Tuesday, August 4, 2020

కోటిలింగాలలో శాసనాలు

 

 

 

కోటిలింగాలలో శాసనాలు:

          కోటిలింగాలలో బౌద్ధస్తూపం శిథిలాలున్నచోట స్తూపానికి పెట్టే శిలాకంచుకానికి(Casing)వాడిన రాతిఫలకాలలో దొరికిన లేబుల్ శాసనాలు 26రింటిలో అర్థవంతమైన సమాచారం లేదని పురావస్తుశాఖ భావించింది. కాని ఠాకూర్ రాజారాం సింగ్ పట్టుదలతో ఆ శాసనాల ఫలకాలమీది రాతలను చూసి రాసుకొని,  తను చదువుకున్న పాఠశాలలోని మిత్రుని కుమారుడు మల్లావఝల నారాయణశర్మకు వాటి పరిష్కార బాధ్యతను అప్పగించాడు. ఐకే శర్మ సాయం కూడా లభించింది, నారాయణశర్మ ఆ శాసనాలను అధ్యయనం చేసి, బ్రాహ్మీలిపి పరిణామాలను పరీక్షించి, తాను వాటికి అర్థకల్పన చేసాడు. అవి బుద్ధుని ఆర్యసత్యాలను పోలివున్నాయని అభిప్రాయపడ్డాడు. లఘుశాసనాలలోని బ్రాహ్మీలిపి మౌర్యుల బ్రాహ్మీలిపితో, భట్టిప్రోలు బ్రాహ్మీతో పోలివుందని ఠాకూర్ రాజారాం సింగ్ అభిప్రాయపడ్డాడు. కొన్ని బ్రాహ్మీ అక్షరాలు పై లిపులకాలం కన్నా ముందరివని అభిప్రాయం కలిగింది. భాషాశాస్త్రవేత్త, సంస్కృత పండితుడు నారాయణశర్మ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ‘కోటిలింగాల- బ్రాహ్మీలఘుశాసనాలు’ అనే పరిశోధనాపత్రం కరీంనగర్ నుంచి వచ్చిన సాతవాహన కళోత్సవాల సంచిక(2002)లో అచ్చయింది. ఈ పత్రాన్ని ‘కోటిలింగాల- ఏ రిపోర్ట్ ఆన్ ఎక్స్కేవేషన్స్(1979-1983)’లో శాసనాలు(10వ అధ్యాయం)లో ఎన్నెస్ రామచంద్రమూర్తి  పేర్కొన్నారు. ఈ కోటిలింగాల తవ్వకాల నివేదికలో కోటిలింగాలలో, పరిసరాలలో లభించిన శాసనాల గురించి కొంత వివరం లభిస్తున్నది.

          కోటిలింగాలలో దొరికిన కొన్ని లఘుశాసనాలలో ‘గరకస’, ‘ఘరినిధ(గృహిణి)’, ‘పొధమర’ లున్నాయి.

          మొక్కట్రావుపేటలో లభించిన ‘నాగగోపినికాయా’ నామశాసనం వున్నది.

          క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీలిపిలో రాయబడిన ఈ నామశాసనంలోని ‘నికాయ’ ఒక మత సంబంధమైన శ్రేణి,  నాగగోప అనే వ్యక్తి ఆధ్వర్యంలోని బౌద్ధ సన్యాసుల సమూహం గురించి తెలుపుతుంది. నికాయకు ఒక రాశి, ఒక కూర్పు, వర్గం, ఒకే విధమైన విధులు నిర్వహించేవారి సంఘమని అర్థాలున్నాయి. బౌద్ధ సుత్త సాహిత్యంలో మజ్జిమ నికాయ, దీఘ నికాయ, అంగుత్త నికాయ, సంయుత్త నికాయ, ఖుద్దక నికాయలున్నాయి. ఈ నామక శాసన సందర్భాన్ని బట్టి బౌద్ధసన్యాసుల సంఘానికి పెద్దవాడు నాగగోప అని అర్థమవుతున్నది.

          కోటిలింగాలలో పెదవాగు ఒడ్డున బౌద్ధస్తూపముంది. కోటిలింగాలకు సమీపంలో పాశిగాం, కంభాలపల్లిలలో స్తూపాల, చైత్యాల శిథిలాలు లభించాయి.

          నాగగోపినికాయ నామశాసనం చెక్కిన రాతిదూలాన్ని చూసినపుడు, అది ఒక శ్రేణి, ఒక సంఘం వున్న స్థానానికి ప్రవేశద్వార పతంగం అనిపిస్తుంది. నిఘంటువులను సంప్రదిస్తే ఇల్లు, కులవృత్తుల సంఘం అని నికాయకు అర్థాలనిస్తున్నాయి.

          మొక్కట్రావుపేటలోనే లభించిన హకుసిరి శాసనంలో

          ‘అహమకా నభ(మ) బాలికాయ మహపురిస దతాయ

          అమచపుతస సివవటుస స ఉపథ యకినియ చదేయ

          చథ బాలికాయ హకుసిరియ ఈ దేయ నాగ(సిరి)య గోపియ’

 3వ పంక్తి చివర ‘నాగ...య గోపియ’ అని వుంది. అందువల్ల ‘నాగగోపినికాయ’ నామశాసనంలోని నాగగోపి ఇతడేనని చెప్పవచ్చు.




చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...