Friday, April 27, 2018

బమ్మెరః
నేను బమ్మెరను 2,3సార్లు చూసాను.బమ్మెర పోతన ఊరని మనసు ఉప్పొంగింది.అంతలోనే బమ్మెర ఎక్కడివాడన్న వివాదాలు విని,చూసి,చదివి బాధ కలిగింది.
మొన్నీమధ్యన మా కొత్తతెలంగాణచరిత్రబృందం బమ్మెరలో చరిత్రయాత్ర చేసినపుడు బమ్మెర స్మారకమందిర ప్రాంగణంలో ఒక శిథిలాలయ ద్వారం చూసింది. ఆ ద్వారలలాటబింబంగా తిరునామాలున్నాయి.ద్వారానికి ఎడమవైపు రాతిపలకల పీఠం వుంది.పోతన అక్కడ కూర్చొని రాసుకునే వాడని ప్రజలు చెప్పుకుంటారు.ద్వారానికి కుడిపక్కన బారుకత్తులున్న వీరగల్లుఫలకమొకటుంది.నేలమీద ముక్కలై పడివున్న వైష్ణవభక్తుడి శిల్పంవుంది.పాతకాలపు పెద్ద ఇటుకలముక్కలున్నాయి.పోతన సమాధి,పోతనబాయి,పోతన తల్లిపేరన లక్కమ్మచెరువు...పోతన వంశీకులమని చెప్పుకునే వారు...ఇవి బమ్మెరలో పోతన ఆనవాళ్ళు.
గ్రామం చివర శిథిలాలయమొకటి వుంది.ఉత్తరాభిముఖంగా వున్న శివాలయం.గర్భగుడి,అంతరాళం, అర్థమంటపాలతో వున్న గుడి.గర్భగుడిలో వుండవలసిన పాతశివలింగం నేలలో కూరుకుని వుంది.అంచున పార్వతివిగ్రహం(కొత్తది),శివలింగం వున్నయి.బయటొక పాతనంది పడవేసివుంది.గుడిద్వారం మాత్రం తూర్పున వుంది.దానికిరువైపుల వుండాల్సిన ద్వారపలకికలు పక్కనపడవేసివున్నాయి.వాటిమీద కలశాలు చెక్కివున్నాయి. గుడివాలకంవల్ల పునరుద్ధరణకు గురైనట్టు తెలుస్తున్నది.గుడిపక్కన వీరగల్లులు పడివున్నాయి.ఒక వీరగల్లు యుద్ధరంగంలో ఏనుగు శత్రుసైనికుణ్ణి దునుమాడుతున్న శిల్పం.దానిమీద 9,10 శతాబ్దాలకు చెందిన తెలుగులిపిలో చిన్న స్మారకశాసనం వుంది.
బమ్మెర వీరగల్లు శాసనం:
1. స్వస్తిశ్రీ
2. చగళ
3. తి పుత్రహా
4. తం ళగణిల
5. త్ర
6. ధర్మ్యనకుగ
7. ............
8. ............ల
9. ళ.........
10. పఱి.........
11. గ............
12. ...........
13. ..............
బమ్మెర ప్రాచీనతకు నిదర్శనాలెన్నో వున్నాయి.గూడూరు శాసనం 12 శతాబ్దానిదే కాని,అక్కడక్కడ గ్రామం బయట క్రీస్తుపూర్వపు మెగాలిథిక్ సమాధుల ఆనవాళ్ళు,మెన్హర్లు అగుపిస్తున్నాయి.
పోతన బమ్మెరవాడు కాడని, ఒంటిమిట్టవాడని కట్టా నరసింహులుగారు నిరూపించే ప్రయత్నం చేసారు. బుక్కరాయలు తాను ఓరుగల్లును స్మరించి ఒంటిమిట్టను ఏకశిలానగరం అనివుంటాడని ఒక వూహ చేసారు. ‘కాటుకకంటినీరు పద్యాంతంలో నిను నాకటికింగొనిపోయి అల్ల కర్ణాట కిరాటకీచకుల కమ్మ త్రిశుద్దిగ నమ్ము భారతీ’ అన్న మాటలో ఆ కర్ణాట కిరాటకీచకులెవ్వరు? సంగమవంశం చివరికాలంలో వ్యసనపరుడైన విరూపాక్షుడై వుంటాడని సంభావించారు.పోతన విరూపాక్షునితో వేగలేకే బమ్మెరబాట పట్టివచ్చాడని,దారిలో జారిపోయిన భాగవతంలోని 4స్కంధాలను ఓరుగల్లువారైన గంగన,సింగన,నారయ్యలు పూరించారని అభిప్రాయపడ్డారు కట్టా నరసింహులుగారు. పోతన నాచనసోముని(బుక్కరాయల ఆస్థానకవి) అనుకరించాడని కొన్ని పద్యాలను ఎత్తిచూపించారు.
పోతన ఒంటిమిట్ట రఘురాముణ్ణే స్మరించాడని క్రింది ఉదాహరణలిచ్చారు.
ద్వితీయ స్కంధం- రాఘవరామా
‘‘ ‘‘ రాఘవా
చతుర్థ ‘‘ రాఘవరామా
సప్తమ ‘‘ రఘుకులతిలకా(480)
అష్టమ ‘‘ రాఘవరామా(740)
పోతనలు రచనలు కాని స్కంధాల్లో రఘు సంబోధనలు లేవు.
