Saturday, April 24, 2021

 రాజేశ్వరపురం శాసనం:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామం రాజేశ్వరపురం. ఇక్కడ వీరగోపాలస్వామి దేవాలయంలో నిలబెట్టివున్న 15 అడుగుల ఎత్తు, 3అడుగుల వెడల్పు 6అంగుళాల మందమున్న రాతిబండ(పలక,సలప)మీద రెండువైపులా శాసనం చెక్కివుంది. ఈ శాసనంలో 12మంది వ్యక్తుల పేర్లు పేర్కొనబడ్డాయి. వీరిలో మొదటిపేరు కోటకేతన. కోట వంశస్తులు కాకతీయుల సామంతులే కాదు వారి బంధువులు కూడా. వీరి రాజధాని ధరణికోట. పట్టణం పేరే వారి ఇంటిపేరయింది. వీరికి పరబలసాధక, ప్రతాప లంకేశ్వర, కళిగళ మొగడకై, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ వంటి బిరుదులున్నాయని వేల్పూరులోని రామలింగేశ్వరాలయంలోని శాసనంలో పేర్కొనబడ్డాయి. కృష్ణానదికి దక్షిణాన వున్న 6వేల గ్రామాలకు ప్రభువులని(షట్సహస్రావని వల్లభ) పేరుపొందారని పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో రాయబడివుంది. వీరిలో బయ్యల మహాదేవి (బయ్యాంబ) కాకతీయ గణపతిదేవుని చెల్లెలు మైలాంబ, భర్త నతవాడి రుద్రుని కుమార్తె. కోటవంశంలో ముగ్గురు కేతనలు, 4గురు భీములు వున్నారు. 1250లో యనమదలలో గణపాంబ వేయించిన శాసనంలో పేర్కొనబడిన మొదటి, రెండవ కేతనలు, మొదటి, రెండవ భీములే రాజేశ్వరపురం శాసనంలో పేర్కొనబడిన కేతన, భీములు అవుతారు. కేతనలకు మారుపేర్లు వుంటే వారు కేశవ, మాధవ భూపతులవుతారు. కోట వంశం వారికున్న బిరుదులలో పర(బల)సాధక, (గండ)భేరుండ కేతనలుండడం ఆధారంగా ఈ శాసనం కోట వారిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజేశ్వరపురం గ్రామాన్ని కోట కేతన నిర్మించివుంటాడు. గ్రామంలో శివాలయం, గోఫాలస్వామి దేవాలయాలకు దక్షిణంగా పురాతన కాలంనాటి రాతికోట ఒకటి శిథిలమై వుంది.
రాజేశ్వరపుర శాసనంలో విష్ణుమూర్తి నాభిపద్మం నుంచి పుట్టిన బ్రహ్మపాదాల నుంచి పుట్టిన కోట కేతన వంశీకులు నిర్మించిన రాజేశ్వరపురం గ్రామంలోని వీరగోపాలస్వామి(మీసాల గోపాలస్వామి) దేవాలయానికి చేసిన భూదానాన్ని వివరిస్తున్నది ఈ శాసనం. కోట వంశంలో పుట్టిన కేతన, భీముడు, కేశవ భూపతి, బయ్యమాంబ పుత్రుడు మాధవ భూపతి. భేరుండ కేతన అతని భృత్యుడు కామిరెడ్డి, వెర్రమ, కాట్రెడ్డి మాచిరెడ్డి, ధీరుడు గోపాలవర్ధనుడు, ప్రోలాంబిక పుత్రుడు మందడి ప్రోలుడు కల్పవృక్షము లక్ష్మితో పాటు పుట్టినట్లుగా, సోమాంబతో కలిసి పుట్టాడని వివరిస్తున్నది శాసనం.
ఈ శాసనం శకాబ్దాలు రూప,బాణ,క్షితి,శశి మాధవ శుక్లపక్ష కావ్యవారం దశమి నాడు ద్విజవరులచేత ప్రతిష్ట చేయబడింది.
శకసం. రూప=1,బాణ=5,క్షితి=1, శిశి=1 వామాంకగతిలో చదివితే శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించబడింది. అనగా క్రీ.శ. 1229 మే 4న.
