అన్మకొండ శాసనం:
ప్రస్తుత పద్మాక్షి గుడి ముందర ప్రాంగణంలో నల్లరాతిమీద నాలుగువైపుల సంస్కృతం, కన్నడభాషల్లో, హళేగన్నడలిపిలో చెక్కిన శాసనస్తంభముంది. ఇదే హన్మకొండ శాసనం.
పద్మాక్షిగుట్ట మీద పద్మాక్షి గుడి ముందర ఒక శాసనముంది. ఈ శాసనం కళ్యాణీ చాళుక్యచక్రవర్తి త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు-6 ఏలుబడిలో మాండలికుడు కాకతిప్రోలరాజు (ప్రోల, ప్రోలరాజు, ప్రోడరాజు, పోలాలరస) అమ్మకుండ(కుండె) రాజధానిగా రాజ్యపాలన చేస్తున్న కాలంలో అతని మంత్రి బేత భార్య మైలమ పద్మాక్షిగుట్ట మీద కట్టించిన ‘కడలాలయ బసది’అనే జైనదేవాలయానికి చాళుక్య విక్రమ శకం 42వ యేట అనగా క్రీ.శ. 1117 డిసెంబర్ 24వ తేదీన పౌష్య సంక్రాంతి రోజున 6మర్తురుల భూమిని దానం చేస్తున్నట్టు వేయబడింది. ఈ గుడికే ఉగ్రవాడి పాలకుడు మేళ(డ)రస కూడా తన స్వాధీనంలో వున్న ఓరుగల్లు కూచికెరె(కూచిచెరువు) కింద 10 మర్తురుల భూమినిచ్చాడు.
బేతప్రధానిః
ఈ శాసనంలో ప్రోలరాజు తండ్రి కాకతిబేతను అతని ప్రెగ్గడ వైజ చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యుడు-6 వద్దకు తీసుకువెళ్ళాడు. అపుడా చక్రవర్తి సబ్బిసాయిర మండలానికి బేతను సామంతుని చేసాడని చెప్పబడింది. వైజ, భార్య యాకమబ్బె(యాకమాంబిక)ల కొడుకు బేతప్రధాని.
సబ్బి మండలం:
క్రీ.శ.970లో పశ్చిమ గాంగరాజు పాంచాలదేవుడు సబ్బి లేదా చబ్బిని పాలిస్తుండేవాడు. కర్ణాటకలోని ధార్వార్ జిల్లా హుబ్లి తాలుకాలో వున్న చబ్బి, చాహ్బ్బి అనే గ్రామం పేరు మీదుగా సబ్బి వచ్చిందని చరిత్రకారుల కథనం.
కడలాలయ బసదిః
పద్మాక్షిగుట్టమీద వున్నది జైనబసది. అది ఎపుడు బ్రాహ్మణాధీనమైందో తెలియదు. ఆ గుడిలో 22వ తీర్థంకరుడు నేమినాథుడు అతని యక్షుడు, యక్షిణులతో వున్నాడు.యక్షుని పేరు సర్వంహా. యక్షిణి కూష్మాండిని లేదా అంబ,అంబిక నేమినాధుని శాసనదేవత. గుడిని స్వాధీనపరచుకున్నవారు ఆమెనే దుర్గ నామావళిలో ఒక పేరని చెప్పుతున్న‘పద్మాక్షి’గా చేసి, పద్మాక్షి దేవాలయంగా పిలుస్తున్నారు. గుడిలో జైన శిల్పాలు మరికొన్ని వున్నాయి. చెక్కడం నిల్చిపోయిన మహావీరుని విగ్రహం, 24 తీర్థంకరులుండే చౌవీసి విగ్రహం, చౌవీసి స్తంభం, జైనపాదాలు వున్నాయి. అంతేకాకుండా తర్వాత కాలంలో చెక్కిన వినాయక, చాముండి శిల్పాలు, చాముండి కింద కూష్మాండిని శిల్పం వుంది. గుడిబయట గుట్ట రాతిబండలపై చెక్కిన మహావీర,పార్శ్వనాథ శిల్పాలు చెక్కివున్నాయి పుస్తకగచ్ఛ శిల్పం కూడా వుంది. రాతిబండలలో రాతిగదుల వంటి దేవాలయాలలో జైనవిగ్రహాలున్నాయి.
