Sunday, March 11, 2018




























తూర్పుగూడెం:
          యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం తూర్పుగూడెం.ఈ గ్రామంలో రెండు దేవాలయాలు వున్నాయి. ఒకటి శివాలయం.రెండవది వేంకటేశ్వరాలయం.
          శివాలయంలో అంతరాళం, గర్భగుడులున్నాయి. అంతరాళంలో నంది, వినాయక శిల్పాలున్నాయి. అంతరాళం ద్వారానికిరువైపుల శైవద్వారపాలకులున్నారు. లలాటబింబంగా ద్వాదశదళ పుష్పం వుంది. గర్భగుడికి లలాటబింబంగా లింగాన్ని అర్చిస్తున్న ఏనుగులున్నాయి. ఈ లలాటబింబం శైవమఠాలకే వుంటుంది. గర్భగుడి ద్వారానికిరువైపుల పూర్వకాకతీయ కలశాలున్నాయి. గర్భగుడిలో రెండడుగుల చతురస్రాకారంలో వున్న పానవట్టంమీద బాణలింగం ప్రతిష్టించబడివుంది. వెనక మూడుగుల ఎత్తున్న రాతిఫలకం మీద దుర్గాదేవి ఉల్బణశిల్పం వుంది. చతుర్భుజియైన ఈదేవత ముందరి కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి వరదహస్తంగా వున్నాయి. వెనక కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో ఢమరుకం వున్నాయి తలకిరువైపుల సూర్య,చంద్రులు వున్నారు. ఈ దేవత ఆలేరులోని చండికాంబగుడిలోని దుర్గాదేవిని పోలివుంది. ఒకే రూపంలో వుంది.
          గుడిగోపురం సోపాన(ఫంసాన)పద్ధతిలో నిర్మించబడింది. డంగుసున్నంతో చేసిన శిల్పాలతో నలువైపుల గోపురం అలంకరించబడివుంది.గుడి ముందువైపు గోపురానికి వినాయకుడు,దక్షిణం దిక్కు మహిషాసురమర్దిని, పడమటివైపు  కడుపులో ఆత్మలింగంతో గజాసురుడు, ఉత్తరం దిక్కు భైరవుడు వున్నారు. శిఖరాన కలశం వుంది.
          దేవాలయప్రాంగణంలో ఆంజనేయుని ఆలయపాలకుడుగా వున్నాడు. ఈశాన్యంలో ఒక ముస్లిం సమాధి(దర్గా?) వుంది. గుడిచుట్టూ కట్టిన పాతరాతిగోడ కొంతభాగం వుంది.
          ఈ శివాలయానికి నైరుతిదిశలో ఒక చిన్న దేవాలయంలో వేంకటేశ్వరుడున్నాడు. రాతిగుండుమీద రెండడుగుల ఎత్తులో చెక్కివున్న ఈ వేంకటేశ్వరుని శిల్పం పురాతనమైనదే...పక్కనున్న స్త్రీదేవతామూర్తులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. రాతిగుండుచుట్టు కట్టిన 5అడుగుల ఎత్తయిన గోడలతో దేవాలయం కట్టబడ్డది.
          ఊరిబయట ఆగ్నేయంగా కూలిన బురుజొకటి కనిపిస్తున్నది. బురుజు వెనక ఆంజనేయునిగుడి వుంది. బురుజుకు కొంచెం ముందర పోచమ్మగుడి, అందులో చాముండదేవతాశిల్పం వుంది.

No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...