వీరగోపాలస్వామి దేవునికి అంగ, రంగ, భోగాలకు, బ్రాహ్మణులకు ధారవోయించి యిచ్చిన వ్రిత్తులు (శాశ్వతముగా అనుభవించు దానాలు)గా కట్టంగూరి చెరువు పడుమట, తాటితోట తూర్పున 8, తూర్పు తాటితోట వద్ద 4, (నేల)కొండపల్లి చెరువు ఉత్తరాన 1, తోటన 1, ముకిందపాయ చెరువుతూర్పు మామిడితోటన 4, పడుమట 1, సూరాదేవిపల్లి పొలాన4, బొల్లికుంట తూర్పున 5, ఇప్పల ఎరగుంట ఉత్తరాన 16, నల్లచెరువు ఉత్తరాన 10, దొంతు చెరువు ముందట నీరునేల(తరిభూమి), రాజనపు కాలువ రాటనపు నూతి తూర్పున ప.(ప అంటే పట్టు అని అర్థం. పట్టు అనేది పుట్టికి వాడినదై వుండొచ్చు. పుట్టి పండే భూమిని ఖండుక అని కూడా అంటారు.) , గండకాలువను ప, దంతుల చెరువు మేడికొమ్మున ప, జుమలూరి గణయ మోగడ్ల చెరువు వెనక కాలువ పడుమట ప దానముగా ఇవ్వబడినవని శాసనం వివరిస్తున్నది.
రాటనపు నూయిః రాజేశ్వరపురం గోపాలస్వామి గుడికి వాయవ్యదిశలో మంచినీటి బావి వుంది. దానిపక్కన 20 అడుగుల ఎత్తున్న ఒక రాతిపలకస్తంభం వుంది. దానిపైన గాడి వుంది.గాడికి రెండువైపుల లోపలి అంచులలో రంధ్రాలున్నాయి. ఇవి గిలక లేక కదురువంటిది అమర్చడానికి అవసరమైనవి. దీనిమీద పొడుగాటి కర్రకు ఒకవైపు బొక్కెన మరోవైపున మనిషి నిలబడి,కర్రను తొక్కుతూ నీళ్ళు తోడేవాడు. దీనిని రాటనంబాయి అంటారు. ఇది గుడిబాయి. దానిలోని నీరు వ్యవసాయం సాగుకు వాడుకున్న ప్రజలు రాటనం పన్ను కడుతుండేవారు. దీనిమీద ‘నీరడి’ అని రాసివుంది. నీరడి అంటే నీటికట్టుబాటు, ఏర్పాటు, నిర్వహణలు.
ఈ శాసనం కోటనాయకుల గురించి తెలియజేసే శాసనాలలో కొత్తగా చేర్చతగినది.శాసనలిపి కూడా కాకతీయశాసనాలలోని లిపిని పోలినప్పటికి కొన్ని అక్షరాల లేఖనము శాసనలేఖకుని కారణంగా భిన్నరూపంలో అగుపించాయి. శాసనానికి వాడిన రాయికూడా స్తంభరూపంలో లేదు.ఫలకం వలె వుంది.
రాజ్యం: కాకతీయ
రాజు: గణపతిదేవ మహారాజు సామంతులు కోట వంశం వారు
రాజవంశం: కోట
కాలం: శక సం.1151, మాధవ(మాస) అంటే వైశాఖమాసం శుక్లపక్షం కావ్య(శుక్ర)వారం, దశమినాడు ఈ శాసనం వేయించబడింది. అనగా క్రీ.శ. 1229 మే 4.
శాసనభాష: తెలుగు, సంస్కృతము
శాసనలిపి: తెలుగు ( 13వ శతాబ్దపు తెలుగు)
శాసనపంక్తులు: 52
రాజేశ్వరపురం శాసనపాఠం:
తూర్పు వైపు:
1. శ్రీనాథనాభికంజత్సంజాత బ్ర
2. హ్మాంఘ్రిజాత్కులాతుకోటకేత..
