Tuesday, April 9, 2019

యాదగిరిగుట్టలో ఆత్మాహుతిశిల:

యాదగిరిగుట్టలో ఆత్మాహుతిశిల:
యాదగిరిగుట్ట రాయగిరిల మధ్య రాయగిరి చెరువుకు ఉత్తరాన సాయిబాబా నగర్ ప్రాంతంలో రాష్ట్రకూటుల కాలంనాటి శిధిలశివాలయం ఆనవాళ్ళు లభించాయి. వాటికి తూర్పున 7 వీరశిలలు వున్నాయి. అందులో ఒక వీరగల్లు మీద 7,8 శతాబ్దాలనాటి తెలుగులిపిలో శాసనముంది. మహబూబ్నగర్ గొల్లత్తగుళ్ళ వద్ద కనిపించిన వీరగల్లుల మీద వున్న తెలుగులిపే ఇక్కడ అగుపించింది. అక్కడున్న వీరగల్లులు దాదాపు యుద్ధంలో ఒరిగిన వారివే. ఒక్కటి మాత్రం ప్రత్యేకం. ఈ వీరగల్లు రెండంతస్తులు కలిగివుంది. పై అంతస్తులో భక్తుడు అప్సరసల నడుమ కూర్చుని వున్నాడు. కింది అంతస్తులో ధ్యానాసనంలో నమస్కారముద్రలో కూర్చున్న భక్తుని మెడ తెగి తల వేరుగా కనిపిస్తున్నది. అతని పక్కన ఒంచిన (వెదురు)గడ తలమీద జుట్టును తాకుతున్నది. ఈ భక్తుని కోరిక మేరకు ఎవరో ఇతని మెడనరికి తలను వేరు చేసినట్లున్నది. ఇట్లా కోరి శివార్పణంగా తలపండునివ్వడం వీరశైవుల సంప్రదాయం. ఇటువంటి శిలలు పురుషులవి (1.బిర్లామ్యూజియం, హైద్రాబాద్,2. పెద్దపల్లి జిల్లా ఆబాది రామగుండం దగ్గర లింగాపురం, 3.యాదగిరిగుట్ట) దీనితో కలిపి3, స్త్రీలవి 3(జనగామజిల్లా వనపర్తి, యాదాద్రిజిల్లా చొల్లేరు, జనగామ జిల్లా సీతారాంపురం) ఆత్మాహుతి శిలలను తెలంగాణాలో తెలంగాణా జాగృతి చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, కళ్ళెం సంపత్ కుమార్ గౌడ్ గుర్తించారు










.

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

ఇంద్రపాలనగరంలో ‘శంకరగండరస’ జయధీర జైనబసది:

March 12, 2016న నేను, మా చంటితో కలిసి వలిగొండ, తుమ్మలగూడెం శంకరంగుట్టలలో చరిత్రకొరకు అన్వేషించాం. మాకు శంకరంగుట్ట మీది విశేషాలను చూడడానికి తోడ్పడ్డవారు వనంక్రిష్ణయ్య(భోగారం), వి.లింగయ్య (తుమ్మలగూడెం), బెలిదె రాజయ్య (నాగారం), యాదయ్య (తుమ్మలగూడెం).ఆ పెద్దలకు మా ధన్యవాదాలు.
ఈ గుట్టమీద కళ్యాణీ చాళుక్యులకాలం నాటి దేవాలయం, శాసనం శిథిలస్థితిలో వున్నాయి. పలుమార్లు పునరుద్ధరణలు చేయడం వల్ల దేవాలయం రూపురేఖలు చాలా మారి పోయాయి. జైనగుహాలయాలనే తమ ఇష్ట దైవాలయాలుగా మార్చివేసారు. ఇపుడు గుడివున్నచోటుకు పైకి వెళితే రాతిగుండ్ల మధ్యనుంచి తీసిన దారి జైనబసదికి తీసుకువెళ్తుంది. అక్కడ రెండు ఎత్తైన కొండరాళ్ళ మీద జైనతీర్థంకరుల ఉల్బణశిల్పాలు(Bas relieves) అగుపిస్తాయి.
తేదీలేని తుమ్మలగూడెం శాసనం(నల్లగొండ జిల్లా శాసనాల సంపుటి, వాల్యూం 1, పేజీనం.38 శా.సం.15)లో బిరుదగద్యలలో చెప్పబడిన శంకరగండరస ఎప్పటివాడో చెప్పలేదు. కాని, 2016 జనవరిలో నల్లగొండ జిల్లా ఆమనగల్లులో మాకు లభించిన శంకరగండరస శాసనం అకాలవర్షుని పరిపాలనాకాలం(క్రీ.శ.888)నాటిది. మహామండలేశ్వరుడుగా కొలనుపాక-20,000నాడును పాలిస్తున్న శంకరగండరస పేరన చేర్యాల దగ్గర ఆకునూరులో, వరంగల్ దగ్గర జాఫర్ గడ్ లో, తుమ్మలగూడెం(ఇంద్రపాలనగరం), ఆమనగల్లులో శాసనాలు లభించాయి. ఆమనగల్లులో తప్ప మిగతా శాసనాలలో శంకరగండరస కాలం లేదు. తర్వాత కాలంలో కొలనుపాకలోనే చిన్నా, పెద్దపాలకులుగా వున్న ఇద్దరు శంకరగండరసలున్నా వారి కాలం వేరు. వారి మతం వేరు. మొదటి శంకరగండరస కాలం క్రీ.శ. 888, రాష్ట్రకూటుల ప్రతినిధిగా కొలనుపాకను ఏలినవాడు. అమోఘవర్షుని కాలంలో పానుగనూరు-27000నాడుకు పాలకుడుగా వుండేవాడు. అమోఘవర్షునితో ఘర్షణ పడినా, దగ్గరి బంధువు, రాజకీయ చాతుర్యమున్నవాడు కనుక కొలనుపాకకు తిరిగి ప్రతినిధిగా నియమింపబడ్డాడు. రాష్ట్రకూటులు జైనులే. శంకరగండరస జైనుడే. ఆమనగల్లులో అతనిపేరన వేయబడిన శాసనంలో అక్కడ ‘ఆకులార్బుగుళు’ జైనబసదికి దానాలు చేసినట్టు వుంది. అతనికి వున్న బిరుదులలో ఒకటైన ‘జయధీర’ పేరన తుమ్మలగూడెంలో జయధీర జినాలయం కట్టించినట్టు చెప్పబడింది.
శంకరం గుట్ట మీదున్న ఈ జైనబసదే జయధీర జినాలయం. ఈ జైనబసదిలో రెండువైపుల రెండు నిలువు కొండరాళ్ళపై జైన తీర్థంకరుల బొమ్మలు ఒక వైపున పార్శ్వనాథునితో కూడిన 3తీర్థంకరులు, మరొకవైపు 5గురు తీర్థంకరులు ధ్యానాసనాలు, ధ్యానముద్రలతో వున్నారు. మరొక చోట అసంపూర్ణంగా వున్న శిల్పం కనబడుతున్నది. శంకరంగుట్ట అన్నది కూడా శంకరగండరస పేరుమీదనే వచ్చివుండవచ్చు.
(అయితే ఇదే గుట్టమీద తూర్పువైపున స్తూపాకారంలో ఇటుకల వరుసలు, 3చోట్ల కనిపిస్తున్నాయి. శంకరంగుట్టవెనకవైపు కింద మూసీనది ఒడ్డున బౌద్ధస్తూపం జాడలున్నాయి.)








చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...