Saturday, March 31, 2018


గ్రామదేవతలుః

          మనరాష్ట్రంలో, మనదేశంలో ఊరూరా ఆరాధించబడే ఆదిమదేవతలు గ్రామదేవతలు. ఈ దేవతలనే అమ్మదేవతలని పిలుస్తారు. ఇంగ్లీష్లో ‘మదర్ గాడెస్సెస్’ అంటారు. ఆయా గ్రామాల ఆచార, సంప్రదాయాలకు, సంస్కృతికి చిహ్నాలు గ్రామదేవతలు. ఆయా గ్రామాల ప్రజలు తమ విశ్వాసాలకు, సంప్రదాయాలకు ప్రతినిధులు ఈ గ్రామదేవతలు. ప్రజల విశ్వాసాలు వాళ్ళని కొన్ని ప్రత్యేకసందర్భాల్లో ఒక్కటిచేసే విశ్వాససృష్టి గ్రామదేవతలు. నిజానికి గ్రామదేవతలకు రూపమేదీ వుండదు. ఆకారంలేని రాళ్ళని కాని, కొయ్యబొమ్మల్నికాని, కొన్నిసార్లు గూడు(డోల్మన్)వంటి రాతిసలపలగుడిలో దీపం, గురుగులు పెట్టి దేవతలంటారు. కాని, రూపాలను ధ్యానించు కుంటారు. హిందూదేవతలలో కొందరు అమ్మదేవతల విగ్రహాలు గ్రామాల్లో గ్రామదేవతలుగా పూజలందు కుంటున్నాయి. ఈ దేవతలకు ప్రత్యేకమైన దినాల్లో, పండుగలపుడు జాతరలు చేస్తుంటారు.
          పురాణాల్లో గ్రామదేవతలను శక్తిస్వరూపిణులుగా వర్ణించారు. దాదాపు కాళీదేవతను, సప్తమాతృకలలో ఒకరైన చాముండిని గ్రామదేవతలుగా ప్రతిష్టించారు. గ్రామదేవతలు మహిమగలవారని, తమ గ్రామప్రజలను, పంటలను, పసులను, పిల్లలను కాపాడే ఏకైకదేవతలుగా గ్రామీణప్రజల విశ్వాసం.
గ్రామదేవతల పుట్టుకః
          గ్రామదేవతలు గ్రామాల పుట్టుకకన్నా ముందే పుట్టినవారు. ఆదిమజాతి ప్రజలు సంచారజీవనం వదిలి, స్థిరనివాసం కొరకు ప్రయత్నించే సందర్భాల్లోనే కలిగిన భయాల నివృత్తికి ప్రకృతిని వేడుకున్నారు. చెట్టునో, పుట్టనో, రాయినో, రప్పనో ఆరాథించారు. భయపెట్టే ఉరుములు, మెరుపులు, వానలు, వరదలు, పాములు, చెట్లు, జంతువులు వాళ్ళకు వేడుకోదగినవిగా అనిపించాయి. చాలినంత ఆహారం దొరికినపుడు, పంటలు బాగా పండినపుడు, వాళ్ళు కావాలనుకున్నవి లభించినపుడు, ఆపదలు తప్పిపోయినపుడు ఆ సంఘటనలకు మూలమనుకున్న వారే దేవతలని, వారికి నమస్కరించడం అలవర్చుకున్నారు. ఆరాథించడం సంప్రదాయంగా చేసుకున్నారు. తమకు దొరికిన ఆహారం, ఇతర ఉత్పత్తులను రాశులుగా పోసి, బోనాలుపెట్టి, సాకలుపెట్టి ధన్యవాదాలు తెలిపే ఆచారమే గ్రామదేవతల పూజలుగా గ్రామసంస్కృతిలో భాగమైపోయాయి.
గ్రామదేవతల ఆరాధనః
1.       కొందరు గ్రామదేవతలకు తప్ప ఎక్కువమట్టుకు రాతిసలపలతో కట్టిన గూడుగుళ్ళే వుంటాయి.
2.       ఈ గుళ్ళల్లో విగ్రహాలు చెక్కిన శిలారూపాలు శైవదేవీరూపాలై వుంటాయి.
3.       ఎక్కువపాళ్ళు శిల్పం లేని రాళ్ళో, బొమ్మచెక్కిన కర్రలో, ప్రత్యేకంగా కుండలో పెట్టి పూజింపబడుతుంటాయి.
4.       ఈ గ్రామదేవతల గుళ్ళు గ్రామంలో పొలిమేరల్లో, వేపచెట్లకింద, పొలాల దగ్గర, పర్రెలు, చెరువులు, గడులు, కోటల వద్ద వుంటాయి.
5.       గ్రామదేవతలను పూజించడానికి బ్రాహ్మణులు కాక శూద్రవర్ణాలవాళ్ళు పూజలు జరుపుతుంటారు. మంత్రాలుండవు. పసుపు,కుంకుమలు, గండదీపాలు, వేపమండలు, ఆకులు,పూలు, బోనాలు, జంతుబలులు ఆరాధనలో పూజాద్రవ్యాలుగా వుంటాయి. దీపాల గూళ్ళు, తొట్టెలలు, కొబ్బరికాయలు ముడుపులుగా కడుతారు.
6.       గ్రామదేవతలందరు భయంకరమూర్తులుగానే గ్రామీణప్రజలు నమ్ముతుంటారు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికే జంతుబలులు,కల్లు,సారా సాకలు, బోనాలు కావాలని నమ్ముతుంటారు. అందుకే గావుపట్టడం, పొలిజల్లడం వంటి తంతులు చేస్తుంటారు.
7.       గ్రామదేవతలను కొందరు కాళీరూపంగానే చెప్పడం వల్ల మహిషాసురమర్దిని రూపంలోనో, చాముండి రూపంలోనో కొలువడం, ఆ విగ్రహాలను ప్రతిష్టించి పూజంచడం ఆనవాయితీగా వస్తున్నది.
8.       కొన్నిచోట్ల వేపవంటి చెట్లకు  పసుపు,కుంకుమలు పెట్టి పూజించడం కూడా గ్రామదేవతల అర్చనగానే భావిస్తున్నారు.
9.       పొలాల్లో వరి అలుకుచల్లినపుడు 5రాళ్ళు పెట్టి పూజించడం, అలుకుబోనం పెట్టడం, పంటకోసినపుడు పంటబోనం పెట్టడం కూడా గ్రామదేవతల పూజలో భాగంగానే చెప్పవచ్చు.
10.   గ్రామదేవతలకు ఏడాదికొకసారి,రెండేండ్ల కొకసారి జాతరలు చేస్తుంటారు. పోషమ్మ పండుగ, మైసమ్మపండుగ, దుర్గమ్మపండుగ వంటివి అట్లాంటివే.
11.   గ్రామదేవతల పూజలలో సిగం లేదా పూనకం వచ్చిన సివసత్తులు(శివశక్తులు) పాల్గొంటారు. నిప్పుల గుండాలు తొక్కుతుంటారు.
12.   గ్రామదేవతలకు అన్నపురాశుల కుంభంపోసి, దున్నపోతును బలియిచ్చే ఆచారమొకటి వుండేది. దున్నపోతు బలిరక్తంతో తడిసిన అన్నాన్ని గంపల్లో,చేటల్లో ఎత్తి ఊరిచుట్టు పొలి చల్లుతారు.

గ్రామదేవతలు-స్త్రీలుః
          ఆదిమకాలంలో మాతృస్వామ్యమే వుండేది. కుటుంబ యజమాని స్త్రీనే. బయటవుండి గ్రామరక్షణ, వేట వంటి పనులు పురుషులు చూసుకుంటే, స్త్రీలు సమస్తమైన ఇంటిపనులన్నీ నిర్వహించేవారు. వ్యవసాయం, నేతపని, బుట్టల అల్లిక, అలంకరణ వస్తువుల తయారీ, కుండల తయారీ వంటి అనేకమైన ఇంటికవసరమైన పనులన్నీ స్త్రీలే చూసుకునేవారు. పురుషులంతా స్త్రీలమీదే ఆధారపడివుండేవారు.
          ప్రత్యుత్పత్తిశక్తి స్త్రీకే వున్నదని, పిల్లల్నికని, పాలిచ్చి పెంచే సహజశక్తులను స్త్రీల ప్రత్యేకశక్తులుగా గుర్తించి సమాజం స్త్రీలను దేవతలుగా గౌరవించేవారు. అన్ని రకాల రక్షణ, పోషణ, ఉత్పత్తిశక్తుల అనుగ్రహ, ఉపసంహార దైవీభావశక్తులున్నట్లుగా భావించిన గ్రామీణప్రజలు గ్రామదేవతలందరిని స్త్రీరూపాల్లోనే పూజించారు. గ్రామదేవతల సంఖ్య 101 వుంటాయంటారు. కాని, గ్రామాలవారీగా లెక్కిస్తే గ్రామదేవతలు లెక్కకు మిక్కిలిగానే వుంటారు.
తెలంగాణాలో అమ్మదేవతలుః కొందరి పేర్లు
1.పోచమ్మ,            2. మైసమ్మ      3. బాలమ్మ      4. ఉప్పలమ్మ              5. దుర్గమ్మ
6.మాతమ్మ,           7.మార్కమ్మ     8.భూదేవమ్మ    9.మావురాల ఎల్లమ్మ     10. మహంకాళి
11. ముత్యాలమ్మ     12.ఈదమ్మ      13.సరద్దుల పోచమ్మ 14.వనం మైసమ్మ    15.గిద్దెలమ్మ
16.డొక్కలమ్మ         17.మాచానమ్మ  18.మారెమ్మ     19.పెద్దమ్మ                 20.చౌడమ్మ
21.కట్టమైసమ్మ       22. గడిమైసమ్మ 23. పోలి మైసమ్మ 24. గండి మైసమ్మ     25.నల్లపోషమ్మ
26. బంగారు మైసమ్మ 27. పోలేరమ్మ  28. మమ్మాయి 29. అంకాలమ్మ           30.సుంకులమ్మ


గ్రామదేవతలు- పురుషులుః
          గ్రామదేవతల్లో పోతురాజొక్కడే ఎక్కువగా కనిపిస్తుంటాడు. గ్రామదేవతల తమ్ముడుగా పోతురాజు ఆయా గ్రామదేవతల గుళ్ళముందు ఆలయపాలకుడుగా వుంటాడు. రాతిగుండునో, కొయ్యబొమ్మనో గ్రామదేవత గుడిముందు పాతి పూజిస్తారు.