3. ....పో విప్రసాత్కుత గ్రామస.. (సాత్థ్రుత)
4. ప్రతి...తస్మాచ్ఛ భూనృపో భిమ
5. స్తస్మాత్కేశవభూపతిః అమ
6. రేశ పందాంభోజారాధకః పరసా
7. ధకః తత భూద్బయ్యమాం
8. బాయాంపుత్ర్యం మాధవ
9. భూపతిః భేరుండ కేతన స్సత్య
10. వాదింన్మగణవాధిపః తద్భృ
11. త్యః కామిరెడ్డి తద్వావెఱ్ఱమ
12. దొరపో కాట్రెడ్డిమ్మాచిరెడ్డి
13. శ్చ ధీరో గోపాలవర్ధనః ప్రోలా
14. 0బికా పయోవిచ్యుం మంద
15. డి ప్రోలమందరాత్యే సహనృప (సో)
16. మాంబయాజాతా కల్పవృక్ష
17. ఇవశ్రియా శాకాబ్దరూప బా
18. ణ క్షితి శశిగణితే మాధవ శుక్ల
19. పక్ష కావ్యవారే దశమ్యాం ద్విజ
20. వర సహితాస్త ప్రతిష్టామ
21. కుమకుర్వనే ప్రాసాదం భా
22. నురమ్యం మునిసుర మ
23. నుజారొదరాదర్చితా ప్రెగ్గో
24. పిబఃక్కొక్కథాణిస్తితి రుచితమా
25. తే గ్గొపవేషసృ విష్ణోః రాజు
26. లు వేటింది ఇరుగారు దాప
27. దియ కడప దేవరనగ
28. రి ఇశాన్యననం బారి నివేశ
29. నము
పడమటివైపుః
1. వీరగోపాలదేవరకు అంగరంగ
2. భోగాలకు బ్రాహ్మలకుం గాలోచితము
3. లు హవిన్ ధారవోయించిన వ్రిత్తు
4. లు కట్టంగూరి చెరువు పడుమట తా
5. డి తొంటన (8)దాని తూర్పున తాడితొ
6. 0టన 4 కొండపల్లిచెరువు ఉత్తరా
7. న1కి దాని ఉత్తరాన తొంటన1
8. ముకిందపాయ చెరువు తూర్పున మా
9. విండితొంటన4, ఆ తెర్వు పడుమట
10. న1 ఆ తెరువు పడుమట సూరా
11. దేవిపల్లి పొలానన 4 దేవరబండ
12. ఉత్తరాన 8 బొల్లిగుంటి తిపున 5
13. ఇప్పల ఎఱంగుంట ఉత్తరానన16
14. నల్లంజెరువు ఉత్తరానన10...దొ
15. 0తుచెరువు ముందటన
16. నీరునేల రాజనపుం గాలువ
17. రాటనపు నూంతి తూర్పున
18. ప=జగయేచ గండకాలు
19. వను ప దంతుల చెరువు
20. మేడికొంమున ప= జుమ
21. లూరి గణయ మోగడ్లచెర్వు
22. వెనక ఎత్తుంగాలువ పడు
23. మట పెట్టింది ప
ఈ శాసనం జాడ తెలిపింది: వేముగంటి మురళీకృష్ణ
డిజిటల్ ఫోటోలు : కట్టా శ్రీనివాసు,
శాసనం ఎస్టాంపేజ్ : చంటి, సహకారం : రాగి మురళి
శాసనం చదివి, ఎడిట్ చేసింది: శ్రీరామోజు హరగోపాల్,





 ఇటీవల మా బృందం చేసిన కొత్తయాత్రః సాక్షి దిన పత్రికలో

గాలిపెల్లి, నరసక్కపేటల్లో శాతవాహనకాలపు చారిత్రకాధారాలు, కాకతీయులనాటి దేవాలయం.
