Saturday, March 31, 2018


వజ్రయాన చైత్యాలయం:
         
అరుదైంది, అద్భుతమైంది, అపూర్వమైంది, అనితరమైంది, సాటిలేనిది. ఇంతవరకు దేశంలో ఎక్కడకూడా దీనిని పోలిన నిర్మాణం లేదు. మట్టి ఇటుకలతో నిర్మించిన గుడులలో ఉత్తరభారతదేశంలో ఒక గుడి వుంది, రెండవది గొల్లత్తగుడి మనతెలంగాణాలోనే వుంది. కాని రాతిఇటుకలతో నిర్మించిన దేవాలయం దేశంలో మరెక్కడా లేదు.
ఇటీవల  పర్యాటకదినోత్సవం(2017) నాడు తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో  తెలంగాణచరిత్రను అన్వేషిస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్,వేముగంటి మురళీకృష్ణ,కట్టా శ్రీనివాస్, అరవింద్ ఆర్య, సదానందం,వేముగంటి సమీర్ కుమార్, అహోబిలం కరుణాకర్,సామలేటి మహేశ్,చంటిలతో పాటు కొత్తూరు గ్రామస్తులు సర్పంచ్ రవీందర్ రావు,మరి ఇద్దరు దేవునిగుట్టమీది చైత్యాలయాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ గుడిని టీవి99వారు, సాదిక్ అలీబృందం, మరికొందరు చూసారు.
 6 లేదా 7వ శతాబ్దంలో నిర్మించబడ్డ వజ్రయాన(మహాయాన) బౌద్ధారామం లేదా చైత్యాలయమిది. 9వ శతాబ్దంలో ఇండోనేషియా సెంట్రల్ జావాలోని మేగలాంగ్ లో నిర్మించిన బోరోబుదూర్ మహాయాన బౌద్ధదేవాలయానికి, 13వ శతాబ్దంలో కాంబోడియా దేశంలో 400 ఎకరాలలో నిర్మించబడ్డ ప్రపంచప్రఖ్యాతమైన అంకర్ వాట్ దేవాలయానికి  ఈ చైత్యాలయం మాతృక వంటి నిర్మాణం. అంకర్ వాట్ వజ్రయాన బౌద్ధదేవాలయం పెద్ద, పెద్ద రాళ్ళను ముక్కలుగా చేసి వాటిమీద చెక్కిన శిల్పాలను ఇటుకల లెక్క పేర్చి కట్టినది. అవి ఎత్తైన శిల్పాలు. అవి భారీనిర్మాణాలు. మన తెలంగాణలోని జయశంకర్-భూపాలపల్లి జిల్లా, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో వున్న దుర్గమారణ్యంలో దేవునిగుట్టమీద రాతి ఇటుకలమీద చెక్కిన శిల్పాలతో కట్టిన గుడివుంది. 24(30-6) అడుగుల ఎత్తున్న ఈ బౌద్ధ చైత్యాలయం గోడలు బయటివైపు, లోపటివైపు రెండువైపులా శిల్పాలతో అలంకరించబడ్డాయి.దీనికి పైవైపు మొనదేలిన పిరమిడ్ ఆకారంలో విమానశిఖరం వుండి వుండాలి. ప్రస్తుతం అది కొంత 6అడుగులదాకా కూలిపోయివుంటుంది.పైన శిఖరానికి రంధ్రం ఏర్పడివుంది. అంకర్ వాట్ దేవాలయానికి, దేవునిగుట్ట గుడికి గుడినిర్మాణంలో, బౌద్ధశిల్పాలలో పోలిక వుంది.అంకర్ వాట్ దేవాలయం అతిపెద్ద దేవాలయాల కాంప్లెక్స్. కాని దేవునిగుట్ట మీది గుడి ఒక్కటే.ఆకారంలో చిన్నదే.కాని చారిత్రకంగా గొప్పది. ఈ చైత్యాలయం నిర్మాణంలో వాడిన రాతిఇటుకలను గుడిపక్కన వున్న రాతిబండలనుండి తీసినట్టున్నారు.లేత ఎరుపురంగులో వున్న ఇసికరాతి ఇటుకలతో కట్టారు.ఈ రాతిఇటుకలు సాధారణమైన రాళ్ళకంటే చాలా తక్కువ బరువును కలిగివుంటాయి.అయితే ఈరాతిముక్కల అంచులు  తొందరగా  రాలిపోతాయి కనుక మొదట వీటిని చిన్న,చిన్నసైజులలో( 2*2అడుగులు, 2*1అడుగుల కొలతలలో) రాతిబిళ్ళలుగా చేసుకుని ఆలయనిర్మాణం చేసారు. గుట్టమీద పునాదుల అవసరం లేకుండా, మొత్తం 4.5అడుగుల మందంతో మధ్యలో ఖాళీని వదిలిన రెండు పొరల గోడలతో నిర్మించినట్టు తెలుస్తున్నది.గుడిలోపల 10అడుగుల వైశాల్యంతో,బయటిగోడలు ఒక్కొక్కటి 19.6 అడుగుల కొలతతో గుడినిర్మాణంలో కూడా ఈ చైత్యాలయం ప్రత్యేకత కలిగివుంది. ఈ చైత్యాలయానికి ముందువైపు ద్వారంతో 3 రాతిఇటుకలగోడలు 6అడుగుల ఎత్తున కట్టబడివున్నాయి. ఆలయానికి వంద అడుగులకన్నా ఎక్కువదూరంలో రాతిగుండ్లుపేర్చిన గోడ నలువైపుల వుంది.గుడికి ఉత్తరం దిశలో సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు వుంది.
