Saturday, April 24, 2021

 మీనాంబరం- పరుసవేదీశ్వరాలయం-చాముండదేవతః

మీనాంబరంలోని పరుసవేదీశ్వరాలయం త్రేతాయుగంనాటిదని చెప్పకుంటారు ప్రజలు. గంగాపురం కైపీయతు ప్రకారం షట్చక్రవర్తులలో ఒకడైన నలమహారాజు అతని అరణ్యవాసకాలంలో ఈ ప్రాంతానికి వచ్చాడట. అతని ఆకలిని తీర్చడానికి గ్రామస్తులు కాల్చిన చేపలనిచ్చారట. ఆయన నది ఒడ్డున కూర్చుని చేపలు తింటుంటే కొన్ని చెయిజారి నదినీళ్ళలో పడ్డాయట. అవి వెంటనే బతికాయట. దాంతో ఈ ప్రదేశాన్ని మహిమగలదిగా జనాలు నమ్మసాగారు. వీరకంబాల అనే ఒక భక్తుడు ఇక్కడొక పెద్దగుడిని కట్టించి తమ ఇలవేలుపు చెన్నకేశవునికి అంకితం చేసాడట. ఈ గుడి మహిమలను విన్న శివుడే స్వయంగా విచ్చేసి గుడిలోని దేవుణ్ణి అర్చించాడట. అతని కంటికి నది ఒడ్డున వున్న చేపకన్యలు లింగి-తంగి లిద్దరు కనిపించారట.వారి అందాలకు కన్ను చెదిరిన శివుడు మనసాపుకోలేక వారి దగ్గరకు చేరాడట. తానా నది ఒడ్డుననే పరుసవేదీశ్వరుడనే పేరుతో వెలుస్తానని వారితో అన్నాడట. ఆ కన్యల ఇత్తడిబిందెలను లింగానికి తాకిస్తే బంగారిబిందెలవుతాయని వరమిచ్చాడట. అప్పటినుంచి శివుడు మీనాంబరం నది ఒడ్డున పరుసవేదీశ్వరునిగా ఆరాధింప బడుతున్నాడు. ఈ దేవాలయం గొప్పశైవక్షేత్రంగా పేరు పొందింది. ఔరంగజేబు కోపంతో ఈగుడిని నేలకూల్చాడని చెప్పుకుంటారిక్కడి ప్రజలు.
మీనాంబరం మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లకు దగ్గరగా వున్న గ్రామం. డిండి అని పిలువబడే దుందుబినదిలో కలిసే నది మీనాంబరం నది. ఒక్కొక్కచోట ఒక్కోపేరుతో పిలువబడే ఈ నదికి మీనాంబరంలో ‘దేవసేన’ అనే పేరున్నది. దేవసేన నదీతీరంలో నిర్మించబడ్డ దేవాలయం ప్రస్తుత పరుసవేదీశ్వరాలయం. నిజానికిది జైన మహావీరుని గుడి అనడానికి గుడికి ఉత్తరపుగోడకు ఆనించిపెట్టిన తలలేని వర్థమానమహావీరుని తీర్థంకర శిల్పం వుంది.అంతేగాక అక్కడికి దగ్గరలోని అల్వాన్ పల్లిలోని గొల్లత్తగుడులకు వాడినటువంటి మూరెడు పొడుగున్న మట్టిఇటుకలు ఇక్కడ గుడిప్రహారిగోడల్లో కనిపిస్తున్నాయి.విడిగా పడివున్నాయి కొన్ని.గుడి పశ్చిమాభిముఖంగా వుంది. ఎత్తైన జగతిమీద నిర్మించబడ్డ ఈ గుడికి ముందర జైనమహావీరుని అధిష్టానపీఠంపై చెక్కివుండే సింహాలు గుడి బయట కనిపిస్తున్నాయి. సాధారణంగా హిందూదేవాలయాల్లో దేవీదేవాలయాల్లో సింహాలు కనిపిస్తాయి.ఇక్కడ దేవి శిల్పాలు లేవు. ప్రస్తుతం గర్భగుడిలో రెండుమీటర్ల కొలతతో చతురస్రాకారపు పానపట్టంమీద ఒక అడుగు కైవారం, అడుగున్నర ఎత్తైన శివలింగం వుంది. గుడికెదురుగా ధ్వజస్తంభం వద్ద కట్టిన గూటిలో సాధారణంగా సప్తమాతృకలతో కనిపించే బ్రాహ్మి,మహేశ్వరి,వైష్ణవీ మూర్తులు మూడు ఒకే రాతిఫలకంపై చెక్కి కనిపిస్తున్నాయి. ఆ గూటిలో ఒకవైపు నాగులజంట శిల్పం వుంది.అయితే ఈ నాగుల శిల్పంలో జైనప్రతిమాలక్షణాలలో ఒకటైన ఛత్రం వుండటం విశేషం.మరొక నాగశిల్పం మరింత ప్రాచీనం.
