Thursday, April 26, 2018

‘‘రాజగజకేసరి కాకతీయ గణపతిదేవ మహారాజు’’ కొత్తశాసనం:
ఈ శాసనాన్ని గుర్తించి, డిజిటల్ ఫోటోలు తీసి పంపింది అరవింద్ ఆర్య(కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు), సిరిమెల్ల అనుదీప్ (దక్కన్ క్రానికల్ వరంగల్ జిల్లా ఇంఛార్జి)
శాసనాన్ని చదివి పరిష్కరించింది శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్
కాకతీయ శాసనాలను పరిశీలించేటపుడు కాకతీయరాజుల బిరుదాలలో కొన్ని ‘గజకేసరి’తో ముగిసేవి వున్నాయి. బయ్యారం శాసనం కాకతీయరాజుల్లో కేసరితటాకాన్ని తవ్వించిన మొదటి ప్రోలరాజుకు ‘అరిగజకేసరి’ బిరుదు వుందని తెలుపుతున్నది. రుద్రదేవుని సామంతుడు మల్లిరెడ్డి వేయించిన బెక్కల్లు శాసనం రుద్రదేవున్ని ‘దాయగజకేసరి’ అనే బిరుదుతో కీర్తిస్తున్నది. పాకాలశాసనం గణపతిదేవున్ని ‘రాజగజకేసరి’ బిరుదుతో వర్ణించింది.
‘‘ ఏ తన్మాద్యన్మహారాజ గజకేసరి విభ్రమమ్
గణపత్యవనీంద్రస్య’’.. రాజగజకేసరి అన్న బిరుదు గణపతిదేవుని సార్వభౌమత్వాన్ని వ్యక్తం చేస్తుందని పివి పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో వివరించాడు. రుద్రమదేవి సామంతుడు భైరవుడు వేయించిన బీదరు శాసనంలో 3సార్లు ‘రాయగజకేసరి’ బిరుదు పేర్కొనబడ్డది. రెండుసార్లు గణపతిదేవుని పరంగా, ఒకసారి రుద్రమదేవిపరంగా ‘రాయగజకేసరి’ చెప్పబడ్డది. తేరాల సిద్ధేశ్వరాలయ శాసనంలో ప్రతాపరుద్రున్ని కీర్తించే సందర్భంగా ‘దాయగజకేసరి’ అన్న బిరుదు ప్రత్యేకంగా రాయబడ్డది.
కాకతీయ నాణాలను గుర్తించడానికి ఈ రాజబిరుదాలు ఉపయోగపడతాయి. పివి పరబ్రహ్మశాస్త్రి రాసిన మోనోగ్రాఫ్ ‘కాకతీయ కాయిన్స్ అండ్ మెసర్స్’ (1975)లో ఈ వివరాలను చూడవచ్చు.
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గుడి తండా గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకతీయశైలిలో నిర్మించబడ్డ గుడిమంటప స్తంభాలలో ఒకదానిపై బయటపడిన కొత్తశాసనంలో గణపతిదేవుని బిరుదు ‘రాజగజకేసరి’ మరోసారి కనిపించింది.
పాకాలశాసనంలో వున్నట్లే ఈ శాసనంలోని 12,13 పంక్తులలో ‘‘అస్మాద్యన్నహి ‘రాజగజకేసరి’ విభ్రమం గణపత్యవనీంద్ర స్యా’’ అని వుంది.
గుడి తండా గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకతీయశైలిలో నిర్మించబడ్డ గుడి. ఈ గుడి త్రికూట దేవాలయం, కాని రెండు గుళ్ళే కనిపిస్తున్నాయి. మూడవగుడి భాగం తొలగించబడ్డదో, శిథిలాలు ఎక్కడ వున్నాయో తెలియదు. ప్రధానదేవాలయానికి గర్భగుడి, అంతరాలాలున్నాయి.అంతరాళ ద్వారానికిరువైపుల శైవద్వారపాలకులిద్దరు, వారికిరువైపుల చామర గ్రాహులున్నారు. గర్భగుడిద్వారానికిరువైపుల పెద్దకలశాలు చెక్కివున్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా వుంది. అంతరాళంలో వినాయకుని విగ్రహముంది. 3వైపుల విస్తరించి అర్థమంటపం, రంగమంటపాలతో, 16 స్తంభాలతో నిర్మించబడ్డ దేవాలయమిది. పశ్చిమ ముఖ ద్వారముంది.
ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలువబడుతున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో వుంది. మూడు శివలింగాలు వుండాల్సిన చోట ప్రస్తుతం పూజలందు కుంటున్న శివలింగమొకటి, భగ్నమైన లింగమొకటి కనిపిస్తున్నాయి. నాలుగడుగుల విస్తీర్ణం, లింగంతో రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం 3సోపానాలు కలిగివుంది. పూజలందుకుంటున్న శివలింగం యొక్క పానవట్టం 5సోపానాలతో వుంది. దేవాలయప్రాంగణంలో అందమైన, లాలిత్యమైన వీరభద్రుని శిల్పం వుంది. వీరభద్రుడు నాజూకుగా కన్పించడం విశేషం.
గుడిప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టానపీఠంమీద వేంకటేశ్వరుని విగ్రహం వుంది. దేవాలయప్రాంగణంలో రెండు ఆంజనేయుల విగ్రహాలున్నాయి. మంటపంలోని ఒక స్తంభంమీద ఒకవైపు సంస్కృతభాషలో, తెలుగులిపిలో చెక్కిన శాసనం, మరొక పక్క 4పంక్తుల తెలుగుశాసనం వున్నాయి.
