Friday, April 6, 2018


నేలకొండపల్లిలో రేచెర్ల పసాయిత గణపతిరెడ్డి  శాసనం:

          కాకతీయుల సామంతులు అనేకమంది వున్నారు.వీరిలో 1. రేచెర్ల నాయకులు, 2. విరియాల నాయకులు, 3.మల్యాల నాయకులు, 4. నతవాడి నాయకులు, 5. చెరకు నాయకులు, 6. కోటనాయకులు, 7.కాయస్థ నాయకులు, 8.ఇందులూరి నాయకులు, 9.వెలమ నాయకులు, 10. నిడదవోలు నాయకులు ముఖ్యులు. వీరివలె కుటుంబాలే కాక విడిగా వ్యక్తులుగా కాకతీయులకు సేవలందించిన వారు కూడా వున్నారు. వారిలోగంగాధరుడు, జాయ(న) సేనాని, సామంతభోజుడు, యాదవులలో విశ్వనాథదేవుడు, సారంగదేవుడు, అక్షయచంద్రదేవుడు, పేర్మాడిదేవరాజు, సారంగపాణి దేవుడు, మరికొందరు చోళ ప్రముఖులలో మన్మగండగోపాల చోళుడు, మల్లిదేవ మహారాజు, బెండపూడి అన్నయామాత్యుడు, ముప్పిడినాయకుడు, సోమయాజుల రుద్రయ్య, గొంకయరెడ్డి, మారయసాహిణి, గోన విఠలుడు, దేవరి నాయకుడు, లెంకలు- జుట్టయలెంక, రుద్రయలెంక, సోమయ లెంక, నాగయ గన్నయ(మాలిక్ మక్బుల్ తిలింగి) మొదలైన వారున్నారు.
          రేచెర్ల నాయకులు కాకతీయులకు చేసిన సేవ ఎనలేనిది. రాజభక్తి తిరుగులేనిది. వారిలో రామప్పగుడిని కట్టించిన ప్రతాపరుద్ర సేనాపతి(రుద్రసేనాని)కి ‘కాకతిరాజ్య స్థాపనాచార్య, కాకతిరాజ్య సమర్థ, కాకతీయ రాజ్యభార ధౌరేయ’ అనే బిరుదులున్నాయి. (దాక్షారామ, ఉప్పరపల్లి శాసనాలు) మాండలిక హోదా, రాచచిహ్నాలు కూడా లభించింది రుద్రసేనానికే. వారిని రేచెర్ల రెడ్లు అంటారు. వీరి వంశావళి క్రమమిట్లున్నది.(పరబ్రహ్మశాస్త్రి - కాకతీయులు, పేజి.143,144)
రేచర్ల రెడ్డి నాయకుల వంశావళి
I
బమ్మసేనాని
I
ముచ్చ
I
కాట
I
కామిరెడ్డి
I
కాచాంబ కుమారులు                                                                                         మరో భార్య కుమారుడు
            I                                                           I                                                           I
నామిరెడ్డి(క్రీ.శ. 1195)                                  బేతిరెడ్డి(క్రీ.శ.1208)                                     కాట్రెడ్డి    
భా.ఐతమ                                                భా. ఎరుకసాని      
            I                                                           I                                                           I
-------------------------                 ---------------------                                  --------------------
I                I                  I                       I                            I                  I                          I
విశ్వనాథ   కాట్రెడ్డి      కామిరెడ్డి                       లోకిరెడ్డి               మల్లారెడ్డి             ముచ్చ   రుద్రసేనాపతి
                I                   I                                                                                               I
                I       గణపతిరెడ్డి    మర్రెడ్డి                                                            కాట      లోకిరెడ్డి      గణపతిరెడ్డి
                I                                                                                             I        
-----------------------                                                                               పసాయిత గణపతిరెడ్డి