(పోతన ఒంటిమిట్టవాడే...బ్లాగు రచనఃవిద్వాన్ కట్టా నరసింహులుగారు.రిటైరైన భాషాపండితులు.సిపి బ్రౌన్ భాషాపరిశోధనకేంద్రబాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. మెకంజీ కైఫీయత్తులకు సంపాదకత్వం వహిస్తున్నారు.)
పోతన బమ్మెరవాడు కాడా?ఒంటిమిట్టవాడా??
ఒంటిమిట్టలో జీవించిన పోతన రాజు విరూపాక్షునితో బాధలు పడలేక బమ్మెరకు వచ్చి స్థిరపడ్డారంటారు కట్టా నరసింహులుగారు.బమ్మెరలోనే ఎందుకున్నాడన్నదానికి కారణం వుండాలి కదా.బంధువులా,రాజాశ్రయమా ఏది కారణం?రాజాశ్రయమైతే ఓరుగల్లులోనే వుండాలికదా.మరి పోతన రాసిన భోగినీదండకం,వీరభద్రవిజయం ఎక్కడ, ఎపుడు రాసివుంటాడు.పరమమాహేశ్వరవ్రతుడైన పోతన భాగవతం ఎట్లా రాసాడు.పోతన పూర్వజీవితమక్కడిదే అని చెప్పడమెట్లా?బొమ్మిడిగడ్డలో వుండవచ్చన్నదానికి ఆధారమేది?అక్కడనుండి ఒంటిమిట్టలో కాపురంపెట్టి వుంటాడన డానికి తగిన నిదర్శనం లేదు.
1975 ఏప్రిల్ 12(ఉగాది) మొదలుగా జరిగిన ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా అకాడమీ ప్రకటించిన లఘుగ్రంథాల వరుసలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు రచించిన ‘పోతన’ గ్రంథంలో పోతన బమ్మెరవాడనే నిరూపించబడింది.
అంతకు పూర్వం విద్వాన్ ఖండవల్లి సూర్యనారాయణశాస్త్రిగారు రచించిన ‘భక్తపోతన’ అనే విమర్శాగ్రంథంలో ఏకశిలానగరమంటే కడపలోని ఒంటిమిట్ట కాదని,పోతన బమ్మెరలోనే పుట్టి అక్కడ జీవించాడనే చెప్పడానికి పోతన భాగవతాన్ని అంకితమడిగిన సింగభూపతి ఓరుగంటిప్రాంతవాసే కావడం,భాగవత శిథిలభాగ పూరణ చేసిన నారయ మొదలైనవారు ఓరుగంటిప్రాంతవాసులు కావడం వల్లనే ఆయనకు శిష్యులవడం,60,70యేండ్ల క్రితంవరకు పోతన సగోత్రీకులు బమ్మెరలో,ఓరుగంటిప్రాంతంలో వుండడం వంటి నిదర్శనాలున్నాయన్నాడు.
పోతన క్రీ.శ.15వ శతాబ్దిలోని వాడైన రావు సర్వజ్ఞసింగభూపాలుడు కాలంవాడేనని చారిత్రకనిర్ణయం జరిగిందన్నాడు.
పోతన ఇవటూరి సోమనారాథ్యుల వల్ల శైవదీక్షను పొందినవాడైనందుననే ‘ఇవటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదపద్మారాధక,కేసనామాత్యపుత్ర పోతయప్రణీతంబయిన వీరభద్రవిజయంబను కావ్యాన్ని, తర్వాత రాజకారణాంతరాల వల్ల ‘భోగినీ దండకం’ రచించివుంటాడు.ఆ పిదప ప్రౌఢవయస్సులో చిదానందయోగివల్ల తారకమంత్రోపదేశం పొంది వైష్ణవానుయాయుడై మహాభాగవతం రాసివుంటాడు పోతన.
జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే అనుములు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు 1957లో ‘బమ్మెర పోతన’ జీవితచరిత్రను గురించి పరిశోధనాత్మక గ్రంథాన్నిరచించాడు.తన గ్రంథంలో పోతనజీవితకాలం,రచనలు, నివాసము, భాగవతరచన- పరిస్థితులను గురించి పోతనరచనలు
1.వీరభద్రవిజయం
2.భోగినీదండకం
3.భాగవతం ఆధారంగా సత్యసమీక్షణం చేసినవాడు అనుముల గారు.
వీరభద్రవిజయాన్ని తాను బాల్యంలోనే రచించానని,గ్రంథపీఠికలో తన గురువుగురించి కూడా పోతన రాసుకున్నాడు.గురువు తనను ‘మత్ప్రసాద దివ్యమహిమచే నెంతైన కవిత చెప్పలావుగలదు నీకు’ దీవించాడని రాసుకున్నాడు.తండ్రి దగ్గరే చదువుకున్నానని ‘జనక శిక్షితాక్ష రాభ్యాసుండనై’ చెప్పుకున్నాడు.
అట్లే ఒంటిమెట్టలో వుండి అయ్యలరాజు రామభద్రుడు శ్రీరాముని పేరన శతకం రాసినట్లు అతని‘రామాభ్యుదయము’లోని పీఠికలో,తుదిగద్యములో ‘ఒంటిమెట్ట రఘువీరశతక కర్మఠ’ అని తన గురించి తెలుస్తున్నది.కాని, ఎక్కడా ఏకశిలనగరమనే పర్యాయపదం కనపడదు.అట్లే భాగవతంలో పోతన తాను గంగకు ‘జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజులపులినశోభితప్రదేశంబున మహేశ్వరధ్యానంబు సేయుచుండగా’ ఒంటిమెట్ట దగ్గరున్న పెన్నానదా కాదు గంగ అని పిలుచుకునే గోదావరి.ఓరుగల్లుకు సమీపంలోనే వుందికదా.