గ్రామదేవతల ప్రాధాన్యతః
          పెద్ద,పెద్ద గుడులలోని పెద్దదేవతల కన్నా గ్రామీణులు గ్రామదేవతలనే ఎక్కువగా పూజిస్తారు. వారి నిత్యజీవన కార్యకలాపాల్లో గ్రామదేవతలు భాగమైవుంటారు. అడుగడుగునా మొక్కుతుంటారు. ముడుపులు కడుతుంటారు. ఈ ఆచారం, సంప్రదాయం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా, ఈజిప్టు, గ్రీకు, మెక్సికో వంటి దేశాల్లో అమ్మదేవతల ఆరాధన కనిపిస్తుంది. సృష్టికర్తను వెతకరు గ్రామీణప్రజలు, కాని, అంతకన్నా గ్రామదేవతలనే ముఖ్యంగా భావిస్తారు.
          తెలుగుసాహిత్యంలో వినుకొండ వల్లభరాయుని ‘క్రీడాభిరామం’లో, శ్రీనాథుడు రచించిన ‘హరవిలాసం’లో గ్రామదేవతల ఆచార,వ్యవహారాలు తెలుస్తున్నాయి.





వజ్రయాన చైత్యాలయం:
         
అరుదైంది, అద్భుతమైంది, అపూర్వమైంది, అనితరమైంది, సాటిలేనిది. ఇంతవరకు దేశంలో ఎక్కడకూడా దీనిని పోలిన నిర్మాణం లేదు. మట్టి ఇటుకలతో నిర్మించిన గుడులలో ఉత్తరభారతదేశంలో ఒక గుడి వుంది, రెండవది గొల్లత్తగుడి మనతెలంగాణాలోనే వుంది. కాని రాతిఇటుకలతో నిర్మించిన దేవాలయం దేశంలో మరెక్కడా లేదు.
ఇటీవల  పర్యాటకదినోత్సవం(2017) నాడు తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో  తెలంగాణచరిత్రను అన్వేషిస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్,వేముగంటి మురళీకృష్ణ,కట్టా శ్రీనివాస్, అరవింద్ ఆర్య, సదానందం,వేముగంటి సమీర్ కుమార్, అహోబిలం కరుణాకర్,సామలేటి మహేశ్,చంటిలతో పాటు కొత్తూరు గ్రామస్తులు సర్పంచ్ రవీందర్ రావు,మరి ఇద్దరు దేవునిగుట్టమీది చైత్యాలయాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ గుడిని టీవి99వారు, సాదిక్ అలీబృందం, మరికొందరు చూసారు.
 6 లేదా 7వ శతాబ్దంలో నిర్మించబడ్డ వజ్రయాన(మహాయాన) బౌద్ధారామం లేదా చైత్యాలయమిది. 9వ శతాబ్దంలో ఇండోనేషియా సెంట్రల్ జావాలోని మేగలాంగ్ లో నిర్మించిన బోరోబుదూర్ మహాయాన బౌద్ధదేవాలయానికి, 13వ శతాబ్దంలో కాంబోడియా దేశంలో 400 ఎకరాలలో నిర్మించబడ్డ ప్రపంచప్రఖ్యాతమైన అంకర్ వాట్ దేవాలయానికి  ఈ చైత్యాలయం మాతృక వంటి నిర్మాణం. అంకర్ వాట్ వజ్రయాన బౌద్ధదేవాలయం పెద్ద, పెద్ద రాళ్ళను ముక్కలుగా చేసి వాటిమీద చెక్కిన శిల్పాలను ఇటుకల లెక్క పేర్చి కట్టినది. అవి ఎత్తైన శిల్పాలు. అవి భారీనిర్మాణాలు. మన తెలంగాణలోని జయశంకర్-భూపాలపల్లి జిల్లా, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో వున్న దుర్గమారణ్యంలో దేవునిగుట్టమీద రాతి ఇటుకలమీద చెక్కిన శిల్పాలతో కట్టిన గుడివుంది. 24(30-6) అడుగుల ఎత్తున్న ఈ బౌద్ధ చైత్యాలయం గోడలు బయటివైపు, లోపటివైపు రెండువైపులా శిల్పాలతో అలంకరించబడ్డాయి.దీనికి పైవైపు మొనదేలిన పిరమిడ్ ఆకారంలో విమానశిఖరం వుండి వుండాలి. ప్రస్తుతం అది కొంత 6అడుగులదాకా కూలిపోయివుంటుంది.పైన శిఖరానికి రంధ్రం ఏర్పడివుంది. అంకర్ వాట్ దేవాలయానికి, దేవునిగుట్ట గుడికి గుడినిర్మాణంలో, బౌద్ధశిల్పాలలో పోలిక వుంది.అంకర్ వాట్ దేవాలయం అతిపెద్ద దేవాలయాల కాంప్లెక్స్. కాని దేవునిగుట్ట మీది గుడి ఒక్కటే.ఆకారంలో చిన్నదే.కాని చారిత్రకంగా గొప్పది. ఈ చైత్యాలయం నిర్మాణంలో వాడిన రాతిఇటుకలను గుడిపక్కన వున్న రాతిబండలనుండి తీసినట్టున్నారు.లేత ఎరుపురంగులో వున్న ఇసికరాతి ఇటుకలతో కట్టారు.ఈ రాతిఇటుకలు సాధారణమైన రాళ్ళకంటే చాలా తక్కువ బరువును కలిగివుంటాయి.అయితే ఈరాతిముక్కల అంచులు  తొందరగా  రాలిపోతాయి కనుక మొదట వీటిని చిన్న,చిన్నసైజులలో( 2*2అడుగులు, 2*1అడుగుల కొలతలలో) రాతిబిళ్ళలుగా చేసుకుని ఆలయనిర్మాణం చేసారు. గుట్టమీద పునాదుల అవసరం లేకుండా, మొత్తం 4.5అడుగుల మందంతో మధ్యలో ఖాళీని వదిలిన రెండు పొరల గోడలతో నిర్మించినట్టు తెలుస్తున్నది.గుడిలోపల 10అడుగుల వైశాల్యంతో,బయటిగోడలు ఒక్కొక్కటి 19.6 అడుగుల కొలతతో గుడినిర్మాణంలో కూడా ఈ చైత్యాలయం ప్రత్యేకత కలిగివుంది. ఈ చైత్యాలయానికి ముందువైపు ద్వారంతో 3 రాతిఇటుకలగోడలు 6అడుగుల ఎత్తున కట్టబడివున్నాయి. ఆలయానికి వంద అడుగులకన్నా ఎక్కువదూరంలో రాతిగుండ్లుపేర్చిన గోడ నలువైపుల వుంది.గుడికి ఉత్తరం దిశలో సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు వుంది.
గుడికి ఒక మూలన నిలబెట్టివున్న పాలరాతి స్తంభం బౌద్ధస్తూపాలవద్ద నిలిపివుంచే ఆయకస్తంభం,దానికి నాలుగువైపుల అర్ధపద్మాలు, సింహాలు చెక్కివున్నాయి.క్రీ.శ.1లేదా 2వ శతాబ్దాలకు చెందినదనిపించే ఆయకస్తంభంవల్ల ఈ స్థలం చైత్యాలయం కన్నా ముందునుంచే బౌద్ధస్థావరంగా వుండేదని అర్థమవుతున్నది.
దేవునిగుట్ట చైత్యాలయం తూర్పుకు ఎదురుగా ఒకేద్వారంతో నిర్మించబడ్డది. ఎత్తు తక్కువున్న చిన్నద్వారం. ద్వారానికిరువైపుల ద్వారపాలకులవలె కన్పిస్తున్న వజ్రయాన బౌద్ధమూర్తులలో ఒకరు హరివాహన లోకేశ్వరుడు.ఎటు 10అడుగుల చతురస్రాకారపు చైత్యాలయపు లోపల 20,30యేండ్ల కింద ఏ దేవుని ప్రతిమ లేదు. ఈ గుడిబయట ఒక రాతివేదికమీద నంది విగ్రహం వుండేదిట.ఇపుడది లేదు.ప్రస్తుతం గుడిలో ఒక సిమెంటు వేదికమీద కొత్తూరు గ్రామప్రజలు ప్రతిష్టించుకున్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం వుంది. ఆ దేవునికే ప్రతి కామునిపున్నమి లేదా హోళిపండుగ సందర్భంగా జాతర చేసుకుంటున్నారిక్కడి గ్రామస్తులు.
లోపలి గోడలకు ద్వారంవైపు తప్ప మిగతా 3గోడలమీద బుద్ధజాతకకథలకు చెందిన కథాదృశ్యాలు చెక్కివున్నాయి.బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు 2,3 చోట్ల వున్నాయి. ఒకచోట యుద్ధసన్నివేశం చెక్కబడివుంది.దానిలో చేతిలో ఖడ్గంతో కుషానుని పోలిన శిల్పం వుంది. మిగతా రెండుగోడలమీద కూడా బౌద్ధజాతకకధలే.అందులో బుద్దుని బోధనల సంఘటనలే ఎక్కువగా చెక్కబడివున్నాయి.బయటిగోడలమీద వివిధదృశ్యాలు 6రేసి ఫ్రేములుగా విభజించబడ్డాయి.మధ్యలోని శిల్పాలు పెద్దవిగా మిగతావి చిన్నవిగా వున్నాయి. ఒక్కటొక్కటిగా శిల్పాలను చెక్కి పేర్చిన రాతిఇటుకలు కింది నుండి పైకి సైజు తగ్గుతూ పోయాయి. దక్షిణంవైపు గోడమీద అజంతా చిత్రాలలోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో రాణితో కూర్చున్న దృశ్యం వుంది.అటిటు రెండుపక్కల బోధిసత్వుని అవతారరూపాల శిల్పాలున్నాయి.పైన ఫ్రేముల్లోను బుద్ధబోధనల దృశ్యాలే కనిపిస్తాయి. పడమటివైపు గోడమీద కిందివైపు అర్ధనారీశ్వర శిల్పం చెక్కివుంది.ఈశ్వరుని అర్ధభాగం,పార్వతి అర్ధభాగం స్పష్టంగా చెక్కబడింది.6 అడుగులు,8అడుగుల కొలతల ఈ ఫ్రేములో చతుర్బుజుడైన అర్ధనారీశ్వరుని కుడిచేయి గణపతి తలమీద, ఎడమచేయి కుమారస్వామి తలమీద పెట్టినట్లు చెక్కబడ్డాయి. దానిపై వరుసలో బుద్ధునిబోధనలు వింటున్న రాజు,రాణులు,పరివారం, మిథునాలు వున్నాయి. పై అంచుల రాతిఇటుకలపై సాగరమథనం చెక్కబడివుంది. ఉత్తరంవైపు గోడమీద చెక్కిన కథాదృశ్యం కొత్తదిగా వుంది. భయంకరంగా వున్న పెద్దతల కలిగిన బోధిసత్వుడు(జంభాలుడు?) ఎడమమోకాలితో ఎవరివీపునో వంచి, ఎడమ చేత అతని గొంతును వెనక్కి విరిచి నొక్కుతున్నట్టుగా వుంది. ఆ గోడమీద వున్న హరివాహనలోకేశ్వరునికిరువైపుల అంచుగా నిలిపిన ఇటుకలమీద రెండు పూర్ణకుంభాలు చెక్కబడివున్నాయి. బౌద్ధస్తూపాలున్నచోట ఇవి సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ గోడకే శిఖరంవైపు ఈశాన్యపు అంచున చెక్కబడివున్న అమితాభునిశిరస్సు శిల్పం కాంబోడియా అంకర్ వాట్ దేవాలయం మీది పెద్ద రాతిముక్కల శిల్పానికి మాతృక అనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలు అజంతాచిత్రాల తోను, అమరావతి,ఫణిగిరి,నాగార్జునకొండ బౌద్ధశిల్పాలతోను,ఒరిస్సాలోని స్కందగిరి, ఉదయగిరి శిల్పాలతోను పోలికలు కలిగివున్నాయి.ఈ దేవాలయానిది విశిష్టమైన శిల్పశైలి.అనితరమైనది.
బౌద్ధచైత్యాలయంలో శైవం కనిపించడం వజ్రయానప్రభావమే.తెలంగాణాలో బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని,మంత్రయానమని పిలువబడే వజ్రయానానికి మంత్రాలు,ధారణులు,ముద్రలు,స్త్రీదేవతారాధన, లైంగిక యోగసాధనలు లక్షణాలు.భిక్షుకుల మతంగా వున్న బౌద్ధం, ఉపాసకులమతంగా మారిపోవడం, ఇతరమతాలైన జైన,వైష్ణవ, శైవాలు తాంత్రికపద్ధతులను అవలంబించడం 7వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకు  కొనసాగింది. వజ్రయానం నాగార్జునునికొండ నుండే ప్రపంచమంతటికి విస్తరించింది. చైత్యకులు బుద్ధుడిని భగవంతుడిని చేసారు.మహాదేవునిగా అంగీకరించారు.దాని ఫలితమే బౌద్ధంలో శివుడు కనిపించడం.వజ్రయాన ప్రతిమారూపభేదాలలో (Iconography) అక్షోభ్యుని ప్రతిమ లేదా స్తూపం నమూనా వుండడం వంటివి కనిపిస్తుంటాయి.
కొత్త సిద్ధిపేట జిల్లా సింగరాయగుట్టమీద బౌద్ధబ్రహ్మ, పాతవరంగల్ జిల్లాలో ఇటీవల బయటపడ్డ అమితాభ్య, తారాదేవి ప్రతిమలు ఈ ప్రాంతంలో వజ్రయానం యొక్క ఉచ్ఛస్థితిని సూచించేవే.అయితే మొదటినుంచి రాజాశ్రయం అరకొరగా లభించిన బౌద్ధం కొట్టుమిట్టాడుతు జీవించింది. అంతేగాక కాలాముఖ,పాశుపతుల దాడులకు గురైంది. పాండవులగుట్ట గొంతెమ్మగుహలో వున్న ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’శాసనం బౌద్ధ,జైనాలకు పరమమాహేశ్వరులు చేసిన హెచ్చరిక. ఇన్ని పరిణామాల మధ్య దేవునిగుట్ట మీద ఈ చైత్యాలయం బతికిబట్టకట్టడం ఆశ్చర్యమే.చరిత్రచేసుకున్న భాగ్యమే.











