గుడిచుట్టు ప్రదకిణాపథం వుంది.వరండాగా మంటపనిర్మాణం వుంది. చుట్టువున్న ప్రహరి 4అడుగుల మందంతో వుంది.ఈ గోడ శైలి సిద్దిపేటలోని బోగేశ్వరాలంయంతో పోలికలు కలిగివుంది.తూర్పున చిన్నద్వారం వుంది. గర్భగుడి ముందరి మంటపంలో రెండునాగశిల్పాలతో పాటు ఒకటి ప్రాచీనమైన వినాయకుని పెద్దవిగ్రహం, కొంచెం తర్వాతికాలానిదైన చిన్న వినాయకునివిగ్రహాలున్నాయి.రెండింటి ప్రత్యేకత వినాయకుల తొండాలు కుడివైపుకు తిరిగి వుండడం. చిన్న వినాయకుడు చతుర్భుజుడైన లక్ష్మీగణపతి. పెద్దవినాయకుడు ద్విభుజుడు జైన ప్రతిమాలక్షణాలు కలిగివున్నాడు. మరొకవైపున సర్వతోభద్ర స్తంభం వుంది.శ్రీచక్రంగా పిలుస్తున్నారు.
గుడిమెట్లలో కలిపికట్టిన శాసనస్తంభమొకటి రెండు ముక్కలుగా కనిపిస్తున్నది. మీనాంబరం శాసనమొకటి మహబూబ్ నగర్ జిల్లా శాసనసంపుటి-1లో అచ్చయివుంది.అది ఇది ఒకటే అయివుండవచ్చు. ఈ శాసనంలో
‘‘ స్వస్తి శ్రీమత్కన్నర రాజ్జ్యదొళ్కాళ ముఖసమయం బెళగుసిద
సిరిజయామిరగస్త్య గురవర్భువనియోళ్విర ప్రతినూరనోందుది
వసం వాసుందియ చెల్లధమన్(ది)మాడి నిబ్బరెమూఱు గుళిగె...
(ది)న్దపూ(ళ్ధా)ది(మ)న్ధిర(కు)ళిదు అయ్యా(గం) సలిసిదిదెప
నృపవల్లభ....వారణాసియ విఱుదవాప వాగుం.’’........... ....................అని రాయబడివుంది.రాష్ట్రకూటరాజు
కృష్ణ-3(క్రీ.శ.939-967)గా భావిస్తున్న ‘కన్నర’ రాజ్యపాలన పేర్కొనబడింది. కాలాముఖశైవగురువు అగస్త్యుడు ప్రస్తావించబడ్డాడు.
రాష్ట్రకూటరాజులు జైనమతావలంబకులు. గొల్లత్తగుడి వీరికాలంలోనే నిర్మాణమైంది. ఆ గుడి దక్షిణంవైపు గోడపైన ఇటుకలపై డంగుసున్నం పూసిచేసిన హంసలవ్యాళి రాష్ట్రకూటులశైలికి చెందినదే. ఆ రాష్ట్రకూటరాజుల చివరిదశలో (973కు ముందు)రాజ్యసంక్షోభం ఏర్పడింది.ఆ కాలంలో రాజ్యసంరక్షణలేని జైనం, బౌద్ధమతానుయాయుల మీద కాలాముఖశైవులు దాడులు చేసినట్టు తెలుస్తున్నది. వారి ఆరామ,విహారాలు, దేవాలయాలెన్నో శైవక్షేత్రాలుగా మార్చివేయబడ్డాయి. కొలనుపాక నుండి మీనాంబరం దాకా ఇటువంటివెన్నో గుడులు కన్పడుతాయి.