గుడికి ఒక మూలన నిలబెట్టివున్న పాలరాతి స్తంభం బౌద్ధస్తూపాలవద్ద నిలిపివుంచే ఆయకస్తంభం,దానికి నాలుగువైపుల అర్ధపద్మాలు, సింహాలు చెక్కివున్నాయి.క్రీ.శ.1లేదా 2వ శతాబ్దాలకు చెందినదనిపించే ఆయకస్తంభంవల్ల ఈ స్థలం చైత్యాలయం కన్నా ముందునుంచే బౌద్ధస్థావరంగా వుండేదని అర్థమవుతున్నది.
దేవునిగుట్ట చైత్యాలయం తూర్పుకు ఎదురుగా ఒకేద్వారంతో నిర్మించబడ్డది. ఎత్తు తక్కువున్న చిన్నద్వారం. ద్వారానికిరువైపుల ద్వారపాలకులవలె కన్పిస్తున్న వజ్రయాన బౌద్ధమూర్తులలో ఒకరు హరివాహన లోకేశ్వరుడు.ఎటు 10అడుగుల చతురస్రాకారపు చైత్యాలయపు లోపల 20,30యేండ్ల కింద ఏ దేవుని ప్రతిమ లేదు. ఈ గుడిబయట ఒక రాతివేదికమీద నంది విగ్రహం వుండేదిట.ఇపుడది లేదు.ప్రస్తుతం గుడిలో ఒక సిమెంటు వేదికమీద కొత్తూరు గ్రామప్రజలు ప్రతిష్టించుకున్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం వుంది. ఆ దేవునికే ప్రతి కామునిపున్నమి లేదా హోళిపండుగ సందర్భంగా జాతర చేసుకుంటున్నారిక్కడి గ్రామస్తులు.
లోపలి గోడలకు ద్వారంవైపు తప్ప మిగతా 3గోడలమీద బుద్ధజాతకకథలకు చెందిన కథాదృశ్యాలు చెక్కివున్నాయి.బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు 2,3 చోట్ల వున్నాయి. ఒకచోట యుద్ధసన్నివేశం చెక్కబడివుంది.దానిలో చేతిలో ఖడ్గంతో కుషానుని పోలిన శిల్పం వుంది. మిగతా రెండుగోడలమీద కూడా బౌద్ధజాతకకధలే.అందులో బుద్దుని బోధనల సంఘటనలే ఎక్కువగా చెక్కబడివున్నాయి.బయటిగోడలమీద వివిధదృశ్యాలు 6రేసి ఫ్రేములుగా విభజించబడ్డాయి.మధ్యలోని శిల్పాలు పెద్దవిగా మిగతావి చిన్నవిగా వున్నాయి. ఒక్కటొక్కటిగా శిల్పాలను చెక్కి పేర్చిన రాతిఇటుకలు కింది నుండి పైకి సైజు తగ్గుతూ పోయాయి. దక్షిణంవైపు గోడమీద అజంతా చిత్రాలలోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో రాణితో కూర్చున్న దృశ్యం వుంది.అటిటు రెండుపక్కల బోధిసత్వుని అవతారరూపాల శిల్పాలున్నాయి.పైన ఫ్రేముల్లోను బుద్ధబోధనల దృశ్యాలే కనిపిస్తాయి. పడమటివైపు గోడమీద కిందివైపు అర్ధనారీశ్వర శిల్పం చెక్కివుంది.ఈశ్వరుని అర్ధభాగం,పార్వతి అర్ధభాగం స్పష్టంగా చెక్కబడింది.6 అడుగులు,8అడుగుల కొలతల ఈ ఫ్రేములో చతుర్బుజుడైన అర్ధనారీశ్వరుని కుడిచేయి గణపతి తలమీద, ఎడమచేయి కుమారస్వామి తలమీద పెట్టినట్లు చెక్కబడ్డాయి. దానిపై వరుసలో బుద్ధునిబోధనలు వింటున్న రాజు,రాణులు,పరివారం, మిథునాలు వున్నాయి. పై అంచుల రాతిఇటుకలపై సాగరమథనం చెక్కబడివుంది. ఉత్తరంవైపు గోడమీద చెక్కిన