నల్లమల అడవుల్లో మేడిమల్కల్  కాకతీయ శాసనం:

          రాష్ట్రరాజధాని హైదరాబాదుకు 185కి.మీ.ల దూరంలో వున్న మన్ననూరు, నల్లమల అడవుల్లోని బౌరాపురంకు మరో 10 కి.మీ.ల దూరంలో మేడిమల్కల్ అనే చిన్న చెంచుగ్రామం వుంది. ఆ వూరిచివర అడవిలో వుంది ఈ శాసనం.
          శాసనంలో మేడిమల్కల్ కు పూర్వనామం ‘మేడిమ లంకలు’ అని వుంది.
మేడిమల్కల్ శాసనం కాకతీయుల కాలంలో వేయించినది. శ్రీపర్వతం(శ్రీశైలం)లోని స్వయంభువుడైన శ్రీలింగచక్రవర్తి మల్లికార్జున మహాలింగదేవుని కలుమఠానికి పూర్వదత్తమైన మేడిమలంకలు అనాదిగా చెల్లుతుండంగ నడుమ కొంతకాలం కారణాంతరాలవల్ల విచ్ఛిత్తి కాగా మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్యం చేస్తున్న కాలంలో శక సం.1211 విరోధినామ సం.ఫాల్గుణ శుధ్ద 15(పౌర్ణిమ),సోమ(చంద్ర) గ్రహణం సందర్భంగా అనగా క్రీ.శ.1290 సం. ఫిబ్రవరి 25న, కాకతీయ మహాసామంతుడు చెరకు ఇమ్మడి బొల్లయరెడ్డివారు శ్రీ మల్లినాథదేవుని అంగ,రంగ భోగాలకు గాను కలుమఠానికి అక్కడ శాశ్వతంగా వుండే శివాచార్యుల చేత ధారాపూర్వకంగా (మళ్ళీ) ఇచ్చిన మేడిమలంకలు  ఆచంద్రార్కస్థాయిగా వుండాలని భావించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి సమీమంలోని జలాల్పూర్ ఒకప్పుటి  జమ్మలూరు. చెరకు ఇమ్మడి బొల్లయరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ దాకా విస్తరించిన  జమ్మలూరు పురవరాధీశ్వరుడు చెరకు ఇమ్మడి విశ్వనాధుని కుమారుడే ఈ బొల్లయరెడ్డి(?).
          ఈ శాసనస్తంభం ఎరుపురాయి. శాసనం స్పష్టంగా, పెద్ద,పెద్ద తెలుగు అక్షరాలలో చెక్కివుంది. లిపి 13వ శతాబ్దంనాటి తెలుగు. ఈ శాసనంలో క,ళ, రకార పొల్లులు ప్రత్యేకం. 7,8 శతాబ్దాల నాటి ళ. ర కార పొల్లులు, 11వ శతాబ్దంనాటి క ఈ శాసనంలో కనిపిస్తాయి. రెండువైపుల 38పంక్తులలో చెక్కబడిన శాసనమిది. శాసనం రెండవ వైపు కాకతీయుల సాంప్రదాయికమైన సూర్య,చంద్రులు, శివలింగం, ఖడ్గం, ఆవు చిహ్నాలు చెక్కివున్నాయి. శాసనం చివర దానశాసన సంప్రదాయం ప్రకారం శాపోక్తి శ్లోకం ‘‘స్వదత్తాం పరదత్తాం’’ చెక్కివుంది.
           ఈ శాసనం తేదీ గొప్పమనిషి, ప్రఖ్యాత చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ పరిష్కరించిన  ప్రసిద్ధమైన రాగిరేకుల ‘ఉత్తరేశ్వర శాసనం’ తేదీ ఒక్కటే కావడం యాదృచ్ఛికం, చారిత్రాత్మకం.