సిరిసిల్లా రాజన్న జిల్లా, ఇల్లెంతకుంట మండలంలోని గాలిపెల్లి ఊరికి పడమట బిక్కవాగు వుంది. బిక్కులు అంటే (బౌద్ధ) భిక్షుకులు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు పక్కన పారే ఆలేటివాగుకు భిక్కేరు అనే పేరుంది. పేరుకు తగ్గట్టే ఈ వాగు వెంట బౌద్ధారామాలు, స్తూపాలు వున్న బౌద్దక్షేత్రాల జాడలు దొరికాయి. దొరుకుతున్నాయి. గాలిపెల్లి బిక్కవాగు వెంట కూడా పెద్ద ఇటుకల దిబ్బలున్నాయని తెలుస్తున్నది. పరిశోధిస్తే ఇక్కడ కూడా బౌద్ధం జాడలు దొరుకుతాయన్న ఆశ కలుగుతున్నది.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందంలోని వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, సహాయకుడు చంటి ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించినపుడు కొత్త చారిత్రక విశేషాలు బయటపడ్డాయి.
బిక్కవాగుకు ఆవలి ఒడ్డున గట్టుమీద ఒక దేవాలయద్వారమొక్కటే మిగిలివున్న గోడలు శిథిల దేవాలయం ఆనవాలుగా కనిపిస్తున్నవి. అద్భుతమైన కాకతీయ శిల్పాలంకరణతో వున్న ఈ దేవాలయద్వారానికి రెండువైపుల ద్వారపాలకులుగా కేశవమూర్తులున్నారు. ఒక్కొక్క ద్వారపాలకునికి రెండువైపుల 2రు చామరగ్రాహిణులు,2రు పరిచారికలున్నారు. ద్వారపు ఉత్తరాశి మీద లలాటబింబంగా గజలక్ష్మి శిల్పం వుంది. ఈ గుడిని చెన్నకేశవుని గుడిగానే స్థానికులు పిలుస్తున్నారు. లోపల ఎటువంటి విగ్రహాల ఆనవాళ్ళు లేవు. గుడిలోని మూలమూర్తి ఏమైనాడో.
చెన్నకేశవుని గుడి ముందర వున్న పొలంలో కుండపెంకులు చాలా దొరుకుతున్నాయి. అక్కడ పూర్వం ఊరుండేదని ఆ పొలం రైతు బాల్ రెడ్డి అన్నాడు. పాటిగడ్డ నుంచే రోడ్డు పోతున్నది. రోడ్డుకట్టుపక్కన వున్న పాటిగడ్డలో ఆ రైతుకు టెర్రకోట మట్టిపూసలు తేలికైన, పెద్ద ఇటుకలు, కుండపెంకులు దొరికినాయన్నాడు. ఆ ఇటుకలను పరిశీలిస్తే అవి శాతవాహనుల కాలంనాటివని తెలుస్తున్నది. అక్కడ రెండు ఇటుకలలో ఒకటి ఎర్రనిది.తేలికైనది.ఇటుక అంతటా రంధ్రాలుండడం వల్ల బరువు తగ్గింది. రెండవ ఇటుక మొదట ఇటుకను పోలివున్నప్పటికి బరువుంది. దొరికిన వాటిలో మట్టిపెంకుతో చేసిన ‘చిత్తుడుబిల్ల’ బిచ్చపెంకు వుంది. మరొకటి పల్చని రాతితో వుండడం విశేషం.పెంకుముక్కలలో నలుపు,ఎరుపు కుండల, కాగుల ముక్కలున్నాయి. ఒక కుండపెంకు మీద కొడవలివంటి డిజైను, దానికింద వలయాల డిజైనులున్నాయి. ఇవన్నీ శాతవాహనకాలంనాటి కుండల డిజైన్లతో, తయారీతో పోలివున్నాయి.
ఈ ప్రాంతాన్ని నరసక్కపేట అంటారు. ఇక్కడ దొరికిన మట్టిపూసలు, ఇటుకలు, కుండపెంకులు, చిత్తుడుబిల్లలు ఇవన్నీ ఈ పాటిగడ్డ శాతవాహనకాలంనాటిదని నిరూపిస్తున్నాయి. ఇక్కడి పరిసరాల్లో పరిశోధన జరిపితే శాతవాహనకాలంనాటి చారిత్రకాధారాలు విస్తారంగా లభించే అవకాశం ఎక్కువగావుంది.