రాచకొండరాజులలో అనపోతానాయని కుమారుడైన రెండవ సింగమనాయడు రసార్ణవసుధాకర కర్త.అతని మనుమడు కుమార సింగమనాయనిని ‘రావు సింగక్షమానాధపౌత్రున్’ సమీచీన రేచర్ల గోత్రాంబు జాతాత్మమిత్రున్ మహోదార చారిత్రు సర్వజ్ఞ సింగోర్వరాధ్యక్షు నీక్షించి’ అని భోగినీదండకంలో పోతన వర్ణించినట్లు తెలుస్తున్నది.
బమ్మెర ప్రాచీనతను తెలిపే శాసనమొకటుంది.బమ్మెర పొరుగునవున్న గూడూరు గ్రామంలోని ప్రసిద్ధ‘గుముడూరు’ శాసనంలో ‘గుముడూర మల్లేశ్వర దేవర గుడిగ రంగభోగసెడె సర్వబాధాపరి(హార) సర్వసమశ్యవాగి వేల్పుగొండ,వీరబడియ,బమ్మరిగయ ధారాపూర్వకం మాడిదరు’ అనివుంది.ఇందులో పేర్కొన్న బమ్మరిగయనే బమ్మెర.(క్రీ.శ.1124,క్రోధి సం.పుష్యబ పాడ్యమి బుధవారం చాళుక్య పేర్మాడి కుమార సోమేశ్వరుని ఆనతితో అతని ప్రధాని మానెవ్రెగ్గడ(కొలనుపాక నుండి)చేసిన దానశాసనం)
బమ్మెరలో ఒకప్పుడు దొరలని పిలువబడిన భూస్వాములు నెల్లుట్లలో వైష్ణవం పుచ్చుకొన్నందున తమ ఇంటిపేరు నెల్లుట్లవారిగా మారినట్లు తెలుస్తున్నది.బమ్మెరలోని ఒక చెరువు పోతన తల్లి లక్కమాంబ పేరన లక్కమ్మచెరువని పిలువబడుతున్నది.
లభిస్తున్న కావ్యాలవల్ల చారిత్రకసంఘటనల ఆధారంగా పోతన తన 50యేండ్ల వయస్సులో దాదాపు 1460 ప్రాంతంలో భాగవతరచన చేసివుంటాడని చెప్పొచ్చు.ఆ సమయంలో మహమ్మద్ షా-2 రాజ్యానికి వచ్చాడు.తెలంగాణా మహమ్మదీయుల వశమైంది ఈ కాలంలోనే.మహమ్మద్ షా రాజులనే కాక బ్రాహ్మణులననేకమందిని కొండపల్లి కోటద్వారంలో అతిక్రూరంగా చంపించినట్లు చరిత్రకారుల రాతలు.పోతన కూడా ఈ ఈతిబాధలకు గురైవుంటాడేమో.ఆ సందర్భాన్నే భాగవతాన్ని భూస్థాపన చేసినందువల్ల గ్రంథం నష్టమైపోయివుంటుంది.ఈ ప్రభువులనే పోతన కర్ణాటకిరాటకీచకులన్నాడేమో.అప్పటికి సర్వజ్ఞసింగభూపాలుడున్నాడో లేడో.
కొరవిగ్రామానికి దగ్గరలో వున్న వేముగల్లువాసియైన కసవయ్య కొడుకు కొరవిగ్రామం పేరు ఇంటిపేరైన కొరవి గోపరాజు పినతండ్రులు,సాళువ నరసింహునికి జైమినిభారతము నంకితమిచ్చిన పిల్లలమర్రి పినవీరభద్రుడు పోతనకు సమకాలికులుగా వుండే అవకాశాలున్నాయని అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాసారు.
పోతన వంశక్రమం
I
మల్లయ్య
I
భీమన్న
I
అన్నయమంత్రి భార్య గౌరమాంబ
I
సోమన్న భార్య మల్లమ్మ
I
1.రేచన్న 2.అన్నయ్య 3.ఎల్లన్నభార్య మాచాంబ 4.అయ్యలన్న 5 మాచయ్య
I
1.కేసన్న భార్య లక్కాంబ 2.మాధవుడు 3.ఇమ్మడి
I
1.తిప్పన్న 2 పోతన్న
I
కేసన్న(ప్రౌఢసరస్వతి)
1.అప్పలమ్మ 2.వీరమ్మ
I
దాక్షాయణీపరిణయకర్త 1.కేసన్న 2.ఎల్లమ్మ.............3 మల్లన్న
ఈమె అజ్జరపు పేరలింగం భార్య
వీరనరసమ్మ,గంగన్న
(సశేషం)

















Thursday, April 26, 2018

అన్మకొండ శాసనం:
ప్రస్తుత పద్మాక్షి గుడి ముందర ప్రాంగణంలో నల్లరాతిమీద నాలుగువైపుల సంస్కృతం, కన్నడభాషల్లో, హళేగన్నడలిపిలో చెక్కిన శాసనస్తంభముంది. ఇదే హన్మకొండ శాసనం.