మేడిమలంకలు అనబడు మేడిమల్కల్ శాసనపాఠం:
(డిజిటల్ ఫోటో కాపీ)
1.       @స్వస్తిశ్రీ శ్రీపర్వత శ్రీ
2.       స్వయంభు శ్రీలింగచక్రవర్తి
3.       శ్రీ మల్లికార్జున మహాలింగ
4.       దేవుని కలుమఠమునకు పూ
5.       (ర్వో)దత్తైన మేడిమలంకలు
6.       అనాది సంసిద్దమై చెల్లు
7.       చుండగాను నడుమం
8.       గొంతకాలము విచ్చిత్తై(వు)
9.       0డితేని స్వస్తి శ్రీ మ
10.   హామండలేశ్వర కాక(తి)
11.   య్య ప్రతాపరుద్రదే(వ)
12.   మహారాజులు ప్రిథ్వి (రా)
13.   జ్యము సేయుచుండ(గా)
14.   ను స్వస్తిశ్రీ శక వర్ష
15.   ములు 1211లవు
16.   విరోధి సంవత్సర ఫా
17.   ల్గుణ శు15వ నాండి
18.   (సో)మగ్రహణకాలమున
19.   ....డు స్వస్తిశ్రీ మహాసా
20.   మంత చెఱకు ఇమ్మడి బొల్ల
21.   మరెడ్డివారు శ్రీ మల్లినా...

రెండవవైపు

సూర్యుడు,(చంద్రుడు)
శివలింగం,ఖడ్గము, ఆవు చిహ్నాలు

22.   థ దేవుని అంగరంగ భో
23.   గాలకు కలుమఠనకు శ్రీ
24.   మతు శాశ్వత శివాచా
25.   ర్యుల చేత ధారాపూర్వ
26.   కము సేసి ఇచ్చి మేడిమ
27.   లంకలు ఆచంద్రార్క
28.   స్థాయిగా భావించిరి మ
29.   0గళ  మహా శ్రీశ్రీశ్రీ
శాపోక్తి శ్లోకం:(8 పంక్తులు)
1.       స్వదత్తా ద్విగుణంపుణ్య
2.       0 పరదత్తానుపాలనం
3.       పరదత్తాపహారేణ స్వ
4.       దత్తం నిష్ఫలం భవేత్
5.       స్వదత్తం పరదత్తం వా
6.       యో హరేతి వసుంధరాం
7.       షష్టిర్వర్ష సహస్రాణి
8.       విష్టాయాం జాయతే క్రిమిః
మొత్తం శాసనం 37 పంక్తులు
(శాసనం ఫోటోల కర్టెసీః వివేక్, తెలంగాణ టుడే, మహబూబ్ నగర్)
                                                          ఈ శాసనాన్ని చదివి,శాసనపాఠం రాసింది.
శ్రీరామోజు హరగోపాల్






మలి కాకతీయుల ప్రస్థానం: ఒక అన్వేషణ
(బస్తర్ కాకతీయులు)





                                                        పత్రసమర్పణః
                                                        శ్రీరామోజు హరగోపాల్,
                                                        వేముగంటి మురళీకృష్ణ,
                                                        కట్టా శ్రీనివాస్,
                                                        అరవింద్ ఆర్య
                                          కొత్తతెలంగాణ చరిత్రబృందం,
                                                హైదరాబాద్
మలి కాకతీయుల ప్రస్థానం: ఒక అన్వేషణ
(బస్తర్ కాకతీయులు)
         
