Sunday, March 11, 2018

దక్షిణకాశి రాఘవాపురం:
ఓరుగల్లు అనగానే కాకతీయుల గురించి మాత్రమే చెప్పేవాళ్ళు అక్కడ శాతవాహనులకాలం నుండి పరంపరగా పెరిగిన చరిత్ర గురించి మాట్లాడరు. కాకతీయులు ఒక మతానికి ప్రతినిధులు కారు. ఒక రాజవంశానికి చెందిన పరిపాలకులు.
కొలనుపాక గురించి అంతే. సిద్ధరేవణాచార్యులు సుప్రసిద్ధ వీరశైవాచార్యుడు. ఆ ఆచార్యుల పీఠంగా పేరొందిన కొలనుపాకలో శైవం గురించి ఎక్కువగా, సమాంతరంగా కొనసాగిన జైనం గురించి చెప్పుకుంటారు. కొలనుపాక ప్రసిద్ధ శైవక్షేత్రం, జైనతీర్థం. బౌద్ధం గురించి చెప్పే ఏ ఆధారాలు అక్కడ మిగిలిలేవు. వెతకాల్సిందే. కళ్యాణీ చాళుక్యులు, కందూరిచోడులు, కాకతీయుల పరిపాలనలకు సంబంధించి శాసనాలు, దేవాలయాలు, శిల్పాలు దొరికాయి. రాష్ట్రకూటుల శిల్పాలు కొన్ని దొరికాయి. క్రీ.శ. 880లో కొలనుపాక రాజధానిగా పరిపాలించిన రాష్ట్రకూట రాజప్రతినిధి శంకరగండరస శాసనం నల్లగొండజిల్లా ఆమనగల్లులో ఇటీవల మాకు దొరికింది. దానివల్ల కొలనుపాకలో రాష్ట్రకూటుల పరిపాలన చాలాకాలం వుందని చెప్పవచ్చు. రాష్ట్రకూటులు ఇక్కడ జైనాన్ని, బౌద్ధాన్ని, శైవాన్ని ముఖ్యంగా గాణపత్యాన్ని పోషించిన జాడలు కొల్లలుగా లభిస్తున్నాయి. సోమేశ్వరాలయంలో అడుగడుగున రాష్ట్రకూటుల శిల్పాలున్నాయి. కొలనుపాక రాజదర్వాజను రాష్ట్రకూటుల కాలంలోనే నిలిపినట్లు తెలుస్తున్నది. సోమేశ్వరాలయంలో చండికాంబ దేవాలయం పక్కన మూలన నిలబెట్టిన మహిషాసురమర్దిని రాష్ట్రకూటులనాటిదే.
కొలనుపాకకు ఈశాన్యాన 2కి.మీ. రాఘవాపురం గ్రామముంది. ఆ వూరిని దక్షిణకాశి అని పిలుస్తారు ప్రజలు. అక్కడ అన్నపూర్ణాసహిత విశ్వేశ్వరుని పేర శివాలయం వుంది. ఆ గుడిముందరి కోనేటిలో ఈ ప్రాంతంలోని ప్రజలు తమ ఆప్తుల అస్థికలను కలుపుతుంటారు.
ఈ దేవాలయం రాష్ట్రకూటులు నిర్మించింది. దేవాలయం గోడలమీద రాష్ట్రకూటుల శైలిలో చెక్కిన హంసలు, సింహాలు, ఏనుగులు, చిన్నగోపురాలు, దేవాలయం శిఖరం నాగరశైలిలో వుంది. ఎత్తు తక్కువ చిన్న దేవాలయం. గర్భగుడికి ముందు అంతరాళం లేదు. రంగమంటపం వుంది. మంటపం కప్పుకు మధ్య నటరాజు శిల్పం చుట్టు వినాయక సహిత, సప్తమాతృకలుండడం అపూర్వం. అద్భుతశిల్పం. కాని, రంగులు వేయడంలో వాటి సౌందర్యం మరుగునపడిపోయింది. గర్భగుడిలో పుట్టులింగం(అక్కడి రాయిమీదే చెక్కిన 4అంగుళాల ఎత్తున్న శివలింగం)లోతులో వుంది. వెనక అన్నపూర్ణగా చెప్పబడుతున్నదేవత శిల్పం వుంది. ఈ దేవత కుడితొడపై శిశువు వుంది. దేవతది అర్ధనగ్నశిల్పం. తలకట్టు మకుటంవలె కాకుండ జటామకుటం వలె వుంది. ఈ దేవత జైనుల ఆమ్రకూష్మాండినా లేక బౌద్ధుల హారీతా అన్నదా తేలవలసివుంది. ఎందుకంటే ఆ దేవత అన్నపూర్ణ కాదు. అన్నపూర్ణ శిల్పం ఇక్కుర్తిలో వుంది. ఈ రెండుశిల్పాలకు పోలికలు లేవు. గుడిలోపల మంటపంలో గుడిబయట చిన్న నందిశిల్పాలున్నాయి. రెండు వినాయకవిగ్రహాలున్నాయి. అక్కడే బుద్ధునిదో, జినునిదో తెలియని తలమాత్రం వుంది. ఈ గుడి పరిశోధించాల్సిన చరిత్ర కలిగివుంది.




























No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...