పద్మాక్షిగుట్ట మీద పద్మాక్షి గుడి ముందర ఒక శాసనముంది. ఈ శాసనం కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు-6 ఏలుబడిలో మాండలికుడు కాకతిప్రోలరాజు (ప్రోల, ప్రోలరాజు, ప్రోడరాజు, పోలాలరస) అమ్మకుండ(కుండె) రాజధానిగా రాజ్యపాలన చేస్తున్న కాలంలో అతని మంత్రి బేత భార్య మైలమ పద్మాక్షిగుట్ట మీద కట్టించిన ‘కడలాలయ బసది’అనే జైనదేవాలయానికి చాళుక్య విక్రమ శకం 42వ యేట అనగా క్రీ.శ. 1117 డిసెంబర్ 24వ తేదీన పౌష్య సంక్రాంతి రోజున 6మర్తురుల భూమిని దానం చేస్తున్నట్టు వేయబడింది. ఈ గుడికే ఉగ్రవాడి పాలకుడు మేళ(డ)రస కూడా తన స్వాధీనంలో వున్న ఓరుగల్లు కూచికెరె(కూచిచెరువు) కింద 10 మర్తురుల భూమినిచ్చాడు.
బేతప్రధానిః
ఈ శాసనంలో ప్రోలరాజు తండ్రి కాకతిబేతను అతని ప్రెగ్గడ వైజ చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యుడు-6 వద్దకు తీసుకువెళ్ళాడు. అపుడా చక్రవర్తి సబ్బిసాయిర మండలానికి బేతను సామంతుని చేసాడని చెప్పబడింది. వైజ, భార్య యాకమబ్బె(యాకమాంబిక)ల కొడుకు బేతప్రధాని.
సబ్బి మండలం:
క్రీ.శ.970లో పశ్చిమ గాంగరాజు పాంచాలదేవుడు సబ్బి లేదా చబ్బిని పాలిస్తుండేవాడు. కర్ణాటకలోని ధార్వార్ జిల్లా హుబ్లి తాలుకాలో వున్న చబ్బి, చాహ్బ్బి అనే గ్రామం పేరు మీదుగా సబ్బి వచ్చిందని చరిత్రకారుల కథనం.
కడలాలయ బసదిః
పద్మాక్షిగుట్టమీద వున్నది జైనబసది. అది ఎపుడు బ్రాహ్మణాధీనమైందో తెలియదు. ఆ గుడిలో 22వ తీర్థంకరుడు నేమినాథుడు అతని యక్షుడు, యక్షిణులతో వున్నాడు.యక్షుని పేరు సర్వంహా. యక్షిణి కూష్మాండిని లేదా అంబ,అంబిక నేమినాధుని శాసనదేవత. గుడిని స్వాధీనపరచుకున్నవారు ఆమెనే దుర్గ నామావళిలో ఒక పేరని చెప్పుతున్న‘పద్మాక్షి’గా చేసి, పద్మాక్షి దేవాలయంగా పిలుస్తున్నారు. గుడిలో జైన శిల్పాలు మరికొన్ని వున్నాయి. చెక్కడం నిల్చిపోయిన మహావీరుని విగ్రహం, 24 తీర్థంకరులుండే చౌవీసి విగ్రహం, చౌవీసి స్తంభం, జైనపాదాలు వున్నాయి. అంతేకాకుండా తర్వాత కాలంలో చెక్కిన వినాయక, చాముండి శిల్పాలు, చాముండి కింద కూష్మాండిని శిల్పం వుంది. గుడిబయట గుట్ట రాతిబండలపై చెక్కిన మహావీర,పార్శ్వనాథ శిల్పాలు చెక్కివున్నాయి పుస్తకగచ్ఛ శిల్పం కూడా వుంది. రాతిబండలలో రాతిగదుల వంటి దేవాలయాలలో జైనవిగ్రహాలున్నాయి.
కాకతి దేవతః
నిజానికి ఈ కూష్మాండినియే కాకతి. దిగంబర జైనమతావలంబకులు, కాకతి దేవత ఉపాసకులుగా వున్న కాకర్త్యగుండన నుంచి తర్వాత రాజులందరు తమపేర్లతో కాకతీయనామాన్ని చేర్చుకున్నారు. కాకతీయులైనారు. కాకర్త్య అంటే కూష్మాండిని అనే జైన శాసనదేవతే.
వస్తుపాల జైనమంత్రి అంబిక ప్రార్థనలో ‘కూష్మాండిని పద్మాలయ’ అనివుంది. అందువల్లనే మైలమ కడలాలయ బసది అనే పేరుతో ఈ గుడిని నిర్మింప జేసివుంటుంది.
‘ప్రస్తుతం శైవదేవతగా పూజలందుకుంటున్న అనుమకొండ సమీపంలోని గుట్టమీద పద్మాక్షిదేవి నిస్సందేహంగా జైనదేవతే. జైన తీర్థంకరుల బొమ్మల నడుమ ఉన్న దేవీవిగ్రహం శైవదేవత కావడానికి వీల్లేదు. మొదట ఉన్న జైనదేవత విగ్రహం తరువాతి కాకతీయుల శైవమతావలంబనకు అనుగుణంగా శైవదేవత రూపాన్ని సంతరించుకుంది. ముందు చెప్పిన జైనగాథ శైవగాథగా మారిపోయింది ........అన్మకొండ గుట్టమీద జైనదేవతను గరుడబేతరాజు లేదా మొదటి బేతరాజు ప్రతిష్టించి ‘కాకతి’ అని పేరు పెట్టాడని ఊహించడం అసమంజసం కాదు’ అని ‘‘కాకతీయులు’’లో పివి పరబ్రహ్మశాస్త్రి రాసారు.