          తెలంగాణ చరిత్రలో కాకతీయులది ఉజ్వల చారిత్రకఘట్టం. చరిత్రకారుల రాతలనుబట్టి, శాసనాధారాలనుబట్టి  కాకతీయుల వంశానుక్రమణిక దుర్జయునితో మొదలౌతుంది. వెన్న, 3గురు గుండనలు, ఎర్రయ, పిండి(4వ) గుండన, గరుడాంక బేతయ, 1వప్రోలరాజు, రెండవ బేతియ, రెండోప్రోలుడు, రుద్రుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రదేవునితో అంతమవుతుంది. క్రీ.శ. 900 సం.లకు ముందునుంచి క్రీ.శ. 1323 వరకు కాకతీయ యుగం కొనసాగింది.
తర్వాత?
ఓరుగల్లుపై ఢిల్లీ పాలకుడు ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలూగ్ ఖాన్ దండయాత్రలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రదేవుడు ఓడిపోయి బందీయైనాడు. బందీయైన ప్రతాపరుద్రదేవుణ్ణి ఢిల్లీకి తీసుకుని వెళ్తున్నపుడు నర్మదానదిలో దూకి ప్రాణత్యాగం చేసాడన్న కథనమే ఎక్కువ ప్రచారంలో వుంది. సిద్ధేశ్వర చరిత్రంలో కాసె సర్వప్ప ప్రతాపరుద్రదేవుణ్ణి ఢిల్లీ సుల్తాన్ రాచమర్యాదలతో మన్నించి వదిలివేసాడని, కాని, ప్రతాపరుద్రుడు తిరిగి రాజ్యానికి రానొల్లక కాళేశ్వరంలో శివదీక్షలో వుండి ప్రాణార్పణ చేసాడని రాసాడు.
ప్రతాపరుద్రునికి పట్టమహిషి విశాలాక్షి కాక లక్ష్మీదేవి అనే మరో భార్య వున్నట్టు కరీంనగర్ జిల్లా ఎలిగేడు శాసనంలో ప్రస్తావించబడింది. జుత్తయలెంక గొంకారెడ్డి, కృష్ణనాయకులు ప్రతాపరుద్రుని కొడుకులని కొన్ని దస్తావేజుల రాతలవల్ల తెలుస్తున్నదని, నిజానికి వారు ప్రతాపరుద్రునికి నమ్మకమైన సామంతులు మాత్రమేనని పివి పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో రాసాడు. ప్రతాపచరిత్రలో ‘ ప్రతాపరుద్రుని మరణానంతరం అతని కుమారుడైన వీరభద్రుడు రాజయ్యాడని, ప్రతాపరుద్రుని సోదరుడు అన్నమదేవుడు స్వయంగా వీరభద్రునికి పట్టాభిషేకం జరిపించాడని వుంది. చారిత్రక ఆధారాలైతే లభించలేదు. ప్రతాపరుద్రుని కొడుకు వీరభద్రుడు పాలించిన రాజ్యం వివరం లేదు. ఊహాగానాలైతే చేయబడ్డాయి.
ప్రతాపరుద్రుడు తన సోదరుడు అన్నమదేవునికి రాజ్యభారం అప్పగించబోతే వద్దన్నాడని, అన్నకొడుకు వీరభద్రున్ని కాకతీయరాజ్యానికి రాజును చేసాడని సర్వప్ప కూడా తన సిద్దేశ్వరచరిత్రంలో రాసాడు. అయితే ప్రతాపరుద్రుడు తన మరణానికి ముందు అందరికి తనవద్దవున్న ధనాన్నంతా పంచేటప్పుడు కోట్లధనమిచ్చాడట అన్నమదేవునికి. ప్రతాపరుద్రుని అనంతరం అన్నమదేవుడు ఇక్కడుండనొల్లక బస్తర్ అడవుల్లోకి వెళ్ళిపోయాడని ఒక కథనం.
ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఒకప్పటి బస్తర్ రాజ్యానికి ఏలిక అన్నమదేవుడని బస్తర్ రాజు(1703) దిక్పాలదేవుడు వేయించిన దంతేశ్వరి దేవాలయంలోని శాసనం వల్ల తెలుస్తున్నది.(ఎఫిగ్రాపియా ఇండికా-9సం. పే.242-250)
అన్నమరాజు అని సంబోధించబడ్డ అన్నమదేవుడు బస్తర్ వెళ్ళి అక్కడ అప్పటివరకు బస్తర్ రాజ్యాన్ని పాలించే నాగవంశీయులను ఒక్కొక్కరిని ఓడించి వారి రాజ్యాలను ఆక్రమించాడట. అక్కడ ప్రవహించే శంఖిని, ఢంకనీ నదులు కలిసే చోట దంతేశ్వరలో ఒక దేవాలయ నిర్మాణం చేయించి, ఓరుగల్లులో ‘మాణిక్యేశ్వరి’గా పూజించిన దేవత ప్రతిరూపాన్నే ఇక్కడ ‘దంతేశ్వరి’దేవిగా ప్రతిష్టించాడట.
నాగపూర్ కు చెందిన రాయ్ బహదూర్ లాల్ పరిష్కరించిన దంతేశ్వర శాసనం రెండు శాసనఫలకాల మీద
హిందీ, సంస్కృత భాషలలో చెక్కబడ్డ ఒకే శాసనం. ఇవి దంతేశ్వరి గుడిలో లభించాయి. బస్తర్ రాజ్య రాజధాని జగదల్పూర్ కు 60మైళ్ళ దూరంలో వుందీ గుడి. అప్పటి బ్రిటిష్ ఇండియా సెంట్రల్ ప్రావిన్సెస్ ఛీఫ్ కమీషనర్ కల్నల్ గ్లాస్ ఫర్డ్ ఆధ్వర్యంలో గుడిలోపల మట్టిలో కూరుకునిపోయిన ఈ రెండు శాసనాలు బయటికి తీయించబడ్డవి. 1862లో కల్నల్ గ్లాస్ ఫర్డ్ వీటి గురించి రాసిన నివేదిక భారతప్రభుత్వం విదేశశాఖ రికార్డులలో 39వ సెలక్షన్ గా ప్రచురించబడ్డది. ఈ నివేదికలోని పేజి సం. 99,100 లలో ఈ శాసనాల చూచిరాత ప్రతులు ఇవ్వబడ్డాయి. కాని, శాసనప్రతులు లోపభూయిష్టంగా తయారైనాయి. తరవాత వాటిని మద్రాసు ఆర్కియాలజికల్ శాఖకు చెందిన వెంకోబరావుగారిచేత మంచి శాసనప్రతులను తీయించి రాయ్ బహదూర్ లాల్ ఎడిట్ చేసాడు. సంస్కృతశాసనం 23 పంక్తులలో, హిందీ శాసనం కూడా 23పంక్తులలో రాయబడ్డాయి. రెండు కూడా నాగరిలిపిలో వున్నాయి. స్థానికంగా చెప్పుకునే హేమద్ పంథిలో వుండే  డ్రాగన్ బొమ్మ హిందీశాసనం మొదట శాసనఫలకంపై చిత్రించబడి వున్నది. శాసనాల లిపిలో తప్పులు కనిపిస్తున్నాయి. ఈ శాసనాలు మిథిలపండితుడైన రాజగురువు భగవాన మిశ్రా చేత రాయించబడినవి. సంస్కృతశాసనంలో ప్రతాపరుద్రీయం నుంచి తీసుకోబడిన ఒక పద్యం పేర్కొనబడింది.
          హిందీ శాసనం మొదట ‘కలియుగంలో కొద్దిమందికే సంస్కృతం తెలుస్తుంది కనుక శాసనాన్ని హిందీలో రాయించడమైనది’ అని వుంది.
          రెండు శాసనాలలో ఒకే విషయమే రాయబడింది. (విక్రమ) సంవత్ 1760 అంటే క్రీ.శ.1702లో వేయబడిన శాసనాలలో రాజు దిక్పాలదేవ దంతావల దేవి గుడికి జరిపిన ‘కుటుంబయాత్ర’ గురించి చెప్పబడింది. ఈ యాత్రా ఉత్సవం చైత్ర శుద్ధ చతుర్దశి మొదలు చైత్ర బహుళ తదియ వరకు 5రోజులపాటు నిర్వహించబడింది. ఈ పండుగ లేదా జాతరలో వేలాది గొర్రెలు, మేకలు దేవతకు బలివ్వబడ్డాయని, శంఖిని నదినీళ్ళు 5రోజులపాటు ఎర్రగా మారి పోయాయని శాసనంలో వివరించబడ్డది. ఈ ఉత్సవం గురించి కల్నల్ ఇల్లియట్(1856) రాజగృహంలో ఏదైనా పెండ్లి సందర్భంగా, రాజు పట్టాభిషేక సమయంలో తమ కులదేవతను దర్శించి ఇట్లా బలులివ్వడం ఆనవాయితీ అని రాసారు. అంతేగాక 1702లో దిక్పాలదేవ నవరంగపురం కోటను గెల్చుకున్నసందర్భంగా కూడా ఈ కుటుంబయాత్ర సంబరం జరిపివుంటారు.
          ఈ శాసనంలో పదితరాల రాజ వంశక్రమం యివ్వబడ్డది. బస్తర్లో స్థిరపడ్డ అన్నమరాజుతో మొదలౌతుంది ఈ క్రమం. పాండవులలోని అర్జునుని చంద్రవంశానికి చెందిన కాకతి ప్రతాపరుద్రుని సోదరునిగా అన్నమరాజు పేర్కొనబడ్డాడు. వారి కుటుంబ నిజస్థానం  హస్తినాపురమని, వారు ఒరంగల్ కు వలసవచ్చారని చెప్పబడ్డది. ముసల్మానుల దండయాత్రల వరకు వారు అక్కడే రాజ్యం చేస్తుండేవారని శాసనంలో తెలుపబడింది.
ప్రతాపరుద్రుని మరణాంతరం శత్రువులకు చిక్కకుండా అన్నమరాజు(దేవుడు) బస్తర్ అడవులకు చేరుకున్నాడు.  అక్కడే తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అన్నమరాజు తర్వాత మొదటి ఏడుగురి పేర్లు తప్ప ఏ వివరాలు లేవు. ఎనిమిదవ రాజు వీరసింహదేవ 67యేండ్లు పాలించాడని, చందెల్ల రాకుమారి వదనకుమారిదేవిని వివాహమాడాడని చెప్పబడింది. దిక్పాలదేవ కూడా చందెల్ల కుటుంబానికి చెందిన వర్ది రాజు రత్నరాజు కుమార్తె రాకుమారి అజబాకుమారిని పెండ్లాడని వుంది. వారి కుమారుడు రక్షపాలదేవ.
కంజీవరం శాసనాలలో పేర్కొనబడిన ప్రతాపరుద్రుడు 15వ శతాబ్దానికి చెందిన వాడు. 1422లో బహమని రాజు అహ్మద్ షా చేతిలో ఓడిపోయాడు. కాని, 1316లో అవే శాసనాలలో చెప్పబడ్డ ప్రతాపరుద్రుడు కాకతీయ చక్రవర్తే. బస్తర్ శాసనాలలో చెప్పబడిన నవలక్ష ధనుర్దారులున్న సైన్యంకలవాడుగా చెప్పబడ్డది కాకతీయ ప్రతాపరుద్రుడే.కాని, ‘అన్నమరాజు కాకతి ప్రతాపరుద్రుని సోదరుడే అయితే ముస్లిం చరిత్రకారులు ‘లుద్దర్ దేవ్’ అని పిలిచిందెవరిని. కాకతి ప్రతాపరుద్రుడు పట్టాభిషిక్తుడైనది 1294లోనని  డఫ్ అనే చరిత్రకారుడు కాకతీయుల కాలక్రమణికనిచ్చాడు. 1302 నుంచి 1702 వరకు 400 సం.ల కాలం పదితరాలకు ఒక్కొక్కతరం 40యేండ్లుగా లెక్కించడం అసంబద్ధం. అహ్మద్ షా రాజ్యభ్రష్టుణ్ణి చేసిన రాజు పేరు రాయబడలేదు. కాని, అతడు ప్రతాపరుద్రుడే.  ఇతని సోదరుడే అన్నమరాజు. పారిపోయి వచ్చి బస్తర్లో బసచేసాడు’ అని రాయ్ బహదూర్ లాల్ ఒక చర్చను లేవనెత్తాడు.అయితే ఈ చర్చ నిలిచేదేమీ కాదు. బహమనీల కాలపు ప్రతాపరుద్రుడు కాకతీయ వంశం వాడేమీ కాదుకదా. పరాయిలకు కాకతీయుల వంశం మోయాల్సిన అగత్యం ఏముంటుంది. అంతెందుకు. వరంగల్ కాకతీయుల వంశక్రమంలోనే కొన్ని తేడాలు కనిపిస్తాయి. బస్తర్లో కాకతీయుల వంశక్రమాన్ని  ఒకే శాసనం మీద ఆధారపడి నిర్ధారించడం సరైంది కాదు. మరిన్ని శాసనాధారాల కొరకు ప్రయత్నించాలి.
అన్నమరాజు బస్తర్ చేరినవిధాన్ని బస్తర్ ప్రజలు కథలు,కథలుగా చెప్పుకుంటారు. అడవిలో దిక్కు తోచని అన్నమరాజు తమ కులదేవతను సాయంకై వేడుకున్నాడట. ఆ దేవత అతణ్ణి ముందుకు సాగమని తాను అనుసరిస్తూ వస్తానని చెప్పిందట. ఆమె కాలిఅందెల చప్పుడు వినిపడినంత దూరం సాగిపొమ్మన్నదట. అప్పట్లో ఒక నాగవంశ రాజు బస్తర్ దేశాన్ని పాలిస్తున్నాడట. అన్నమరాజు ఆ రాజు ప్రధాన నగరాలు బైరాంఘర్, బార్సూర్ లను ఆక్రమించాడు. డంఖిని నదిని దాటే క్రమంలో అన్నమరాజు వెనక వస్తున్న దేవత కాళ్ళు ఇసుకలో కూరుకపోవడం వల్ల ఆమె కాలిఅందెల చప్పుడు వినిపించలేదు అన్నమరాజుకు. వెనుకకు తిరిగి చూసాడు అన్నమరాజు.ఆ దేవత కోపంతో నిలిచిపోయింది. ఆమెను అనేకవిధాలుగా వేడుకున్నాక అతణ్ణి  5రోజులలో రాజ్యమంతా గెలుచుకుని రమ్మన్నదట. అన్నమరాజు ముందుకు పోయాడు. అక్కడే నిలిచిపోయిన దేవత ‘దంతేశ్వరి’ గా పిలువబడ్డది. దేవత పిల్లబిచ్చగత్తెగా మారి బండారి నాయక్ తో కలిసి పనిచేసేదట. తర్వాత తానెవరో అతనికి తెలియజేసిందట. అన్నమరాజు మొత్తం బస్తర్ సరిహద్దుల్ని గెలుచుకున్నాడు. మదోటాను రాజధానిగా చేసుకున్నాడు. దంతేశ్వరలో దేవతకు గుడి కట్టించాడట. అతని వారసులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు. 138గ్రామాలను ఆ దేవాలయం కింద కేటాయించారు. కల్నల్ గ్లాస్ ఫర్డ్ 1862లో ‘ దంతేశ్వరి దేవిని సంప్రదించకుండా రాజులైనా, మంత్రులైనా ఏ పని కూడా చేసువాళ్ళు కారు. దేవత తలమీద పువ్వులుంచి అవి కుడివైపుకు పడ్డాయా,ఎడమవైపుకు పడ్డాయా చూసి పనులు చేయాలా వద్దా నిర్ణయించుకునే వారట. దేవత ప్రసన్నత కొరకు నరబలులివ్వడం 1842 వరకు కొనసాగేవని’ నివేదికలో రాసాడు. పౌరాణిక కథల ప్రకారం ఈ రాజుల కుటుంబం డిల్లీలో వున్నపుడు దిల్లేశ్వరిగా, మధురలో వున్నపుడు భువనేశ్వరిగా, వరంగల్ కు చేరినపుడు మాణిక్యేశ్వరిగా, బస్తర్ కు చేరినపుడు దంతేశ్వరిగా పిలువబడ్డదట. అంతకు మునుపు పాలకులైన నాగవంశీయులు తమ కులదేవతగా పూజించింది మాణిక్యేశ్వరిని. శాసనాల వల్ల ఈ దేవతకు బైరాంఘర్ లో, బార్సూర్ లో దేవాలయాలున్నాయి. తాళ్ళపల్లి లేదా తాళ్ళలంకగా పిలువబడే చోట దంతేశ్వరి దేవాలయం కట్టబడింది.
పౌరాణికంగా కాకుండా వాస్తవికంగా ఆలోచిస్తే అన్నమరాజు తన విజయం కోరుతూ స్థానిక అమ్మదేవతను వేడుకుని ముడుపులు కట్టివుంటాడు. ఊహించని విదంగా చాలా పెద్దరాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ దేవతకు రక్తదంతి, దంతి, దంతేశ్వరి, దంతావల అని స్థానికంగా పేర్లు. లేదా తన వెంటే తెచ్చుకున్న తమ కులదేవతను ఇక్కడ ప్రతిష్టించుకుని దేవాలయం కట్టించి వుంటాడు. తను గెలిచిన శత్రురాజు కిష్టమైన అమ్మవారి పేరును తనకిష్టమైన పేరుతో మార్చివుంటాడు.
బస్తర్ రాజ్యం- శాసనాలుః
          బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్సెస్ లో దక్షిణంగా రాజ్యం బస్తర్. 17046’ - 20014’ నుంచి 80015’-82015’ అక్షాంశ, రేఖాంశాల మధ్య వుంటుంది. దట్టమైన అరణ్యం, ఆటవిక జాతులు మొన్నటిదాక దుస్తులు వేసుకోవడం తెలియనివారు. బస్తర్ రాజ్యానికి చెందిన సూపరింటెండెంట్ బైజనాథ్ 22 శాసనాలను సేకరించాడు. నాగపూర్ మ్యూజియం సోమేశ్వర శాసనాన్ని ముద్రించింది(1862). ఈ శాసనం సిరోంచ దగ్గరుండే గ్రామం కౌతా నుంచి తెచ్చారట. ఈ శాసనం ఇప్పటి రాజుల పూర్వీకుల క్రమావళిని తెలిపే ముఖ్యశాసనం. బస్తర్ కు చెందిన  బార్సూర్ లోనిది కౌతా.
          బస్తర్లోని ముఖ్యప్రదేశాలుః బార్సూర్, దంతేశ్వర, గడియా, బైరాంఘర్, నారాయణ్ పాల్, సునార్ పాల్, తీరథ్ ఘర్, పోతినార్, చాప్కా, డొంగార్. బార్సూర్ జగదల్పూర్ కు 55 మైళ్ళ దూరంలో వుంటుంది. జగదల్పూర్ బస్తర్ ప్రస్తుత రాజధాని.
బార్సూర్:  ఎన్నో దేవాలయాల శిథిలాలు కనిపిస్తాయి. ఇందులో ముఖ్యమైంది శివాలయం. ఇది రెండు గర్భగుడులు ఒకే మంటపంతో వుండే ద్వికూటాలయం.నాలుగు వరుసల్లో 32 స్తంభాలున్నాయి. ప్రతిగుడిలో లింగం, నంది వున్నాయి. అక్కడ్నుంచొక శాసనం తొలగించబడ్డదని పెద్దలు చెప్తారు. మరో శివాలయం 12 స్తంభాలతో వుంది. మూడో ఆలయాన్ని ‘ మామా భాంజ్ కా మందిర్ ’ అని పిలుస్తారు. సుందరమైన శిల్పాలతో రాతిగొలుసుల గంటలతో వుంటుందీ గుడి. బయట వుండే గణేశదేవాలయంలో 17 అడుగుల ఎత్తైన గణేశశిల్పం వుంది.అనేక విగ్రహాలు పడివున్నాయి. వాటిలో విష్ణువు, శాసనాలలో పేర్కొనబడ్డ మహిషాసురమర్దిని శిల్పాలున్నాయి.అన్ని బ్రాహ్మణీయశైలిలో నిర్మించబడ్డ మధ్యయుగాలనాటి గుడులు. బార్సూర్ కు దక్షిణంలో 20మైళ్ళ దూరంలో దంతేశ్వర గ్రామం వుంది. అక్కడ కనిపించే శిల్పాలలో 5పడగల నాగశిల్పాలున్నాయి. దంతేశ్వరలో దంతేశ్వరి దేవాలయం వుంది. పాలకుల దేవత. శంఖిని, డాకిని నదులు కలిసేచోట వుందీ దేవాలయం. దంతేశ్వరి ఆలయంలో ఒకప్పుడు పండుగలపుడు నరబలులు ఇచ్చేవారట. దంతేశ్వరి 8భుజాలు కలిగి వుంది. మహిషుణ్ణి వధిస్తున్న శిల్పం. నిజానికి ఈ దేవత మహిషాసురమర్దిని. స్థానికంగా దంతేశ్వరి అని పిలుస్తారు. అక్కడ మరికొన్ని విష్ణు, కార్తికేయ, గణేశ మొదలగు దేవతల విగ్రహాలున్నాయి. ఈ ప్రాంతంలో 5 శాసనాలు దొరికాయి. అక్కడ ఎన్నో గుళ్ళ శిథిలాలు కనిపిస్తున్నాయి. దంతేశ్వరి దేవాలయ పోషణకై  138 గ్రామాలు ఈ గుడికి అనుబంధం చేయబడ్డాయి. జగదల్పూరుకు 70 మైళ్ళదూరంలో వుండే గ్రామం బైరామ్ ఘర్ వద్ద గల స్తంభంపై ఒక శాసనం చెక్కబడివుంది. దీని సమీపంలోని  పోతినార్ లో 4వైపుల శాసనం చెక్కిన రాతి ఫలకం వుంది. గడియా జగదల్పూరుకు 20 మైళ్ళదూరంలో వుండేగ్రామం. అక్కడ రాతితో కట్టిన గుడివుంది. కాని గుడిలో విగ్రహం లేదు. అక్కడ పెద్ద శాసనం లభించింది. నారాయణ్ పాల్ , కురుస్ పాల్ జంటగ్రామాల వంటివి. చిత్రకూటం దగ్గరి ఇంద్రావతి నది దగ్గర వుండే గ్రామాలు. నారాయణ్ పాల్  లో పాతగుడి వుంది. విష్ణు విగ్రహం వుంది. ఒక శాసనం వుంది. నారాయణ్ పాల్ కు 12మైళ్ళ దూరంలో వుండే సునార్ పాల్, చాప్కా లున్నాయి.  చాప్కాలో పెద్దసంఖ్యలో సతిస్తంభాలున్నాయి. వాటిలో కొన్నిటిపై రాతలున్నాయి. తీరథ్ ఘర్ లో కూడా కొన్నిగుడులున్నాయి. డొంగర్ లో సంప్రదాయం ప్రకారం పాలకులకు పట్టాభిషేకం చేయబడుతుంది.)
బస్తర్ శాసనాలుః
          ఇవి మూడు తరగతులు. 1.నాగవంశ రాజులు, 2.కాకతీయులు, 3. అనేకం
కనుగొన్న22 శాసనాలలో 10 మొదటి తరగతి, 5 రెండవ తరగతి, మిగిలినవి అనేకంలోనివి.
నాగవంశి శాసనాలుః
1.నారాయణ్ పాల్ శిలాశాసనం : నాగవంశ రాజు సోమేశ్వరదేవుని తల్లి రాణి  గుండా మహాదేవి వేయించినవి.
          నాగరిలిపి,సంస్కృతభాషలో వున్న ఈ శాసనంలో శక సం.1033 అనగా క్రీ.శ.1111లో  రాణిదేవి నారాయణ పురానికి చెందిన దేవుడు నారాయణునికి, లోకేశ్వరునికి ఖజ్జూరి చెరువు సమీపంలో కొంత ఇచ్చినట్లు వుంది.
2.బార్సూర్ (సోమేశ్వరదేవుని భార్య గంగామహాదేవి)శాసనం :
          నాగపూర్లోవున్న ఈ శాసనంలో (కౌతా, సిరోంచ నుంచి తెచ్చిందంటారు, కాదు బార్సూర్ నుంచి వచ్చిందేనంటారు చరిత్రకారులు). కల్నల్ గ్లాస్ ఫర్డ్  తన నివేదికలో ఈ శాసనం సంస్కృతం, తెలుగుభాషలలో వుందని. ఇది నాగవంశి క్షత్రియ రాజు సోమేశ్వరదేవుడు 1130లో వేయించిన శాసనం అని తెలిపాడు.
          ఈ శాసనం నారాయణపాల్ శాసనంలో వలెనె తెలుగులిపిలో తెలుగువచనంలోను, రాజు బిరుదావళి సంస్కృతంలోను వున్నాయి.  గంగాదేవి కేరమారుకలో రెండు శివాలయాలను కట్టించిందని తెలుపుతున్నది.
3.కురుస్ పాల్ శాసనం: సోమేశ్వరుని రెండో భార్య ధారణ మహాదేవి వేయించింది.
          నారాయణపాల్ కు మైలుదూరంలో వుండే కురుసపాల్ లో  చెరువువద్ద ఈ శాసనం దొరికింది. నాగరిలిపి, సంస్కృతంలో వుంది వున్న ఈ శాసనంలో రాణి కాలాంబలో చేసిన భూదానవివరాలున్నాయి.
4.సునార్ పాల్ శిలాశాసనం: జయసింహుని రాణి మహాదేవి వేయించింది.
          నారాయణపాల్ కు 10 మైళ్ళ దూరంలో వుంది సునార్ పాల్.మహాదేవి చేసిన భూదానవివరాలున్నాయి.
5.దంతేశ్వరిగుడి శాసనం: నరసింహదేవుడు వేయించింది
          దంతేశ్వరిదేవి గుడిలో లభించిన తెలుగు శాసనం ఇది.శక సం. 1140(క్రీ.శ.1218) జ్యేష్టమానంలో రాయించింది. ‘శ్రీభుజగవర భూషణ, మహారాజులైన శ్రీమాన్ సింహదేవ మహారాజుల రాజ్యము’ అని రాయబడి వుంది. మిగిలిన నాగవంశ శాసనాలవలె ఈ శాసనానికి మంచిప్రతి దొరుకలేదు. అవన్నీ తెలుగు శాసనాలే. పోతినార్ శాసనం నరసింహదేవున్ని, దంతేశ్వరిగుడిబయటి దంతేశ్వర శాసనం జయసింహదేవున్ని ప్రస్తావిస్తున్నాయి. బైరాంఘర్ శాసనం బార్సూర్ శాసనంలో వలె రాజు బిరుదులు ‘శ్రీ మాణిక్యదేవి దివ్య శ్రీపాద పద్మారాధక’ రాసివుంది. మాణిక్యదేవి అన్నది దంతేశ్వరి పూర్వనామం. నాగవంశరాజులు పైతృకంగా యెల్బుర్గ లోని సింద కుటుంబానికి చెందినవారు. నాగవంశీయుల పిదప వచ్చిన పాలకులు కాకతీయులు తమవెంట వరంగల్ నుంచి వచ్చిన (వరంగల్లో మాణిక్యేశ్వరిగా పిలువబడిన) దేవత దంతేశ్వరి అన్నారు. కాని, దంతేశ్వరలోని బైరాంగుడి శాసనం  చాలాపాతది, శక సం.984(క్రీ.శ.1062)నాటిది. గాడియా శాసనం సోమేశ్వరదేవుని కాలంనాటిది. ఈ శాసనం మీద సూర్య,చంద్రులు, ఆవు, దూడ, శివ చిహ్నాలున్నాయి.
           
