్ క్రీ.శ. 1503లో స్వతంత్రపాలకుడయ్యాడు. 1503 నుంచి 1512దాకా రాచకొండ, వరంగల్, ఖమ్మం కోటలనుంచి పాలన సాగించాడు. చెరువులను తవ్వించడం, పాకాల చెరువును బాగుచేయించడం వంటి ప్రజాహిత కార్యాలను చేసాడు.
16*38*12 మీ.ల కొలతలతో ఇండో సారసెనిక్ శైలిలో వరంగల్ కోటకు పడుమట నిర్మించబడ్డది ఖుషమహల్ సౌధం. షితాబుఖాన్ కొలువులోని ప్రధానమంత్రి ఎనుములపల్లి పెద్దనమంత్రి చరిగొండ ధర్మన్న రాసిన ‘‘చిత్రభారతాన్ని’’ అంకితం గొన్నవాడు. ఇందులో షితాబుఖాన్ పరిపాలన గురించి చాలా గొప్పగా వర్ణించబడ్డది.
కులీ కుతుబ్షా షితాబుఖాన్ మీద చాలాసార్లు దండెత్తాడు. ఎన్నిసార్లు యుద్దం చేసినా కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటములతో షితాబుఖాన్ సతమతమయ్యాడు. 1512 తర్వాత కళింగ రాజైన ప్రతాపరుద్రగజపతి సేవలో చేరాడు. కృష్ణదేవరాయలు గజపతులమీద దండెత్తినపుడు రాయల్ని సింహాద్రి వద్ద (విశాఖ జిల్లా) విలుకాండ్రసైన్యంతో నిలువరించాడట. కాని, గెలుపు రాయల వశమైంది. ఆ యుద్ధంలోనే షితాబుఖాన్ మరణించివుంటాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
ఈ షితాబుఖాన్ 1503లో శాయంపేటలోని పాంచాలరాయస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడని శాసనంలో వుంది.
‘చిత్రభారతం’ కవి చరిగొండ ధర్మన్న ఊరు మా చరిగొండః
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి. 
చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించివుండేది. అడవిలో నీటివూటల కాలువలు,వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి వ్యవసాయాధారాలు.
గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ,సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఈ దేవాలయంలోని స్వామికి ప్రతిసంవత్సరం ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఇంకా ఈ గ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి.
గ్రామము చివర పాతకాలంనాటి మసీదు వుంది.
గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలు ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. రాచకొండను, దేవరకొండను పాలించిన పద్మనాయకులే చరిగొండలో కోటను నిర్మింపజేసారు.
ద్వారము నుంచి కోట లోపలికి ప్రవేశించగానే పెద్దబావి అగుపిస్తుంది. ఆ బాయి వొడ్డున నిలబడి రాయి విసిరితే అవతి వొడ్డుకు పడదని స్థానికులు చెప్పకుంటారు. అంత పెద్ద బాయన్నమాట.
ఒక బండకింద వున్న బావిని ‘కన్నికల బావి’(కన్నెలబాయి?)అని పిలుస్తారు. బండకు కొందరు స్త్రీమూర్తుల శిల్పాలు చెక్కి వున్నాయి.
పెరుమాండ్లకుంట దగ్గర దేవాలయశిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడొక తలలేని నంది పడివుంది.
పద్మనాయక రాజు తవ్వించిందే చరిగొండలోని గౌరసముద్రం. రేచెర్ల పద్మనాయక రాజయిన రెండవ లింగమనీడు శాలివాహనశకము 1349, ప్లవంగనామ సంవత్సర, మార్గశిర పౌర్ణమినాడు అనగా క్రీ.శ. 1427 డిసెంబర్ 4వ తేదీన లింగమనీడు భార్య గౌరీదేవి పేరున ఈ చెరువు నిర్మాణము చేయించెనని చరిగొండ శాసనమువల్ల తెలుస్తున్నది. అంతేగాక ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామికి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి కానుకలు అర్పించిందట. భక్తులకు ధర్మసత్రాలను కట్టించినదట.
గౌరమ్మ చెరువు ఆవలి వొడ్డున పడమర దిక్కున ఒక దేవాలయమున్నది. వాటిని కృష్ణాపురము గుళ్ళు అంటారు
దుర్గమ్మగుడి ముందు నుంచి పొయ్యే గౌరమ్మచెరువు కాలువ గ్రామాన్ని రెండుగా చేసింది. కాలువకు దక్షిణాన చరికొండ పట్టి పడకలు, ఉత్తరాన చరికొండ పట్టి కల్వకుర్తి. వెనుకటి తూర్పుకోట, పడమటికోట అని ఇద్దరు మక్తేదార్ల నివాసాలు శిథిలస్థితిలో వున్నాయి.