 మీనాంబరం- పరుసవేదీశ్వరాలయం-చాముండదేవతః

మీనాంబరంలోని పరుసవేదీశ్వరాలయం త్రేతాయుగంనాటిదని చెప్పకుంటారు ప్రజలు. గంగాపురం కైపీయతు ప్రకారం షట్చక్రవర్తులలో ఒకడైన నలమహారాజు అతని అరణ్యవాసకాలంలో ఈ ప్రాంతానికి వచ్చాడట. అతని ఆకలిని తీర్చడానికి గ్రామస్తులు కాల్చిన చేపలనిచ్చారట. ఆయన నది ఒడ్డున కూర్చుని చేపలు తింటుంటే కొన్ని చెయిజారి నదినీళ్ళలో పడ్డాయట. అవి వెంటనే బతికాయట. దాంతో ఈ ప్రదేశాన్ని మహిమగలదిగా జనాలు నమ్మసాగారు. వీరకంబాల అనే ఒక భక్తుడు ఇక్కడొక పెద్దగుడిని కట్టించి తమ ఇలవేలుపు చెన్నకేశవునికి అంకితం చేసాడట. ఈ గుడి మహిమలను విన్న శివుడే స్వయంగా విచ్చేసి గుడిలోని దేవుణ్ణి అర్చించాడట. అతని కంటికి నది ఒడ్డున వున్న చేపకన్యలు లింగి-తంగి లిద్దరు కనిపించారట.వారి అందాలకు కన్ను చెదిరిన శివుడు మనసాపుకోలేక వారి దగ్గరకు చేరాడట. తానా నది ఒడ్డుననే పరుసవేదీశ్వరుడనే పేరుతో వెలుస్తానని వారితో అన్నాడట. ఆ కన్యల ఇత్తడిబిందెలను లింగానికి తాకిస్తే బంగారిబిందెలవుతాయని వరమిచ్చాడట. అప్పటినుంచి శివుడు మీనాంబరం నది ఒడ్డున పరుసవేదీశ్వరునిగా ఆరాధింప బడుతున్నాడు. ఈ దేవాలయం గొప్పశైవక్షేత్రంగా పేరు పొందింది. ఔరంగజేబు కోపంతో ఈగుడిని నేలకూల్చాడని చెప్పుకుంటారిక్కడి ప్రజలు.
మీనాంబరం మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లకు దగ్గరగా వున్న గ్రామం. డిండి అని పిలువబడే దుందుబినదిలో కలిసే నది మీనాంబరం నది. ఒక్కొక్కచోట ఒక్కోపేరుతో పిలువబడే ఈ నదికి మీనాంబరంలో ‘దేవసేన’ అనే పేరున్నది. దేవసేన నదీతీరంలో నిర్మించబడ్డ దేవాలయం ప్రస్తుత పరుసవేదీశ్వరాలయం. నిజానికిది జైన మహావీరుని గుడి అనడానికి గుడికి ఉత్తరపుగోడకు ఆనించిపెట్టిన తలలేని వర్థమానమహావీరుని తీర్థంకర శిల్పం వుంది.అంతేగాక అక్కడికి దగ్గరలోని అల్వాన్ పల్లిలోని గొల్లత్తగుడులకు వాడినటువంటి మూరెడు పొడుగున్న మట్టిఇటుకలు ఇక్కడ గుడిప్రహారిగోడల్లో కనిపిస్తున్నాయి.విడిగా పడివున్నాయి కొన్ని.గుడి పశ్చిమాభిముఖంగా వుంది. ఎత్తైన జగతిమీద నిర్మించబడ్డ ఈ గుడికి ముందర జైనమహావీరుని అధిష్టానపీఠంపై చెక్కివుండే సింహాలు గుడి బయట కనిపిస్తున్నాయి. సాధారణంగా హిందూదేవాలయాల్లో దేవీదేవాలయాల్లో సింహాలు కనిపిస్తాయి.ఇక్కడ దేవి శిల్పాలు లేవు. ప్రస్తుతం గర్భగుడిలో రెండుమీటర్ల కొలతతో చతురస్రాకారపు పానపట్టంమీద ఒక అడుగు కైవారం, అడుగున్నర ఎత్తైన శివలింగం వుంది. గుడికెదురుగా ధ్వజస్తంభం వద్ద కట్టిన గూటిలో సాధారణంగా సప్తమాతృకలతో కనిపించే బ్రాహ్మి,మహేశ్వరి,వైష్ణవీ మూర్తులు మూడు ఒకే రాతిఫలకంపై చెక్కి కనిపిస్తున్నాయి. ఆ గూటిలో ఒకవైపు నాగులజంట శిల్పం వుంది.అయితే ఈ నాగుల శిల్పంలో జైనప్రతిమాలక్షణాలలో ఒకటైన ఛత్రం వుండటం విశేషం.మరొక నాగశిల్పం మరింత ప్రాచీనం.