కాకతి దేవతః
నిజానికి ఈ కూష్మాండినియే కాకతి. దిగంబర జైనమతావలంబకులు, కాకతి దేవత ఉపాసకులుగా వున్న కాకర్త్యగుండన నుంచి తర్వాత రాజులందరు తమపేర్లతో కాకతీయనామాన్ని చేర్చుకున్నారు. కాకతీయులైనారు. కాకర్త్య అంటే కూష్మాండిని అనే జైన శాసనదేవతే.
వస్తుపాల జైనమంత్రి అంబిక ప్రార్థనలో ‘కూష్మాండిని పద్మాలయ’ అనివుంది. అందువల్లనే మైలమ కడలాలయ బసది అనే పేరుతో ఈ గుడిని నిర్మింప జేసివుంటుంది.
‘ప్రస్తుతం శైవదేవతగా పూజలందుకుంటున్న అనుమకొండ సమీపంలోని గుట్టమీద పద్మాక్షిదేవి నిస్సందేహంగా జైనదేవతే. జైన తీర్థంకరుల బొమ్మల నడుమ ఉన్న దేవీవిగ్రహం శైవదేవత కావడానికి వీల్లేదు. మొదట ఉన్న జైనదేవత విగ్రహం తరువాతి కాకతీయుల శైవమతావలంబనకు అనుగుణంగా శైవదేవత రూపాన్ని సంతరించుకుంది. ముందు చెప్పిన జైనగాథ శైవగాథగా మారిపోయింది ........అన్మకొండ గుట్టమీద జైనదేవతను గరుడబేతరాజు లేదా మొదటి బేతరాజు ప్రతిష్టించి ‘కాకతి’ అని పేరు పెట్టాడని ఊహించడం అసమంజసం కాదు’ అని ‘‘కాకతీయులు’’లో పివి పరబ్రహ్మశాస్త్రి రాసారు.
కూష్మాండిని - మైలమలుః
శ్రావణబెళగొళలోని మల్లేషణ శాసనంలో జైనమతాచార్యుల పేర్ల జాబితా ఇవ్వబడింది. (ఎపిగ్రాఫియా ఇండికా, వ్యాల్యూం 3, పే.200) అందులోని అకలంక అనే జైనసాధువు లేదా ఆచార్యుడు బౌద్ధులను గెలవడానికి బౌద్ధుల దేవత తారను వశపర్చుకుని ఒక కుండలో బంధించాడట. బౌద్ధులను ఓడించడంలో, నిర్మూలించడంలో జైన(శాసన)దేవత కూష్మాండిని వారికి సాయపడాలని తలిచి తారవున్న కుండను ఎడమకాలితో తన్ని, నాశనం చేసిందట. దానితో హిమశీతల రాజు ఆస్థానంలో జైనులతో వాదంలో బౌద్ధులు ఓడిపోయారట. అటువంటి మహాత్మ్యం కల జైన శాసనదేవత కూష్మాండిని దేవతతో మైలమను పోల్చడం ఈ శాసనంలో కనిపిస్తుంది. మైలమను గూర్చిన వర్ణన వుందీ శాసనంలో. ఆమె దేవతాసౌందర్యం కలిగివుందట.
ఆధార సూచికలుః
1. Epigraphiya Indica,No.35.p.256, ANMAKONDA INSCRIPTION OF PROLA; BY H. KRISHNA SASTRY,B.A.
2. Mallishe'na epitaph (Epigraphiya Indica, Vol.III. p. 200)
3. Epigraphiya Carnatica, Vol.II. p.46
4. కాకతీయులు- పివి పరబ్రహ్మశాస్త్రి(డిసెంబర్,2012),పే.247




No comments:
Post a Comment