Thursday, April 23, 2020

పొట్లపల్లిలో శివాలయం:


 పొట్లపల్లిలో ఒకరు ఇంటిపనుల్లో భాగంగా తవ్వుతుంటే శివాలయంలో లింగం ప్రతిష్టించే పానవట్టం ఒకటి బయటపడ్డట్లు నిన్న వార్త వచ్చింది. హుస్నాబాద్ నుంచి విలేకరి మిత్రుడు ఎల్లయ్య రెండ్రోజుల నుంచి సంప్రదిస్తున్నాడు పొట్లపల్లి చరిత్ర గురించి. ఫేస్బుక్లో అనంతవరం శ్రీనివాస్ వార్త, ఫోటోలు పెడుతున్నాడు.
          ఇపుడు బయటపడ్డ పానవట్టం 5అంచుల గుండ్రని పానవట్టం. ఈ శైలి పానవట్టాలు కళ్యాణీ చాళుక్యులనాటి శివాలయాలలోనే ఎక్కువగా అగుపిస్తాయి. అయితే ఈ పానవట్టాల మీద ప్రతిష్టించే లింగాలు కాకతీయశైలి సమలింగాలు కావు. వీటికి బ్రహ్మ,విష్ణు,రుద్రభాగాలుండవు. ఒక లింగభాగమే వుంటుంది. నర్మదానదిలో దొరికే బాణలింగాలుగా పిలిచే గుండ్రని అండాకారపు రాళ్ళలో ఒకటి లింగంగా ఈ పానవట్టంమీద అమరుస్తారు. ఇపుడు పానవట్టం దొరికింది. అది  ఆలయం నుంచి తీసి బయటపడేసింది కాకపోతే బాణలింగం కూడా అక్కడే దొరకవచ్చు.
          కరీంనగర్ జిల్లా శాసనసంపుటిలో  16వ శాసనం(42వ పేజీ) పొట్లపల్లి శాసనం.ఈ శాసనంలో క్రీ.శ. 1066వ సం.(శక సం.988, చైత్రపౌర్ణిమ) మార్చి 14న, చంద్రగ్రహణం సందర్భంగా అక్కడి పంచమఠాలలోని నకరేశ్వర దేవరకు  తపోధనుడు మల్లప్ప(గురువు)అగ్రహారం కొరకు ద్రవ్యం మొదలైన సమభోగాలకు, త్రిభోగాభ్యంతర సిద్ధిగా, సర్వపరిహారం (అన్ని పన్నుల రద్దు)గా ధారాపూర్వకంగా 5 కొట్టరాడ్ల రాటణాన్ని కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల దేవుని పాలనాకాలంలో అతని మహాసామంతుడు పొట్టపల్లి గోవ(అధికారి) రేగొండ చందయ్య రసర్(రాజు) దానం చేసాడు.
          త్రైలోక్యమల్లదేవుని శాసనాలలో పంచమఠాల ప్రస్తావన వస్తుంది. ఈ పంచమఠాలు కాలాముఖమఠాలు కావచ్చు. పొట్లపల్లి  గురువు మల్లప్పకిచ్చిన అగ్రహారం. ఈ అగ్రహారంలో నీటి వ్యవస్థ కొరకు మహాసామంతుడు రేగొండ చందయ్యరసర్ నీరుతోడే యంత్రం రాటనాన్ని దానం చేసాడు. అగ్రహారానికి పన్నుల బాధలేకుండా చేసాడు.
          పొట్లపల్లి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని గ్రామం. ఈ గ్రామానికో వాగుంది. దాన్ని రేణుకావాగు అని పిలుస్తారు. ఊరిబయట నాగశిలలున్నాయి. పోషమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మదేవత, పరశురాముడికి గుడులున్నాయి. ఊరిలో మల్లన్న గుడి, సీతారామచంద్రస్వామి గుడి, శివాలయాలున్నాయి. అపుడపుడు గ్రామంలో పునాదుల కోసమో, పనులకోసమో తవ్వినపుడల్లా ఏదో ఒక విగ్రహమో, గుడి స్తంభాలో దొరుకుతుంటాయి.
          పొట్లపల్లి గ్రామానికి దగ్గరలో ఒకగుట్ట వుంది. దీన్ని ఎల్లమ్మగుట్ట అని పిలుస్తారు స్థానికులు. గుట్టపాదంలో  బంతిరాళ్ళ సమాధులు విరివిగా కనిపిస్తాయిక్కడ. వీటిని పరిశీలించినపుడు ఇవి పెదరాతియుగం సమాధులు అని తెలుస్తుంది.

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...