కూష్మాండిని - మైలమలుః
శ్రావణబెళగొళలోని మల్లేషణ శాసనంలో జైనమతాచార్యుల పేర్ల జాబితా ఇవ్వబడింది. (ఎపిగ్రాఫియా ఇండికా, వ్యాల్యూం 3, పే.200) అందులోని అకలంక అనే జైనసాధువు లేదా ఆచార్యుడు బౌద్ధులను గెలవడానికి బౌద్ధుల దేవత తారను వశపర్చుకుని ఒక కుండలో బంధించాడట. బౌద్ధులను ఓడించడంలో, నిర్మూలించడంలో జైన(శాసన)దేవత కూష్మాండిని వారికి సాయపడాలని తలిచి తారవున్న కుండను ఎడమకాలితో తన్ని, నాశనం చేసిందట. దానితో హిమశీతల రాజు ఆస్థానంలో జైనులతో వాదంలో బౌద్ధులు ఓడిపోయారట. అటువంటి మహాత్మ్యం కల జైన శాసనదేవత కూష్మాండిని దేవతతో మైలమను పోల్చడం ఈ శాసనంలో కనిపిస్తుంది. మైలమను గూర్చిన వర్ణన వుందీ శాసనంలో. ఆమె దేవతాసౌందర్యం కలిగివుందట.
ఆధార సూచికలుః
1. Epigraphiya Indica,No.35.p.256, ANMAKONDA INSCRIPTION OF PROLA; BY H. KRISHNA SASTRY,B.A.
2. Mallishe'na epitaph (Epigraphiya Indica, Vol.III. p. 200)
3. Epigraphiya Carnatica, Vol.II. p.46
4. కాకతీయులు- పివి పరబ్రహ్మశాస్త్రి(డిసెంబర్,2012),పే.247







‘‘రాజగజకేసరి కాకతీయ గణపతిదేవ మహారాజు’’ కొత్తశాసనం:
ఈ శాసనాన్ని గుర్తించి, డిజిటల్ ఫోటోలు తీసి పంపింది అరవింద్ ఆర్య(కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు), సిరిమెల్ల అనుదీప్ (దక్కన్ క్రానికల్ వరంగల్ జిల్లా ఇంఛార్జి)
శాసనాన్ని చదివి పరిష్కరించింది శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్
కాకతీయ శాసనాలను పరిశీలించేటపుడు కాకతీయరాజుల బిరుదాలలో కొన్ని ‘గజకేసరి’తో ముగిసేవి వున్నాయి. బయ్యారం శాసనం కాకతీయరాజుల్లో కేసరితటాకాన్ని తవ్వించిన మొదటి ప్రోలరాజుకు ‘అరిగజకేసరి’ బిరుదు వుందని తెలుపుతున్నది. రుద్రదేవుని సామంతుడు మల్లిరెడ్డి వేయించిన బెక్కల్లు శాసనం రుద్రదేవున్ని ‘దాయగజకేసరి’ అనే బిరుదుతో కీర్తిస్తున్నది. పాకాలశాసనం గణపతిదేవున్ని ‘రాజగజకేసరి’ బిరుదుతో వర్ణించింది.
‘‘ ఏ తన్మాద్యన్మహారాజ గజకేసరి విభ్రమమ్
గణపత్యవనీంద్రస్య’’.. రాజగజకేసరి అన్న బిరుదు గణపతిదేవుని సార్వభౌమత్వాన్ని వ్యక్తం చేస్తుందని పివి పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో వివరించాడు. రుద్రమదేవి సామంతుడు భైరవుడు వేయించిన బీదరు శాసనంలో 3సార్లు ‘రాయగజకేసరి’ బిరుదు పేర్కొనబడ్డది. రెండుసార్లు గణపతిదేవుని పరంగా, ఒకసారి రుద్రమదేవిపరంగా ‘రాయగజకేసరి’ చెప్పబడ్డది. తేరాల సిద్ధేశ్వరాలయ శాసనంలో ప్రతాపరుద్రున్ని కీర్తించే సందర్భంగా ‘దాయగజకేసరి’ అన్న బిరుదు ప్రత్యేకంగా రాయబడ్డది.
కాకతీయ నాణాలను గుర్తించడానికి ఈ రాజబిరుదాలు ఉపయోగపడతాయి. పివి పరబ్రహ్మశాస్త్రి రాసిన మోనోగ్రాఫ్ ‘కాకతీయ కాయిన్స్ అండ్ మెసర్స్’ (1975)లో ఈ వివరాలను చూడవచ్చు.
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గుడి తండా గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకతీయశైలిలో నిర్మించబడ్డ గుడిమంటప స్తంభాలలో ఒకదానిపై బయటపడిన కొత్తశాసనంలో గణపతిదేవుని బిరుదు ‘రాజగజకేసరి’ మరోసారి కనిపించింది.
పాకాలశాసనంలో వున్నట్లే ఈ శాసనంలోని 12,13 పంక్తులలో ‘‘అస్మాద్యన్నహి ‘రాజగజకేసరి’ విభ్రమం గణపత్యవనీంద్ర స్యా’’ అని వుంది.
