Monday, November 8, 2021

భాగవత మతం


‘‘వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ బౌతికప్రపంచానికి నలువైపులా వున్నారు. వైకుంఠలోకం ఈ ప్రపంచంలో నీటితో కప్పబడివుంది. ఆ గ్రహం మీద వేదవతి అనేచోట వాసుదేవుడున్నాడు.మరోచోటు సత్యలోకం పైన మరోగ్రహం విష్ణులోకమని పిలువబడేచోట సంకర్షణున్నాడు. అట్లే ద్వారకాపురిలో ప్రద్యుమ్నుడు పాలకుడు. పాలసముద్రంలో శ్వేతద్వీపమనే చోట ఐరావతిపురిలో అనిరుద్ధుడు అనంతునిపై శయనించి వుంటాడు.

ఈ నవఖండ భూమండంలోని భక్తులపై దయచూపడానికి నారాయణుడే స్వయంగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధులనే 4 అవతారాలతో వ్యక్తమైనాడు.’’ (శ్రీమద్భాగవతం-5వ సర్గం 17.14)
నానేఘాట్ శాసనంలో(క్రీ.పూ.70?) వాసుదేవ, సంకర్షణ దేవుల పేర్లు లిఖించబడ్డాయి. అంటే అప్పటి సాతవాహనులలో ఎవరైనా భాగవతభక్తులున్నారనే కదా అర్ధం. సాతవాహనులు వైదికులు అని చెప్తున్నప్పటికీ వారు బౌద్ధం, భాగవత మతాలను కూడా స్వీకరించినారని తెలుస్తున్నది. బౌద్ధ, జైన, వైదిక, భాగవత మతాలు పరిపాలక మతాలుగా రూపుదిద్దుకుంటున్న కాలమది. తర్వాత కాలంలో ఒక గ్రీకు రాయబారి కూడా భాగవతమతాన్ని స్వీకరించి వాసుదేవ దేవాలయాన్ని నిర్మించాడు.
మధ్యప్రదేశ్ లోని విదిశజిల్లా బేస్నగర్లో హేలియోడోరొస్ స్తంభాన్ని ఖంబబాబా అని పిలుస్తున్నారు. ఈ బేస్నగర్ లోని హేలియోడోరొస్ స్తంభాన్ని తొలుత అలెగ్జాండర్ కన్నింగ్ హాం 1874-77ప్రాంతంలో గుర్తించాడు. ఆ స్తంభం మీది శాసనాన్ని 1909లో జాన్ మార్షల్ గుర్తించి, అచ్చుతీసాడు. శాసనం ప్రాకృతభాషలో బ్రాహ్మీలిపిలో రాసివుంది. శాసనంలో ‘‘మహారాజు అంతాలికిత (ఏంటియల్కిడాస్) దగ్గర నుంచి కాశ్పుత్ర భాగభద్ర రాజు యొక 14వ రాజ్యపాలనా సంవత్సరంలో అతని వద్దకు గ్రీకురాయబారిగా వచ్చిన తక్షశిల డియోన్ కుమారుడు భాగవతుడు హేలియోడోరొస్ దేవాధిదేవుడైన వాసుదేవుని యొక్క గరుడస్తంభం నిర్మింపజేసాడు.’’ అని వుంది.
రెండవ శాసనంలో ‘‘ స్వాధీనం, ఉదారత్వం, సావధానత’’ ఈ మూడు సోపానాలు పొరపాటులేకుండా పాటిస్తే స్వర్గానికి దారి తీస్తాయి.’’ అని వుంది. ఈ శాసనాలు క్రీ.పూ.140సం.లో వేయించ బడ్డాయి.
ఈ వూరుకు చుట్టు బేత్వ(వేత్రవతి),బేస్ నదులున్నాయి. ఈ నగరానికే దశార్ణ, బేస్నగర్, భిల్సా అనే పేర్లుండేవి. బేస్నగర్ అనే పేరు వైశ్యనగర నుండి వచ్చివుంటుంది. ఈ పట్టణం సాంచికి 9కి.మీ.ల దూరంలో వుంటుంది. జంబూద్వీపంలో 16 జనపదాలలో ఒకటైన దశార్ణదేశానికి విదిశ రాజధానిగా వుండేదని కాళిదాసు మేఘదూతంలో రాసాడు. మాళవికాగ్నిమిత్రం అనే కావ్యంలో శుంగ వంశానికి చెందిన పుష్యమిత్రుని కొడుకు అగ్నిమిత్రుని గురించి చెప్తుంది. అతడు విదిశను ఉపరాజుగా పాలించాడని తెలుస్తున్నది.
ఇక్కడ జరిపిన తవ్వకాలలో సాతవాహనరాజు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి( క్రీ.శ.175) నాణాలు, నాగరాజులు గణపతినాగ,భీమనాగ (క్రీ.శ.4వ శతాబ్దం), కాలచురి యువరాజు క్రిష్ణరాజ (క్రీ.శ.6వ శతాబ్దం) నాణాలు దొరికాయి. వీటి ఆధారంగా అక్కడ 6,7 శతాబ్దాల వరకు వాసుదేవుని గుడి వుండేదని చెప్పవచ్చు.
కాని, వాసుదేవ, సంకర్షణులిద్దరు పశుపాలక, వ్యావసాయిక వ్యవస్థల ప్రతినిధులుగా చెప్పవచ్చు. వాసుదేవుడంటే గోపాలబాలకులవలె వేణువు, నెమలిపింఛాలను ధరించిన కృష్ణుడే. సంకర్షణుడంటే వ్యవసాయానికి టెక్కెం వంటి నాగలిని ధరించిన బలరాముడే. వారిని పురాణపురుషులను చేసింది మతాలమధ్య పోటీలతో పూజారివర్గాలే. మనదేశంలో పశుపాలక జీవనం నుంచి వ్యవసాయిక జీవనంలోకి పురోగమిస్తున్న ప్రజలు బ్రాహ్మణులచేత, బౌద్ధులచేత ప్రేరేపించబడి పశువ్యాపారం నుంచి, వ్యావసాయికోత్పత్తుల వ్యాపారానికి ఎదిగారు. నానేఘాట్ శాసనం అదే చెప్తుంది. ఆ దారి వ్యవసాయానికి ఉపయోగించే ఆవులు, ఎద్దులు, రవాణాకు పనికొచ్చే గుర్రాలు, ఏనుగులను కొని, అమ్మి తెచ్చే వ్యాపారుల వద్ద సుంకం వసూలు చేసే కేంద్రమని, దానిని సాతవాహనరాజులు ఏర్పరిచారని తెలుస్తున్నది. కోసంబి చెప్పినట్లు పూర్వసాతవాహనులు గుర్రం టోటెంగా వున్న అశ్వకులే(అస్సకులు) అయివుంటారు. భారతదేశచరిత్ర రాసినప్పటికి కోటిలింగాల వద్ద తవ్వకాలలో బయటపడ్డ సాతవాహన నాణాల గురించి కోసంబికి తెలిసివుండకపోవచ్చు. అందువల్ల కోసంబి సాతవాహనులు పైఠాన్ రాజధానిగా పాలించిన వారేనని భావించివుంటాడు.

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...