గుడిచుట్టు ప్రదకిణాపథం వుంది.వరండాగా మంటపనిర్మాణం వుంది. చుట్టువున్న ప్రహరి 4అడుగుల మందంతో వుంది.ఈ గోడ శైలి సిద్దిపేటలోని బోగేశ్వరాలంయంతో పోలికలు కలిగివుంది.తూర్పున చిన్నద్వారం వుంది. గర్భగుడి ముందరి మంటపంలో రెండునాగశిల్పాలతో పాటు ఒకటి ప్రాచీనమైన వినాయకుని పెద్దవిగ్రహం, కొంచెం తర్వాతికాలానిదైన చిన్న వినాయకునివిగ్రహాలున్నాయి.రెండింటి ప్రత్యేకత వినాయకుల తొండాలు కుడివైపుకు తిరిగి వుండడం. చిన్న వినాయకుడు చతుర్భుజుడైన లక్ష్మీగణపతి. పెద్దవినాయకుడు ద్విభుజుడు జైన ప్రతిమాలక్షణాలు కలిగివున్నాడు. మరొకవైపున సర్వతోభద్ర స్తంభం వుంది.శ్రీచక్రంగా పిలుస్తున్నారు.
గుడిమెట్లలో కలిపికట్టిన శాసనస్తంభమొకటి రెండు ముక్కలుగా కనిపిస్తున్నది. మీనాంబరం శాసనమొకటి మహబూబ్ నగర్ జిల్లా శాసనసంపుటి-1లో అచ్చయివుంది.అది ఇది ఒకటే అయివుండవచ్చు. ఈ శాసనంలో
‘‘ స్వస్తి శ్రీమత్కన్నర రాజ్జ్యదొళ్కాళ ముఖసమయం బెళగుసిద
సిరిజయామిరగస్త్య గురవర్భువనియోళ్విర ప్రతినూరనోందుది
వసం వాసుందియ చెల్లధమన్(ది)మాడి నిబ్బరెమూఱు గుళిగె...
(ది)న్దపూ(ళ్ధా)ది(మ)న్ధిర(కు)ళిదు అయ్యా(గం) సలిసిదిదెప
నృపవల్లభ....వారణాసియ విఱుదవాప వాగుం.’’........... ....................అని రాయబడివుంది.రాష్ట్రకూటరాజు
కృష్ణ-3(క్రీ.శ.939-967)గా భావిస్తున్న ‘కన్నర’ రాజ్యపాలన పేర్కొనబడింది. కాలాముఖశైవగురువు అగస్త్యుడు ప్రస్తావించబడ్డాడు.
రాష్ట్రకూటరాజులు జైనమతావలంబకులు. గొల్లత్తగుడి వీరికాలంలోనే నిర్మాణమైంది. ఆ గుడి దక్షిణంవైపు గోడపైన ఇటుకలపై డంగుసున్నం పూసిచేసిన హంసలవ్యాళి రాష్ట్రకూటులశైలికి చెందినదే. ఆ రాష్ట్రకూటరాజుల చివరిదశలో (973కు ముందు)రాజ్యసంక్షోభం ఏర్పడింది.ఆ కాలంలో రాజ్యసంరక్షణలేని జైనం, బౌద్ధమతానుయాయుల మీద కాలాముఖశైవులు దాడులు చేసినట్టు తెలుస్తున్నది. వారి ఆరామ,విహారాలు, దేవాలయాలెన్నో శైవక్షేత్రాలుగా మార్చివేయబడ్డాయి. కొలనుపాక నుండి మీనాంబరం దాకా ఇటువంటివెన్నో గుడులు కన్పడుతాయి.