గుడి తండా గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకతీయశైలిలో నిర్మించబడ్డ గుడి. ఈ గుడి త్రికూట దేవాలయం, కాని రెండు గుళ్ళే కనిపిస్తున్నాయి. మూడవగుడి భాగం తొలగించబడ్డదో, శిథిలాలు ఎక్కడ వున్నాయో తెలియదు. ప్రధానదేవాలయానికి గర్భగుడి, అంతరాలాలున్నాయి.అంతరాళ ద్వారానికిరువైపుల శైవద్వారపాలకులిద్దరు, వారికిరువైపుల చామర గ్రాహులున్నారు. గర్భగుడిద్వారానికిరువైపుల పెద్దకలశాలు చెక్కివున్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా వుంది. అంతరాళంలో వినాయకుని విగ్రహముంది. 3వైపుల విస్తరించి అర్థమంటపం, రంగమంటపాలతో, 16 స్తంభాలతో నిర్మించబడ్డ దేవాలయమిది. పశ్చిమ ముఖ ద్వారముంది.
ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలువబడుతున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో వుంది. మూడు శివలింగాలు వుండాల్సిన చోట ప్రస్తుతం పూజలందు కుంటున్న శివలింగమొకటి, భగ్నమైన లింగమొకటి కనిపిస్తున్నాయి. నాలుగడుగుల విస్తీర్ణం, లింగంతో రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం 3సోపానాలు కలిగివుంది. పూజలందుకుంటున్న శివలింగం యొక్క పానవట్టం 5సోపానాలతో వుంది. దేవాలయప్రాంగణంలో అందమైన, లాలిత్యమైన వీరభద్రుని శిల్పం వుంది. వీరభద్రుడు నాజూకుగా కన్పించడం విశేషం.
గుడిప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టానపీఠంమీద వేంకటేశ్వరుని విగ్రహం వుంది. దేవాలయప్రాంగణంలో రెండు ఆంజనేయుల విగ్రహాలున్నాయి. మంటపంలోని ఒక స్తంభంమీద ఒకవైపు సంస్కృతభాషలో, తెలుగులిపిలో చెక్కిన శాసనం, మరొక పక్క 4పంక్తుల తెలుగుశాసనం వున్నాయి.
ఈ దేవాలయం వెనక తూర్పున ఒక చెరువుంది. ఇక్కడొకప్పుడు కోయలుండేవారట. ఒక కోయకన్య చెరువులో స్నానమాడడానికి దిగి కనిపించకుండా 3 రోజుల తర్వాత వచ్చిందిట. అడిగిన తల్లికి తాను చెరువులో మునగగానే అందులో గుడి, అందులో శివుడు కనిపించాడని, 3 రోజులు తాను దేవుని సాన్నిధ్యంలోనే వున్నానని, దేవుడు పంపిస్తే తిరిగి వచ్చానని ఆ అమ్మాయి చెప్పిందిట.
ఈ శాసనం నర్సాపూర్ పరిధిలోని గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీదున్న శాసనానికి అచ్చంగా నకలులెక్క వుంది. 14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు వున్న 5పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘన్పూరులలోని శాసనాలకు అచ్చుప్రతిలా వున్నాయి.( వరంగల్ జిల్లా శాసనసంపుటి- శాసనాల సంఖ్యలు 78,79,80, 81,82). ఈ వరుసలలో మాచిరాజుపల్లి నివాసి పండితారాధ్య దాసుడు బొందలపాటి సోము శరణార్తి కోరుతున్నట్లు వుంది. ఈ గుడితండాతోపాటు మిగిలిన 5చోట్ల కూడా ఇదే శాసనభాగం వుండడం ఆలోచింపదగ్గదిగా వుంది. ఈ శాసనంలోని మొదటివైపు దేవాలయదైవం రామనాథుని స్తుతి వుంది. ఈ సంస్కృత శ్లోకాలు కొన్నిచోట్ల పాఖాల శాసనాన్ని పోలివున్నాయి. పాఖాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడితండా దేవాలయానికి తూర్పున వున్న చెరువును ‘మౌద్గల్య తీర్థ ’ మంటారని వుంది. 175,176,187,188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన వుంది. అయితే గుడితండా శాసనం రెండవవైపు రామనాథదేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయలిద్దరు అరువణము(పాల గుండిగ, లేదా గిన్నె), దీపాలకు నేయి సేవచేసుకున్నట్లుగా వుంది.
శాసనకాలం గణపతిదేవుని పాలనాకాలమే. . గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘనపూరు శాసనాలలో వున్న విధంగానే ఈ శాసనంలో కూడా సంవత్సర,మాస,దిన వారాలు పేర్కొనబడలేదు. శాసనలిపిలో ‘త’ అక్షరం కొత్తగా కనిపించింది.