కాకతీయ శాసనాలుః
          దంతేశ్వరలోని దంతేశ్వరి దేవాలయంలో రాజగురువు మిథిలపండితుడు రాసిన శాసనం వుంది. ఇక్కడి శాసనాలలో ఒకటి సంస్కృతంలో, రెండవది హిందీ(మైథిలి)లో రాయబడ్డవి. కల్నల్ గ్లాస్ ఫర్డ్ ఇచ్చిన నివేదికలో లోపాలున్నాయి. ఆ శాసనాలు 1703 నాటివి. అవి దిక్పాలదేవ రాజు దంతేశ్వరి దేవాలయయాత్ర గురించి తెలుపుతున్నాయి.వేల మేకలు బలివ్వబడ్డాయని శంఖిని నదినీళ్ళు ఎర్రగా మారిపోయాయని వుంది. కాకతీయులు అర్జునుడు పుట్టిన సోమవంశీయులని రాయబడ్డది. శాసనంలో వరంగల్ రాజైన కాకతిప్రతాపరుద్రునితో  వంశక్రమం మొదలవుతుంది.
          అతని సోదరుడు అన్నమదేవుడు బస్తర్ కు మొదట వచ్చాడు. వంశక్రమం దిక్పాలదేవునిదాకా రాయబడ్డది. ఇప్పుడున్న బస్తర్ పాలక కుటుంబం వరంగల్ పరిపాలక కుటుంబానికి ప్రతినిధి. ఢిల్లీ సుల్తాన్ దండయాత్రతో కాకతీయ కుటుంబం బస్తర్ అడవుల్లో తలదాచుకుంది.
 ప్రొఫెసర్ కీల్హార్న్ జాబితా ప్రకారం  కాకతీయుల వంశక్రమం:
( EI Vol. VIII, Appendix, p.18)
1.       దుర్జయ
2.       బాత(బేతంరాజు) త్రిభువనమల్ల(దుర్జయ కుమారుడు)
3.       ప్రోల(ప్రోలరాజు)
4.       మహా మండలేశ్వర రుద్రదేవ
5.       మహదేవ(మాధవ)
6.       గణపతి(గణప)
7.       ఏకశిలానగర మహామండలేశ్వర ప్రతాపరుద్ర
ఈ జాబితాలో రుద్రమదేవి లేదు.
దంతేశ్వర శాసనాల ప్రకారం అన్నమదేవుని నుంచి దిక్పాలదేవుని వరకు
1.       అన్నమరాజు ప్రతాపరుద్రుని సోదరుడు (1324-1369)
2.       హంవీరదేవ (1369- 1410)
3.       భైరవ (1410- 1468) Bhaitai Deva
4.       పురుషోత్తమదేవ (1468- 1534)
5.       జయసింహదేవ
6.       నరసింహదేవ
7.       జగదీశరాయదేవ
8.       వీరనారాయణదేవ Pratapa Raja Deva (1602–1625)
9.       వీరసింహదేవ వదనకుమారి(చందెళ్ళ రాకుమారి)తో వివాహం
10.   దిక్పాలదేవ అజబకుమారి(చందెళ్ళ రాకుమారి)తో వివాహం (1680–1709)
3. దిక్పాలదేవుని పిదప రాజ్యవారసులు (బస్తర్ రాజకుటుంబం వద్ద వున్న రికార్డుల ప్రకారం)
1.       రాజపాల్ దేవ (1709 – 1721)
  1. 1721 - 1731 Mama
3.       దళపతిదేవ(1731 - 1774)
  1. దర్యావొదేవ (1774-1777 - bf.1819 (2nd time)) 1774 - 1777 Ajmar Singh Deo
  2. మహీపాలదేవ (1830 - 1853) 1819? Mahipal Deo
6.       భూపాలదేవ (1830 – 1853)
7.       భైరామదేవ (27 Aug 1853 – 20 Jul 1891)
8.       రుద్రప్రతాపదేవ (20 Jul 1891 - 1921)
  1. ప్రఫుల్ల చంద్ర భంజ్ దేవ (1921 - 1 Nov 1922) ( Left Household and got sanyas)
  2. రాణి ప్రఫుల్ల కుమారిదేవి (23 Nov 1922 – 28-Feb 1936 (Wife of Raja Prafulla Chandra Bhanj Deo) (b. 1910 - d. 1936)
11.  ప్రవీర్ చంద్ర భంజ్ దేవ (throned in 1936 (28 Oct 1936 – 15 Aug 1947)  (1929–1966)
12.  విజయ చంద్ర భంజ్ దేవ -1966-1970 (1934-1970)
13.  భరత్ చంద్ర భంజ్ దేవ- 1970-1996 ( 1954-1996)
14.  కమల్ చంద్ర భంజ్ దేవ- 1996-  ప్రస్తుత బస్తర్ పాలకుడు.