కామిరెడ్డి        నాగిరెడ్డి         మల్లయరెడ్డి
రుద్రసేనాని వారసులలోని వాడైన పసాయిత గణపతిరెడ్డి దానశాసనమొకటి నేలకొండపల్లి చెరువుగట్టు మీద పడివుంది.
          శాసన భాష తెలుగు, సంస్కృతం. లిపి 13వ శతాబ్దపు తెలుగులిపి. 151 పంక్తుల శాసనమిది. వచనం, పద్యాలు, శ్లోకాలతో ఈ శాసనం చంపూకావ్యాన్ని మించింది.        
          ఈ శాసనం 7అడుగుల ఎత్తున్న నలుపలకల రాతిస్తంభానికి నాలుగుదిక్కుల చెక్కివుంది. మొదటివైపు ఢమరుకం, త్రిశూలం వున్నాయి. రెండోవైపు పైన సూర్యచంద్రులు, కింద వరాహం వున్నాయి. మూడోవైపు, నాలుగోవైపు ఏ చిహ్నాలు లేవు. సాధారణంగా కాకతీయల శాసనాల మీద కనిపించే సూర్యచంద్రులు, శివలింగం, ఖడ్గం, ధేనువు చిహ్నాలు ఈ శాసనం మీద కనిపించకపోవడం ప్రత్యేకం. మహామండలేశ్వరునికి లోబడి పాలించే మాండలికుని రాజచిహ్నలై వుంటాయి. గణపతిదేవ చక్రవర్తి రుద్రసేనానికి మాండలిక పదవినిచ్చి, రాచచిహ్నాలను కూడా యిచ్చినట్టు పరబ్రహ్మశాస్త్రి కాకతీయులులో రాసారు.(పాలంపేట,దిచ్చకుంట శాసనాలు) రుద్రసేనాని ముదిగొండ చాళుక్యుల తరువాతితరంవాడైన నాగతిరాజును ఓడించి విసురునాడు అని పిలువబడే భద్రాచలం ప్రాంతాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపివేసాడు. బహుశ రుద్రసేనానిని ఎలకుర్తికే కాక ముదిగొండ చాళుక్యులేలిన ప్రాంతానికి కూడా మాండలికుని చేసివుంటాడు(?). ఆ పరంపరలో వచ్చిందే ఈ శాసన సందర్భం. అదిగాక ఇప్పటికి పసాయిత గణపతిరెడ్డి శాసనం ఇదొక్కటేనా?.
          ఈ శాసనం గణపతిదేవుని రాజ్యపాలనకాలం నాటిది. (నేల)కొండపల్లి చెరువుకట్టమీది  పోలకమ్మ మూలస్థానాని(గుడి)కి మహామండలేశ్వర కాకతీయ గణపతిదేవ మహారాజు నిజభృత్యుడైన రేచెల్ల(ర్ల) పసాయిత గణపతిరెడ్డివారు బొల్లసముద్రము(చెరువు) వెనుక ఇరుకారుల పంటను(రెండుకార్తెలు, రెండు సీజన్లు) రెండు మర్తురుల భూమిని (3ఎకరాలు దాదాపు) వ్రిత్తిగా... శక సం. 1162, శార్వరి సం.ర వైశాఖ శుద్ధ తదియ గురువారమునాడు అనగా క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దానశాసనం.
          ఈ శాసనం తొలుత సాధారణ శాసన తెలుగువచనాలతోనే మొదలైనా, తరువాత సంస్కృత శ్లోకాల్లోనికి (శాసనంలో 21 పంక్తి నుంచి 58వ పంక్తివరకు), తెలుగు గద్య,పద్యాల్లోనికి(65-70 పంక్తులు) మారిపోతుంటుంది.
          తెలుగు కందపద్యం:
                   శ్రీకొండపల్లిపురము
                   బ్రాకటముగం బెద్దచెర్వు పశ్చిమదిశ శో
                   భాకరమై నెలకొన్న ద
యాకరి రచియింతు బుధజనావళి మెచ్చన్....
 ఈ దానశాసనంలో ప్రోలకమ్మకు, నూకానమ్మకు, మారకమ్మకు ఆభరణాలు, ఎత్తునయనాలు, 2 సిన్నాల ఎత్తు పహిండాకులు, 2సిన్నాల ఎత్తు ముంగరలు, మూడు కంచు పళ్ళెరాలు, 12 సిన్నాలు ధూప,దీప,హారతులకు, రెండు చిపముంతల పాల కొనుగోలుకు 20 మాడలు, యిట్లా దేవతార్చనలకు అనేకవిధాల దానాలు చేసిన వివరాలీ శాసనంలో వున్నాయి. అన్నీ దానాలు గ్రామదేవతలైన అమ్మదేవతలకే చేయడం ప్రత్యేకం.
          ఈ శాసనం జాడ మాకు చెప్పింది పోతగాని సత్యనారాయణ, శాసనాన్నిఅచ్చుతీయడంలో మా చరిత్రబృంద సభ్యుడు కట్టాశ్రీనివాసుకు(టీచర్) సాయంచేసినవారు రిటైర్డు లెక్చరర్, నేలకొండపల్లి భక్తరామదాసు ధ్యానమందిరం నిర్వాహకులు సాధు రాధాకృష్ణమూర్తి. శాసనం మొదటివైపు మాత్రం చాలా స్పష్టంగా వుంది. కట్టా శ్రీనివాస్ తీసిన ఫోటోకాపీల ఆధారంగానే నేను(శ్రీరామోజు హరగోపాల్) ఈ శాసనాన్ని చదువడం జరిగింది.






No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...