శాసనకాలం: కాకతీయ గణపతిదేవ చక్రవర్తి
శాసనస్థలం: గుడితండా, రాజరాజేశ్వర దేవాలయం(రామనాథ దేవర గుడి)
శాసనలిపి: తెలుగు
శాసనభాష: తెలుగు, సంస్కృతం
గుడితండా శాసనం:
మొదటివైపుః
1. స్వస్తి శ్రీరామనాధో గిరిజాసనాథో దేవో ముదేస్తు స
2. దా ప్రసన్నః యస్యోత్తమాంగం ప్రతిపద్యగంగా జాతాజుగ
3. త్యాం పునరుక్త పూతా జయతి సకలభముఖోయః
4. కటితట మదుముదిత నినద దలిగరుదనీలైః పూరయ
5. తి కర్ణ శంఖం స్వభజన నిరతజన కుశల సమృద్ధ్యై భవతు భ
6. వభూత్యై దైత్యవైరి వరాహః సకల జలధిగర్భౌ దుజ్జహానస్య
7. యస్య ధర కుటిల మృణాలి భాసిదంష్ట్రైక దేశీ దిశతి వసుమతీయం
8. లగ్నశైవాల లక్ష్మీం భూయాద్వః క్షణ
9. దాలలవాం జగతి నిర్వశధామ త్రయస్త్రింశత్కోటి తయా
10. సతాం సుమనసా మాయుష్య యే కౌషధం ఆకాశ వ్యప
11. దేశ ధూర్జటి జటాలంకార గంగాపయః కల్లోలై
12. కల కల్పాచ్ఛవ నిభానందాయ చాంద్రీకలా ఏతన్మా
13. ద్య న్మహీరాజ గజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్య
14. శ్రీయోరుగట్యంతిక మాచిరాజు ప
15. ల్లీజని శ్రీగిరి శృంగవాసి శ్రీపండితా
16. రాధ్య గృహస్యదాసో విభూతి గౌర శ
17. రణా గతోవః బొందలపాటి సో
18. ము దాసోహం శరణార్తి
రెండవ వైపుః
1. స్వస్తి శ్రీమతు మోదుకురి రామనాధదేవరకు
2. కాచబోయిండు మల్లెబోయిండు రామనా
3. ధ దేవర లరువణపు కాపులు వీరు ఇద్దరూ
4. పాడికిని దేవర దీపాలకు పోసి నేయి కాచబోయి
5. 0డును, మల్లె బోయిండును
ఈ శాసనాన్ని గుర్తించి, డిజిటల్ ఫోటోలు తీసి పంపింది అరవింద్ ఆర్య(కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు), సిరిమెల్ల అనుదీప్ (దక్కన్ క్రానికల్ వరంగల్ జిల్లా ఇంఛార్జి)
శాసనాన్ని చదివి పరిష్కరించింది శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్





























రాజాపేట సంస్థానం:
ఆలేరుకు 20 కి.మీ.ల దూరంలో వున్న మండలకేంద్రం రాజపేట. యాదాద్రి-భువనగరి, సిద్ధిపేట,మెదక్ జిల్లాల సరిహద్దులో వుంది రాజపేట. రాజపేట గ్రామం కోటలోపలనే వుంది.52 ఎకరాలలో మొత్తం కోట,ఊరు విస్తరించివున్నాయి. ఇట్లాంటి గడికోట తెలంగాణాలో మరెక్కడా కనిపించదు. కొత్తగా గ్రామం కోట బయటకూడా విస్తరించింది. మొత్తం 2000లకు పైగా ఇండ్లున్నాయి. ఈ కోట 12మీ.ల ఎత్తు, 3మీ.ల వెడల్పులు కలిగివుంది. కోట చుట్టూ లోతైన కందకం తవ్వి వుంది.కోట బయటవున్న గోపాలచెరువు నీళ్ళు ఈకందకంలోనికి పారేటట్లు కాలువతీసి వుంది.కోట ద్వారాలకు రెండువైపుల బురుజులు కట్టబడివున్నాయి. కోటలోపల పడమటివైపు రాజభవనం నిర్మించబడివుంది. దీన్ని అద్దాలమేడ అని పిలుస్తారు. అంతఃపురం అవసరాలకు తవ్వించిన పెద్దబావి వుంది. దాన్ని ‘ఏనుగుల భావి’ అని పిలుస్తారు. భవనంలోపల ఒకవైపు శివాలయం వుంది. రాజభవనానికివున్న 5బురుజులు కూలి, శిథిలమైపోతున్నాయి. రాజభవనం ముందరున్న ఫౌంటెన్ శిథిలజ్ఞాపకంగా మిగిలిపోయివుంది.
రాయన్న అనేరాజు కోట నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి ఆలేరు వాగుకు తూర్పున వున్న గుండ్లగూడెంలో కొంతమేరకు కోటనిర్మాణం చేసాడు. కోటనడుమ శివాలయాన్ని కట్టించాడు. కాని, ఎందుకో అక్కణ్ణించి రాజపేట ప్రాంతానికి వచ్చి విజ్ఞుల సలహాతో ఇక్కడే కోట నిర్మాణం చేసాడంటారు.
ఈ కోటను వెదిరె వంశం వారు నిర్మించారు. నిజాం పాలనాకాలంలో(క్రీ.శ. 1724-1948) నిజాంరాజులు తమకిష్టమైన ప్రభుభక్తిపరులకు జాగీర్లు, సంస్థానాలు, పాయెగాలు ఇచ్చేవారు.నిజాం రాష్ట్రంలో 14 సంస్థానాలుండేవి. వాటిలో రాజపేట ఒకటి. మంచి ఆదాయంవున్న సంస్థానాలకు స్వయంపాలనాధికారాలుండేవి. అటువంటి హక్కులులేని సంస్థానం రాజపేట. ఈ సంస్థానం పరిధిలో 9గ్రామాలుః రాజపేట, కుర్రారం, నమిలె, మాసాయిపేట, కోరుకొండ, పెద్దపాడు, సాధువెల్లి, చల్లూరు, వెంకిర్యాల వుండేవి. సంస్థానాధీశులు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. నిజాం రాజుకు పంపే నజరానాకు కావలసినవన్నింటిని వెట్టివాండ్లైన హరిజనులు మోసుకుంటు కాలినడకన పోయి హైదరాబాదులో ఇచ్చి వచ్చేవారట. అట్లాంటి సేవలు చేసే వారికి నిజాం ‘బలోతా ఇనాం’(పన్ను కట్టనవసరంలేనిది) యిచ్చేవాడట.