మీనాంబరంలోని జైనదేవాలయం కూడా పరుసవేదీశ్వరాలయంగా పరివర్తనకు గురైనది.ఈ గుడి విమానం ఫంసానశైలిలోవుంది. ఇదికూడా జైనదేవాలయాల శిఖరపద్ధతి.ఇటుకలు,నాగవిగ్రహాలు,వినాయకుడు,మహావీరుని శిథిలశిల్పం ఇవన్నీ ఇక్కడిదేవాలయం జైనమతానిదేనని చెప్పడానికి సాక్ష్యాధారాలు.కాలాముఖుల గురువు అగస్త్యుని పేరు ప్రస్తావన మందిరంతో కలిపిచెప్పడం కూడా ఒక రుజువని చెప్పాలి.
ప్రస్తుతం ఈ దేవాలయాన్ని గ్రామస్తులే పూనుకుని పునరుద్ధరణ చేస్తున్నారు.ప్రభుత్వం కూడా పట్టించుకుంటే ఒక చారిత్రకసంపద సంపన్నంగా నిలిచివుంటుందని గ్రామస్తుల కోరిక.
పరుసవేదీశ్వరాలయం గుడికెదురుగా వున్న మీనాంబరం నదిమధ్యలో ఒక అమ్మదేవత శిల్పంవుంది.నల్లరాతిలో చెక్కబడిన ఈ శిల్పం జటామకుటంతో,మకుటంలో శిరస్సు ముద్రతో, నాలుగుచేతులతో,ముందరి కుడిచేతిలో ఖడ్గం,వెనక కుడిచేతిలో సర్పం,ముందరి ఎడమచేతిలో రక్తపాత్ర,వెనక ఎడమచేతిలో ఖట్వాంగం, కపాలాలదండే జందెంగా, అర్థనగ్నంగా లలితాసనంలో కూర్చునివున్న ఈ దేవత ప్రేతాసన.శిల్పశైలి రాష్ట్రకూటులకాలానిది. ప్రతిమాలక్షణాలను బట్టి ఈ దేవత సప్తమాతృకలలో సౌమ్యరూపంలో కనిపించే చాముండకు పూర్వరూపం. ఆలంపూర్ లోని జోగులాంబ(యోగాంబిక), వరంగల్ మ్యూజియంలోని చాముండ విగ్రహాలతో పోలికలున్నప్పటికి ఈ శిల్పం ప్రత్యేకలక్షణాలు కలిగివుంది. ఒకవిధంగా చూస్తే ఈ శిల్పం బౌద్ధంలోని ఉగ్రతార, ఏకజటిలతో పోలివుందని చెప్పొచ్చు. ఇక్కడెక్కడ బౌద్ధం ఆనవాళ్ళు దరిదాపుల్లో లేకపోవడం వల్ల ఈశిల్పం బౌద్ధమనడానికి ఆధారాలు వెతకాల్సివుంది. ఈ విగ్రహం నది ఒడ్డున పరుసవేదీశ్వరాలయానికి ఉత్తరంగా పడివున్న దేవాలయశిథిలాల నడుమ ఇసుకలోతుల్లో దొరికింది.ఈ శిల్పాన్ని నదినడుమ వుంచి ఎందుకు పెట్టారో తెలియదు కారణం. నదిపొంగి కూల్చేసిన గుడిలోనిదే ఈ విగ్రహం.గుడి స్తంభాలపై వున్న శిల్పాలనుబట్టి గుడి రాష్ట్రకూటులనాటిదని చెప్పవచ్చు. నదిలో ఇసుకకొట్టుకపోగా బయటపడ్డ చాలాపొడవైన చెట్లకాండాలు రాళ్ళలాగా మారిపోతున్నాయి.ఇవి కూడా 1300సం.ల నాటివనే అనిపిస్తున్నది. కాలనిర్ణయం చేస్తే తెలిసిపోతుంది.
పరిశోధనః ---శ్రీరామోజు హరగోపాల్,
వేముగంటి మురళీకృష్ణ, మేఘరాజు, చంటి

















చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...