ఈ దేవాలయం వెనక తూర్పున ఒక చెరువుంది. ఇక్కడొకప్పుడు కోయలుండేవారట. ఒక కోయకన్య చెరువులో స్నానమాడడానికి దిగి కనిపించకుండా 3 రోజుల తర్వాత వచ్చిందిట. అడిగిన తల్లికి తాను చెరువులో మునగగానే అందులో గుడి, అందులో శివుడు కనిపించాడని, 3 రోజులు తాను దేవుని సాన్నిధ్యంలోనే వున్నానని, దేవుడు పంపిస్తే తిరిగి వచ్చానని ఆ అమ్మాయి చెప్పిందిట.
ఈ శాసనం నర్సాపూర్ పరిధిలోని గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీదున్న శాసనానికి అచ్చంగా నకలులెక్క వుంది. 14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు వున్న 5పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘన్పూరులలోని శాసనాలకు అచ్చుప్రతిలా వున్నాయి.( వరంగల్ జిల్లా శాసనసంపుటి- శాసనాల సంఖ్యలు 78,79,80, 81,82). ఈ వరుసలలో మాచిరాజుపల్లి నివాసి పండితారాధ్య దాసుడు బొందలపాటి సోము శరణార్తి కోరుతున్నట్లు వుంది. ఈ గుడితండాతోపాటు మిగిలిన 5చోట్ల కూడా ఇదే శాసనభాగం వుండడం ఆలోచింపదగ్గదిగా వుంది. ఈ శాసనంలోని మొదటివైపు దేవాలయదైవం రామనాథుని స్తుతి వుంది. ఈ సంస్కృత శ్లోకాలు కొన్నిచోట్ల పాఖాల శాసనాన్ని పోలివున్నాయి. పాఖాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడితండా దేవాలయానికి తూర్పున వున్న చెరువును ‘మౌద్గల్య తీర్థ ’ మంటారని వుంది. 175,176,187,188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన వుంది. అయితే గుడితండా శాసనం రెండవవైపు రామనాథదేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయలిద్దరు అరువణము(పాల గుండిగ, లేదా గిన్నె), దీపాలకు నేయి సేవచేసుకున్నట్లుగా వుంది.
శాసనకాలం గణపతిదేవుని పాలనాకాలమే. . గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘనపూరు శాసనాలలో వున్న విధంగానే ఈ శాసనంలో కూడా సంవత్సర,మాస,దిన వారాలు పేర్కొనబడలేదు. శాసనలిపిలో ‘త’ అక్షరం కొత్తగా కనిపించింది.
శాసనకాలం: కాకతీయ గణపతిదేవ చక్రవర్తి
శాసనస్థలం: గుడితండా, రాజరాజేశ్వర దేవాలయం(రామనాథ దేవర గుడి)
శాసనలిపి: తెలుగు
శాసనభాష: తెలుగు, సంస్కృతం
గుడితండా శాసనం:
మొదటివైపుః
1. స్వస్తి శ్రీరామనాధో గిరిజాసనాథో దేవో ముదేస్తు స
2. దా ప్రసన్నః యస్యోత్తమాంగం ప్రతిపద్యగంగా జాతాజుగ
3. త్యాం పునరుక్త పూతా జయతి సకలభముఖోయః
4. కటితట మదుముదిత నినద దలిగరుదనీలైః పూరయ
5. తి కర్ణ శంఖం స్వభజన నిరతజన కుశల సమృద్ధ్యై భవతు భ
6. వభూత్యై దైత్యవైరి వరాహః సకల జలధిగర్భౌ దుజ్జహానస్య
7. యస్య ధర కుటిల మృణాలి భాసిదంష్ట్రైక దేశీ దిశతి వసుమతీయం
8. లగ్నశైవాల లక్ష్మీం భూయాద్వః క్షణ
9. దాలలవాం జగతి నిర్వశధామ త్రయస్త్రింశత్కోటి తయా
10. సతాం సుమనసా మాయుష్య యే కౌషధం ఆకాశ వ్యప
11. దేశ ధూర్జటి జటాలంకార గంగాపయః కల్లోలై
12. కల కల్పాచ్ఛవ నిభానందాయ చాంద్రీకలా ఏతన్మా
13. ద్య న్మహీరాజ గజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్య
14. శ్రీయోరుగట్యంతిక మాచిరాజు ప
15. ల్లీజని శ్రీగిరి శృంగవాసి శ్రీపండితా
16. రాధ్య గృహస్యదాసో విభూతి గౌర శ
17. రణా గతోవః బొందలపాటి సో
18. ము దాసోహం శరణార్తి
రెండవ వైపుః
1. స్వస్తి శ్రీమతు మోదుకురి రామనాధదేవరకు
2. కాచబోయిండు మల్లెబోయిండు రామనా
3. ధ దేవర లరువణపు కాపులు వీరు ఇద్దరూ
4. పాడికిని దేవర దీపాలకు పోసి నేయి కాచబోయి
5. 0డును, మల్లె బోయిండును
ఈ శాసనాన్ని గుర్తించి, డిజిటల్ ఫోటోలు తీసి పంపింది అరవింద్ ఆర్య(కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు), సిరిమెల్ల అనుదీప్ (దక్కన్ క్రానికల్ వరంగల్ జిల్లా ఇంఛార్జి)
శాసనాన్ని చదివి పరిష్కరించింది శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్





























No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...