కథాదృశ్యం కొత్తదిగా వుంది. భయంకరంగా వున్న పెద్దతల కలిగిన బోధిసత్వుడు(జంభాలుడు?) ఎడమమోకాలితో ఎవరివీపునో వంచి, ఎడమ చేత అతని గొంతును వెనక్కి విరిచి నొక్కుతున్నట్టుగా వుంది. ఆ గోడమీద వున్న హరివాహనలోకేశ్వరునికిరువైపుల అంచుగా నిలిపిన ఇటుకలమీద రెండు పూర్ణకుంభాలు చెక్కబడివున్నాయి. బౌద్ధస్తూపాలున్నచోట ఇవి సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ గోడకే శిఖరంవైపు ఈశాన్యపు అంచున చెక్కబడివున్న అమితాభునిశిరస్సు శిల్పం కాంబోడియా అంకర్ వాట్ దేవాలయం మీది పెద్ద రాతిముక్కల శిల్పానికి మాతృక అనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలు అజంతాచిత్రాల తోను, అమరావతి,ఫణిగిరి,నాగార్జునకొండ బౌద్ధశిల్పాలతోను,ఒరిస్సాలోని స్కందగిరి, ఉదయగిరి శిల్పాలతోను పోలికలు కలిగివున్నాయి.ఈ దేవాలయానిది విశిష్టమైన శిల్పశైలి.అనితరమైనది.
బౌద్ధచైత్యాలయంలో శైవం కనిపించడం వజ్రయానప్రభావమే.తెలంగాణాలో బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని,మంత్రయానమని పిలువబడే వజ్రయానానికి మంత్రాలు,ధారణులు,ముద్రలు,స్త్రీదేవతారాధన, లైంగిక యోగసాధనలు లక్షణాలు.భిక్షుకుల మతంగా వున్న బౌద్ధం, ఉపాసకులమతంగా మారిపోవడం, ఇతరమతాలైన జైన,వైష్ణవ, శైవాలు తాంత్రికపద్ధతులను అవలంబించడం 7వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకు  కొనసాగింది. వజ్రయానం నాగార్జునునికొండ నుండే ప్రపంచమంతటికి విస్తరించింది. చైత్యకులు బుద్ధుడిని భగవంతుడిని చేసారు.మహాదేవునిగా అంగీకరించారు.దాని ఫలితమే బౌద్ధంలో శివుడు కనిపించడం.వజ్రయాన ప్రతిమారూపభేదాలలో (Iconography) అక్షోభ్యుని ప్రతిమ లేదా స్తూపం నమూనా వుండడం వంటివి కనిపిస్తుంటాయి.
కొత్త సిద్ధిపేట జిల్లా సింగరాయగుట్టమీద బౌద్ధబ్రహ్మ, పాతవరంగల్ జిల్లాలో ఇటీవల బయటపడ్డ అమితాభ్య, తారాదేవి ప్రతిమలు ఈ ప్రాంతంలో వజ్రయానం యొక్క ఉచ్ఛస్థితిని సూచించేవే.అయితే మొదటినుంచి రాజాశ్రయం అరకొరగా లభించిన బౌద్ధం కొట్టుమిట్టాడుతు జీవించింది. అంతేగాక కాలాముఖ,పాశుపతుల దాడులకు గురైంది. పాండవులగుట్ట గొంతెమ్మగుహలో వున్న ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’శాసనం బౌద్ధ,జైనాలకు పరమమాహేశ్వరులు చేసిన హెచ్చరిక. ఇన్ని పరిణామాల మధ్య దేవునిగుట్ట మీద ఈ చైత్యాలయం బతికిబట్టకట్టడం ఆశ్చర్యమే.చరిత్రచేసుకున్న భాగ్యమే.










































No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...