కోనాపురం నుండి చరికొండకు వచ్చే తొవ్వలో రాకాసిగుళ్ళు, రాక్షసులబొందలు అని పిలువబడే మెగాలిథిక్ సమాధులున్నాయి.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండవాడే. వరంగల్ నేలిన షితాబుఖానను సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యాన్నంకితం చేసాడు చిత్రభారతకవి చరిగొండ ధర్మన్న. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. ధర్మన్న ‘‘ శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణ చిహ్నితనామా, చరికొండ ధర్మసుకవీ’’ అని పిలువబడ్డాడు. చరిగొండ ధర్మన్న అవధానంలో ప్రవీణుడు. గంటకు వందపద్యాలు చెప్పగలవాడట.
మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య.ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుందని ‘చరిగొండ చరిత్ర’ రాస్తున్న యారీదా రాధాకృష్ణా రావు గారు చెప్పారు.
రచనః శ్రీరామోజు హరగోపాల్,
కంటెంట్: వై.రాధాకృష్ణారావు, చరిగొండ














పరడలో బౌద్ధ నాగ ముచుళింద శిల్పం:
నిన్నటిరోజు 19.06.2018న తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో చారిత్రకపరిశోధనలు చేస్తున్న చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, రాగి మురళి, సూరారం రాంప్రసాద్, చంటిల సందర్శనలో పరడలో ‘‘నాగముచుళింద’’ విగ్రహం లభించింది. బుద్ధుడికి జ్ఞానోదయమైన పిదప తనను ప్రాకృతికతత్వాలనుంచి కాపాడింది నాగరూపియైన ముచుళిందుడు. బోధివృక్షం నీడలో తపస్సుచేస్తున్న బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినపుడు 7రోజులపాటు స్వర్గాలు చీకటైపోయాయట. తెంపులేని వర్షం కురిసింది. నాగరాజైన ముచుళించుడు పాతాళం నుంచి వచ్చి తనపడగనీడలో బుద్ధుని కాపాడట. ముచుళింద సుత్తలో ఉరువేలాలోని నేరంజరా నది ఒడ్డున ముచులింద చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయమైనట్టు చెప్పబడింది.
పరడ గ్రామం వెలుపల వున్న శివునిగుట్టకు ఉత్తరం అంచున మట్టిదిబ్బవుంది. అక్కడ సాతవాహనకాలంనాటి ఇటుకలతో కట్టిన వలయాకారపు కట్టడం కనిపిస్తున్నది. అది జారిపోకుండా రాళ్ళతో కట్టిన అంచు వుంది. అక్కడ నిధులవేటగాళ్ళు తవ్విపారేసిన గుంతలున్నాయి. చెట్లు పెరిగిపోయాయి. ఒక చెట్టు మొదట భద్రపరిచిన 8 అంగుళాలు ఎత్తు, 5 అంగుళాల వెడల్పున్న బలపపురాతిబిళ్ళ మీద చెక్కిన నాగముచుళింద శిల్పం కనిపించింది. దాదాపు సంవత్సరం కిందే బయటపడిందని గ్రామస్తులంటున్నారు. ఈ పూజావిగ్రహం అడుగున రెండువరుసలో 5,6 వ శతాబ్దాల తెలుగులిపిలో లఘుశాసనం వుంది. ‘‘స్వస్తిశ్రి మనుమథ సంసర’’ తప్ప మిగతా కొన్ని అక్షరాలు చదువడానికి అనువుగా స్పష్టంగా లేవు. నాగముచుళింద విగ్రహం లభించడం, వృత్తాకారపు ఇటుకల నిర్మాణం, డంగు సున్నం వాడిన ఆనవాళ్ళు ఇవి బౌద్ధస్తూపం వుండవచ్చన్న సందేహానికి తావిస్తున్నాయి. 