మీనాంబరంలోని జైనదేవాలయం కూడా పరుసవేదీశ్వరాలయంగా పరివర్తనకు గురైనది.ఈ గుడి విమానం ఫంసానశైలిలోవుంది. ఇదికూడా జైనదేవాలయాల శిఖరపద్ధతి.ఇటుకలు,నాగవిగ్రహాలు,వినాయకుడు,మహావీరుని శిథిలశిల్పం ఇవన్నీ ఇక్కడిదేవాలయం జైనమతానిదేనని చెప్పడానికి సాక్ష్యాధారాలు.కాలాముఖుల గురువు అగస్త్యుని పేరు ప్రస్తావన మందిరంతో కలిపిచెప్పడం కూడా ఒక రుజువని చెప్పాలి.
ప్రస్తుతం ఈ దేవాలయాన్ని గ్రామస్తులే పూనుకుని పునరుద్ధరణ చేస్తున్నారు.ప్రభుత్వం కూడా పట్టించుకుంటే ఒక చారిత్రకసంపద సంపన్నంగా నిలిచివుంటుందని గ్రామస్తుల కోరిక.
పరుసవేదీశ్వరాలయం గుడికెదురుగా వున్న మీనాంబరం నదిమధ్యలో ఒక అమ్మదేవత శిల్పంవుంది.నల్లరాతిలో చెక్కబడిన ఈ శిల్పం జటామకుటంతో,మకుటంలో శిరస్సు ముద్రతో, నాలుగుచేతులతో,ముందరి కుడిచేతిలో ఖడ్గం,వెనక కుడిచేతిలో సర్పం,ముందరి ఎడమచేతిలో రక్తపాత్ర,వెనక ఎడమచేతిలో ఖట్వాంగం, కపాలాలదండే జందెంగా, అర్థనగ్నంగా లలితాసనంలో కూర్చునివున్న ఈ దేవత ప్రేతాసన.శిల్పశైలి రాష్ట్రకూటులకాలానిది. ప్రతిమాలక్షణాలను బట్టి ఈ దేవత సప్తమాతృకలలో సౌమ్యరూపంలో కనిపించే చాముండకు పూర్వరూపం. ఆలంపూర్ లోని జోగులాంబ(యోగాంబిక), వరంగల్ మ్యూజియంలోని చాముండ విగ్రహాలతో పోలికలున్నప్పటికి ఈ శిల్పం ప్రత్యేకలక్షణాలు కలిగివుంది. ఒకవిధంగా చూస్తే ఈ శిల్పం బౌద్ధంలోని ఉగ్రతార, ఏకజటిలతో పోలివుందని చెప్పొచ్చు. ఇక్కడెక్కడ బౌద్ధం ఆనవాళ్ళు దరిదాపుల్లో లేకపోవడం వల్ల ఈశిల్పం బౌద్ధమనడానికి ఆధారాలు వెతకాల్సివుంది. ఈ విగ్రహం నది ఒడ్డున పరుసవేదీశ్వరాలయానికి ఉత్తరంగా పడివున్న దేవాలయశిథిలాల నడుమ ఇసుకలోతుల్లో దొరికింది.ఈ శిల్పాన్ని నదినడుమ వుంచి ఎందుకు పెట్టారో తెలియదు కారణం. నదిపొంగి కూల్చేసిన గుడిలోనిదే ఈ విగ్రహం.గుడి స్తంభాలపై వున్న శిల్పాలనుబట్టి గుడి రాష్ట్రకూటులనాటిదని చెప్పవచ్చు. నదిలో ఇసుకకొట్టుకపోగా బయటపడ్డ చాలాపొడవైన చెట్లకాండాలు రాళ్ళలాగా మారిపోతున్నాయి.ఇవి కూడా 1300సం.ల నాటివనే అనిపిస్తున్నది. కాలనిర్ణయం చేస్తే తెలిసిపోతుంది.
పరిశోధనః ---శ్రీరామోజు హరగోపాల్,
వేముగంటి మురళీకృష్ణ, మేఘరాజు, చంటి

















No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...