Saturday, April 24, 2021

 ఇటీవల మా బృందం చేసిన కొత్తయాత్రః సాక్షి దిన పత్రికలో

గాలిపెల్లి, నరసక్కపేటల్లో శాతవాహనకాలపు చారిత్రకాధారాలు, కాకతీయులనాటి దేవాలయం.
సిరిసిల్లా రాజన్న జిల్లా, ఇల్లెంతకుంట మండలంలోని గాలిపెల్లి ఊరికి పడమట బిక్కవాగు వుంది. బిక్కులు అంటే (బౌద్ధ) భిక్షుకులు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు పక్కన పారే ఆలేటివాగుకు భిక్కేరు అనే పేరుంది. పేరుకు తగ్గట్టే ఈ వాగు వెంట బౌద్ధారామాలు, స్తూపాలు వున్న బౌద్దక్షేత్రాల జాడలు దొరికాయి. దొరుకుతున్నాయి. గాలిపెల్లి బిక్కవాగు వెంట కూడా పెద్ద ఇటుకల దిబ్బలున్నాయని తెలుస్తున్నది. పరిశోధిస్తే ఇక్కడ కూడా బౌద్ధం జాడలు దొరుకుతాయన్న ఆశ కలుగుతున్నది.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందంలోని వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, సహాయకుడు చంటి ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించినపుడు కొత్త చారిత్రక విశేషాలు బయటపడ్డాయి.
బిక్కవాగుకు ఆవలి ఒడ్డున గట్టుమీద ఒక దేవాలయద్వారమొక్కటే మిగిలివున్న గోడలు శిథిల దేవాలయం ఆనవాలుగా కనిపిస్తున్నవి. అద్భుతమైన కాకతీయ శిల్పాలంకరణతో వున్న ఈ దేవాలయద్వారానికి రెండువైపుల ద్వారపాలకులుగా కేశవమూర్తులున్నారు. ఒక్కొక్క ద్వారపాలకునికి రెండువైపుల 2రు చామరగ్రాహిణులు,2రు పరిచారికలున్నారు. ద్వారపు ఉత్తరాశి మీద లలాటబింబంగా గజలక్ష్మి శిల్పం వుంది. ఈ గుడిని చెన్నకేశవుని గుడిగానే స్థానికులు పిలుస్తున్నారు. లోపల ఎటువంటి విగ్రహాల ఆనవాళ్ళు లేవు. గుడిలోని మూలమూర్తి ఏమైనాడో.
చెన్నకేశవుని గుడి ముందర వున్న పొలంలో కుండపెంకులు చాలా దొరుకుతున్నాయి. అక్కడ పూర్వం ఊరుండేదని ఆ పొలం రైతు బాల్ రెడ్డి అన్నాడు. పాటిగడ్డ నుంచే రోడ్డు పోతున్నది. రోడ్డుకట్టుపక్కన వున్న పాటిగడ్డలో ఆ రైతుకు టెర్రకోట మట్టిపూసలు తేలికైన, పెద్ద ఇటుకలు, కుండపెంకులు దొరికినాయన్నాడు. ఆ ఇటుకలను పరిశీలిస్తే అవి శాతవాహనుల కాలంనాటివని తెలుస్తున్నది. అక్కడ రెండు ఇటుకలలో ఒకటి ఎర్రనిది.తేలికైనది.ఇటుక అంతటా రంధ్రాలుండడం వల్ల బరువు తగ్గింది. రెండవ ఇటుక మొదట ఇటుకను పోలివున్నప్పటికి బరువుంది. దొరికిన వాటిలో మట్టిపెంకుతో చేసిన ‘చిత్తుడుబిల్ల’ బిచ్చపెంకు వుంది. మరొకటి పల్చని రాతితో వుండడం విశేషం.పెంకుముక్కలలో నలుపు,ఎరుపు కుండల, కాగుల ముక్కలున్నాయి. ఒక కుండపెంకు మీద కొడవలివంటి డిజైను, దానికింద వలయాల డిజైనులున్నాయి. ఇవన్నీ శాతవాహనకాలంనాటి కుండల డిజైన్లతో, తయారీతో పోలివున్నాయి.
ఈ ప్రాంతాన్ని నరసక్కపేట అంటారు. ఇక్కడ దొరికిన మట్టిపూసలు, ఇటుకలు, కుండపెంకులు, చిత్తుడుబిల్లలు ఇవన్నీ ఈ పాటిగడ్డ శాతవాహనకాలంనాటిదని నిరూపిస్తున్నాయి. ఇక్కడి పరిసరాల్లో పరిశోధన జరిపితే శాతవాహనకాలంనాటి చారిత్రకాధారాలు విస్తారంగా లభించే అవకాశం ఎక్కువగావుంది.

No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...