పరడలో గ్రామానికి వాయవ్యంగా వున్న చిన్నబోడగుట్టను శివునిగుట్ట అని పిలుస్తారు గ్రామస్తులు.దాని మీద ప్రాచీన శివాలయం వుంది. ఒక కోనేరు వుంది. ఈ గుట్ట మీద పురామానవుని ఆనవాళ్ళు అగుపిస్తున్నాయి. ఒక డోల్మన్, రాతిపరికరాల నూరుకున్న గుంతలు, వడిసెలరాళ్ళున్నాయి. రాతిగొడ్డండ్లు దొరికినాయని గ్రామస్తులు చెప్పారు. గుట్టచుట్టు వందల బంతిరాళ్ళ రాకాసిగుళ్ళుండేవట.పొలాలు చేయడం వల్ల అవన్నీ తొలగించబడ్డాయి. గ్రామానికి రెండువైపుల పాటిగడ్డలున్నాయి.పదులకొద్ది ఎకరాల్లో వున్న ఉత్తరపు పాటిగడ్డలో చరిత్రపూర్వయుగపు కుండపెంకులు, తొలిచారిత్రకకాలపు కుండపెంకులు విరివిగా లభిస్తున్నాయి. మట్టిపూసలలెన్నో దొరికినాయని అక్కడి రైతులు చెప్పారు. మాకు ఆ పొలాల్లో ఒక ‘లాపిస్ లాజులె’ (ఇంద్రనీలపురంగు) పూస దొరికింది. దీన్నిబట్టి ఈ ప్రదేశం చరిత్రపూర్వయుగపు కాలం నుంచి కొత్తరాతియుగం తొలిదశనుంచి ఇక్కడ మానవావాసాలున్నాయని, నాగరికతావికాసం జరిగిందని చెప్పవచ్చు.
తూర్పు పాటిగడ్డలో లభిస్తున్న కుండపెంకులు చారిత్రక మధ్యయుగాల నాటివి. అక్కడ పురాతన దాసాంజనేయుని ఆలయం వద్ద లభించిన దానశాసనం( నల్లగొండ శాసనసంపుటి, సంపుటం-1లో 129పేజిలోని శాసన సంఖ్య.48) క్రీ.శ. 1144లో కళ్యాణీ చాళుక్యచక్రవర్తి జగదేకమల్ల ప్రతాపచక్రవర్తి వేయించినది. శాసనంలో గ్రామం పేరు పరండ.
గొప్ప నాగరికతా సంస్కృతులకు నిలయమైన శివునిగుట్ట క్వారీపనులతో ధ్వంసమౌతున్నది. ప్రస్తుతం పుట్ట రాజిరెడ్డి, మందడి కొండలరెడ్డి, పుట్ట జైపాల్ రెడ్డి, లోకసాని రాంరెడ్డి మొదలైన గ్రామప్రజల వినతిమేరకు ఎండోమెంట్ నోటీసుతో తాత్కాలికంగా క్వారీపనులు ఆగినా ఇప్పటికే సగానికి ఎక్కువగా తొలిచేసిన గుట్ట పూర్తిగా నిర్మూలనం అవుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు.






























నల్గొండ జిల్లా పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం త్రికూట దేవాలయం. దక్షిణ ప్రవేశద్వారంతో వున్న ఈ గుడిలో సోమేశ్వరుడు పూర్వాభిముఖుడు, బ్రహ్మేశ్వరుడు దక్షిణాభిముఖుడు, ఆదిత్యేశ్వరుడు పశ్చిమాభిముఖుడు. సోమేశ్వరాలయంలో ‘ఏకఛాయా’ స్తంభం కనిపిస్తుంది. అంతేకాదు పక్కలకు నిలబడితే మననీడ వ్యతిరేకదిశలో లోపల కనిపిస్తుంది. మధ్యలో కనిపించే నీడలో ఏ తేడా కనిపించదు. నిశ్చలంగా వుంటుంది. మనుషులు, వస్తువులు కదిలేవి అడ్డొస్తే వాటి నీడలు వ్యతిరేకదిశల్లో కదులుతుంటాయి. ఈ ఒక్క గుడిలోనే కాక మిగిలిన రెండు గుళ్ళల్లో ఛాయాస్తంభాలుండవు కాని, మనుషులు, వస్తువులు ద్వారం మధ్యలోనికి వస్తే వాటినీడలు బ్రహ్మేశ్వరాలయంలో 3నీడలుగా, ఆదిత్యేశ్వరాలయంలో రెండు నీడలుగా కనిపిస్తున్నాయి. ఈ దేవాయలమే ఛాయల దేవాలయం. చాలాదేవాలయాల్లో నీడలు వ్యతిరేకదిశల్లో కదిలినట్టు కనిపిస్తాయి.కాని, ఇక్కడివలె స్థిరమైన ఛాయ ఎక్కడా కనిపించదు. ఇది ఈ దేవాలయం ప్రత్యేకత. శిల్పుల ప్రతిభ.











చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...