క్రీ.శ.1775లో ‘రాజా రాయన్న’ రాజాపేట గ్రామాన్ని దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. రాజపేట పూర్వనామం రాయన్నపేట. రాయన్నతర్వాత అతని కుమారుడు రాజా వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు రాజ్యాధికారం చేపట్టాడు.కావడానికి వీరు రెడ్డిదొరలే అయినా వీళ్ళకు నిజాం యిచ్చిన బిరుదు ‘రావు బహద్దూరు’వల్ల తమ పేరు తర్వాత రావు అని పెట్టుకునేవారు. ఈ నారాయణరావే తనపేరుతో నారాయణపురం సంస్థానాన్ని నిర్మించాడని తెలుస్తున్నది. తనకు సంతానంలేని కారణం చేత రాజపేట తనసోదరుని కుమారుడైన రామేశ్వర చందర్ ని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణరావుకు కొడుకు పుట్టాడు. అతని రాజా రాయన్న.నారాయణరావు చనిపోగానే అధికారం, ఆస్తుల కోసం తగాదాలు కలిగాయి. నిజాంరాజు రాజారాయన్న చిన్నవాడైన కారణంగా గోపమ్మఅనే స్త్రీకి పాలనాధికారం యిచ్చాడు. రామేశ్వరచందర్ కు అధికారం రాదని తెలిసిన వెంటనే విలువైన ఆస్తుల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. నారాయణపురానికే అయివుంటుంది. అప్పట్నుంచి సంబంధాలు మారిపోయాయి. నిజాం రాజు రాజా రాయన్నను చదివించడానికి హైదరాబాదుకు తీసుకుని వెళ్ళాడు. మీర్ లాయక్ అలీ, సర్ సాలార్ జంగ్ లతో కలిసి చదువుకున్న రాజారాయన్న ఇస్లాం మతం తీసుకున్నాడు. ఎందరినో పెండ్లి చేసుకున్నాడు. వారిలో చింతపల్లి జమీందార్ బిడ్డ సీతమ్మ, రాజమ్మ, గార్లపల్లి నర్సయ్య కుమార్తె రంగమ్మ, షేక్ మహమ్మద్ కూతురు రసూల్ బీ, జైనబ్ బేగం. హుసేనిబేగంలున్నారు.
సంస్థానాధీశుడైన రాజా వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు సంస్థానంలోని వేంకటేశ్వర మఠానికి పూజాదికాల నిర్వహణకు మఠాధిపతి షాకరుదాసు బైరాయికి సన్ 1192(క్రీ.శ.1782) శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు వ్రాయించి ఇచ్చాడు.గంగరాజు రాముడు కులకర్ణి రాయన్నపేట(రాజాపేట) దానపత్రము రాసాడు.
సంస్థానం రాజాపేట రాజా వెంకటనారాయణరావు బహద్దూరు ఇచ్చిన భూదాన పత్రికః
భూదాన శాసనపాఠం:
శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు షాకరుదాసు బైరాగికి రాజా వెదిరె వెంకటనారాయణారావు బహద్దురు సరుదేశముఖు సర్ దేశపాండ్య వసర నాడెగవుడు స.బోనగీరు వషహనగరు వరాజు కొండ యింద్రి వెల వగైరా గ్రామ వ్రాయించి యిచ్చిన భూదానపత్రిక శ్రీ.... స్వామికి నిత్యనైవేద్య దీపారాధన నడ్పవలసినాందుకు భుదానం కావలెనని మందలిస్తిరి కన్క మనస్కరించి రాయంన్నపేటలోను వుత్తరంపు వెర్గుచద్ది శివ్వారెడి చేశ్ని కవులు జాగా నీంమ్మంధం గుండ్లబావి కింద యిస్తువా చెల్క కుండెడు (జొ)న్నలు పెట్టుబడిది నిష్కష్ర చేసి శలవు యిచ్చినాం. యింద్కు హద్దులు తూర్పుకు ఉండె మర్రిచెల్క పడుమర్కు మఠ ఉత్తరానకు చెరు(?) దక్షణం చదుమస్తులు యీలోన నినర్ణం చేసి వ్రాయించి శ్రీ స్వామికి ప్రీతిగాను మీరూంన్ను మీశిష్యలూంన్ను ప్రతి సంవత్సరం జాగా ఫలపరచుకుని తత్ఫలం నిత్యనైవేద్యదీపారాధన గడుపుకుంటు మాకు ఆశీర్వచనం చేస్తూ సుఖాన వుండుకునేది. యిది హర్షోక్తిన వ్రాయించి యిచ్ని భూదానపత్రిక. చం.7 రజ్జబు
స్వదత్తాం ద్విగుణం పుణ్యం
పరదత్తాను పరతద్తు పహరణ
స్వదత్తా సత్ఫలం భవేతు
గంగరాజ రాముడు కులకర్ణి, రాయన్నపేట – వేంకటేశ్వర మఠం
ఆధారగ్రంథాలుః
1. తెలంగాణ గడీలు- కెవి నరేందర్, సంగెవేని రవీంద్ర
2. విరువంటి గోపాలకృష్ణ సేకరించిన శాసనపత్రం.







































చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...