కొన్ని కారణాల వల్ల బస్తర్ రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకటి కాంకేర్, రెండవది బస్తర్ జగదల్పూర్ రాజధాని. ఈ రాజ్యాల సైన్య వారసులమని ఇక్కడి హల్బా తెగ ప్రజలు చెప్పుకుంటారు. మరాఠాలు రాజ్యానికొచ్చేవరకు 18వ శతాబ్దం వరకు బస్తర్ స్వతంత్రంగానే వుంది. 1861లో బస్తర్ సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బరేర్ లో భాగమైంది.  1863లో పొరుగు రాజ్యం జయపూర్ కు యివ్వబడ్డది.
‘‘బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం మెమోరాండం ఆన్ ది ఇండియన్ స్టేట్స్-1940లో కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడి మరణం తర్వాత అతని సోదరుడు అన్నమదేవుడు బస్తర్ జిల్లాలోని దంతేవాడలో 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో  రెండో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పిదప, 600 సం.ల పాటు 20 మంది కాకతీయరాజులు పరిపాలించినట్లు వివరించబడింది. బస్తర్ పాలకుడు మహారాజ ప్రవీర్ చంద్రభంజ్ దేవ కాకతీయ అని సుప్రీంకోర్టు 1960లో విడుదల చేసిన పత్రం.
దంతేవాడ అడవుల్లో తెలుగులిపిలో వున్న శాసనాలున్నాయి. ఆ శాసనాలు ఇపుడున్న బస్తర్ పాలకుల్ని కాకతీయవారసులనే తెలుపుతున్నాయి. బీజాపూర్, సుకుమా, నారాయణపూర్, కాంకేర్ లలోని దేవాలయాలు కాకతీయశైలిలో నిర్మించబడ్డవి. వాటి సాక్ష్యం కూడా లెక్కలోనికి తీసుకోవాలి. ఇపుడున్న పాలకుడు మహారాజు హోదాలో వున్న కమల్ చంద్రభంజ్ దేవ అన్నమదేవుని వంశక్రమంలో 22వ వాడు. ప్రస్తుతం బస్తర్ రాజ్య పరిధిలో బస్తర్, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలున్నాయి.
బస్తర్ పాలకుల కులదైవం దంతేశ్వరి. కాకతీయులు దంతేశ్వరిదేవతను ఇక్కడ ప్రతిష్టించారు. దంతేశ్వరిదేవాలయంలో దసరా వేడుకలు 75రోజులపాటు నిర్వహిస్తారట.బస్తర్ పాలకులు రాజులుగా కాక ఈ ఉత్సవాల సందర్భంగా దంతేశ్వరి పూజారులుగా వ్యవహరిస్తారు.
అన్నమదేవుని నుంచి తన (కమల్ చంద్రభంజ్ దేవ)వరకు బస్తర్ ను పాలించిన పాలకుల గురించి తెలుసునని,  ఈ విషయమై తెలంగాణాలోని చరిత్రకారుల మధ్య తేడాలున్నాయని,బస్తర్ పాలకులు కాకతీయుల వారసులేనని చెప్పదగిన అన్ని ఆధారాలు వున్నా’’యని కమల్ చంద్రభంజ్ దేవ తనతో నవచరిత్రపరిశోధకుడు అరవింద్ ఆర్య(మా టీం సభ్యుడు) చేసిన ఇంటర్వ్యూలో తెలియజేసిన వివరాలు బస్తర్లో కాకతీయుల మలిప్రస్థానం గురించి విశ్వసనీయతను పెంచుతున్నాయి.

పత్రరచనః        శ్రీరామోజు హరగోపాల్,

విషయశోధనః శ్రీరామోజు హరగోపాల్
                                                                                                        వేముగంటి మురళీకృష్ణ,
                                                                                                        కట్టా శ్రీనివాస్,
                                                                                                        అరవింద్ ఆర్య
                                                             
References:
1.    Epigraphiya Indica Vol.VIII, Appendix-2, p.18
2.    Epigraphiya Indica Vol. IX, p.160-166
3.    Epigraphiya Indica Vol. XII, p.242-250
4.    Siddheshwarcharitram- Kase Sarvappa (Telugu classic)
5.    Pratapa Charitra- Ekamranatha
6.    Kakatiya Sanchika- Ed. M.Ramarao, p.no.65
7.    Kakateeyulu- PV Parabrhama Shastry (History Book in telugu-Dec,2012)
8.    Kakatiya Sanchika- Editor: M.RamaRao
9.    Interview with Bastar King Kamal Chandra Bhanj Dev- Aravind Arya
10.  Chandella Rulers:చందెళ్ళ లేదా చంద్రాత్రేయాలు మహోబాను 10,12 శతాబ్దులలో పాలించిన వారు.బుందేలుఖండ్ ప్రాంతం చందెళ్ళ కళకు ప్రసిద్ధి. ఖజూరహోలో కందారియా మహాదేవ వంటి దేవాలయాల నిర్మాతలు వీళ్ళే. వీరి కాలంలో బ్రాహ్మణ, జైన, బౌద్ధ నిర్మాణాలు ప్రతిమాలక్షణాలకు పేరు. చందెళ్ళ పాలకులలో కీర్తిసాగర్ నిర్మించిన (11 శతాబ్ది)  కీర్తివర్మ కీర్తివంతుడు.(Wiki2)


దంతేశ్వరి శాసన పాఠం: (సంస్కృతంలో)
1.    శ్రీదంతావల దేవీం జయతి II శ్రీ సోమవంశ పాండవార్జున కులే కా
2.    కతీ ప్రతాపరుద్రనామ రాజా ఓరంగల్ దేశే సమభవత్ II యస్యేదం పద్యం I
3.    వలక్ష ధనుర్ధరాధినాథే పృథ్వీం శాసతి కాకతీయ రుద్రే IIప్రభవత్
4.    పరమగ్రహారపీడాం కుచకుంభేషు కురంగలోచనానాం II తస్యేకదా స్వర్గ వృ
5.    ష్టిమంజతోపద్రవాత్ II నష్టరాజ్యస్య శివమాయుజ్యం ప్రాప్తస్య II భ్రాతా అన్న
6.    మరాజనామా యుద్ధాత్ నిజదేశం పరిత్యజ్య దండకారణ్య నికట వస్తర్ దేశీ
7.    రాజ్యం చకారII తద్ వంశే హంవీరదేవ నామా రాజా జాతః తత్పుత్రో భైరవరాజదేవ నా
8.    మా రాజా జాతః II తత్ పుత్రో రాజాధిరాజ పురుషోత్తమ్ దేవో II తత్ పుత్రో  జయత్ సింహరాయదేవో రా
9.    జా జాతః తత్ పుత్రో నరసింహరాయదేవో రాజా జాతః తత్పుత్రో జగదీశరాయదేవో జాతః II తత్
10.   పుత్రో వీరనారాయణదేవో మహరాజో జాతః II తత్ పుత్రః సమస్తప్రశస్తిసహితః సుత
11.  సమపాలిత చతుర్వర్గ సంతాన చంద్రవంశవారాబ్ధి వదనకుమారిదేవీ సహిత సంచిత కీ
12.  ర్తివితాన II శ్రీ వీరసింహదేవో మహారాజః  సప్తషష్టివర్షావిధి మహీం పరిపాల్య వైకుం
13.  ఠం జగామ II తస్య పుత్రో వివిధవిరుదావళి విరాజమాన మానో..త II సమరసః
14.  ..సీ కమల్ II తరవారి విదారిత ప్రతిమహీపగజ II ప్రచండదోర్దండక్వష్టకోదండ
15.  షండితారాతివర్గ II హేలాగృహీత నవరంగపురదుర్గ II పట్టమహిషీ మహారాణి అ
16.  జబకుమారిదేవీ సహిత రక్షితార్తివర్గ II శ్రీ భగవాన్ గురు మంత్రోపదశే సంజాత భ
17.  ర్గ II పృథురాజావతార అష్టాదశవర్ష వయప్రాప్త రక్షాపాలదేవకుమార II స్వస్తి శ్రీ
18.  మహారాజాధిరాజో దిక్పాలదేవదేవో యథార్థనామాం శతవర్షావధి నిష్కంటకాం
19.  మహీం పాలయతి II తేన చైకద శ్వపురవాసిననేన స.. దంతావలాం సమాగత్య కుటుం
20.  బజాత్రా కుత II తత్ర బహుసహస్రక్కాగ శరీర సంఘాత రక్తప్రవాహైః శంఖినీం II
21.  నదీం శ్రోణితో దామకరోత్ II ఇత్యర్థం లిఖితం ప్రఖ్యేతియిత్వా చంద్రతారార్కం II దిక్పాల
22.  దేవసదశో  భూపో న భవితా కలౌ II సంవత్ 1760 వైసావ(ఖ) ..య లిఖితం శ్రీ
23.  భగవాన్ మిత్ర మైథిల పండితేన II




చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...