Monday, July 2, 2018

డోల్మెన్లు:
డోల్మెన్లు ఒకే గది లేదా అర్ర వున్న పెదరాతియుగం సమాధులు. ఇవి క్రీ.పూ. 7000ల సం.(ఐరోపాలో) నుంచి 4000 సం.ల(సాధారణంగా) మధ్యకాలంలో పురామానవులు నిర్మించుకున్నట్టు పురాతత్వవేత్తల అభిప్రాయం. కార్బన్ డేటింగ్ చేయడం కష్టం. డోల్మెన్లలో దొరికే రాతిపనిముట్లు, ఇతర అవశేషాల కాలనిర్ణయం చేయవచ్చు కాని, డోల్మెన్ల వయసు చెప్పడం కష్టం. ఈ సమాధుల్లో మరణించిన వారి ఎముకలను దాచివుంచేవారు. కొన్ని డోల్మెన్లు మోకాటి ఎత్తులో కట్టడానికి కారణం, దానిలోనికి దూరడానికి అవకాశాన్ని తగ్గించడానికే కావచ్చు. ఓరగా వాటిని కట్టడానికి కారణం పవిత్రప్రదేశాలుగా నిలుపడానికే కావచ్చు. వీటిలో ఆర్కియాలజిస్టులకు కొన్నిచోట్ల పనిముట్లు, కుండపెంకులు, జంతువుల ఎముకలు, పొయ్యిలు కూడా అగుపించడం వల్ల డోల్మెన్లు సమాధులుగానే కాక ఇతరపనులకు కూడా వాడుకున్నట్లు భావించవలసి వచ్చింది.అందుకే కావచ్చు ఎన్నో డోల్మెన్లలో మానవావశేషాలు లభించలేదు. డోల్మెన్లు ఏ ప్రయోజనాల గురించి నిర్మించారో కాని, ఆలోచిస్తే ఇవి ఇప్పటికీ మన బుర్రలకు పని కల్పిస్తూనే వున్నాయి. కల్పనలకు హేతువులవుతున్నాయి. కాని, చరిత్ర కల్పన కాదు కదా. పరిశోధనలింకా అవసరం.
అయితే ఈ సమాధులు రెండు లేక మూడు నిలువుగా నిలిపిన రాతిసలపలతో, కప్పురాయితో వున్న నిర్మాణాలు. కొన్నిసార్లు కప్పురాతికింద చిన్న రాతిబండముక్కలను పేర్చి డోల్మెన్ ఎత్తును పెంచడం,దించడం జరుగుతుంది. ఈ రూపానికే మట్టి, రాళ్ళతో మూస్తే ‘టుములస్’ సమాధిగా మారిపోతుంది. ఆ మట్టి, రాళ్ళు రాలిపోయినచోట్ల ఇవి రాతి అస్థిపంజరాలలెక్క అగుపిస్తుంటాయి. ఈ డోల్మెన్ల కప్పురాళ్లు 30-35అడుగుల పొడవు,14-20 అడుగుల వెడల్పు,1-2 అడుగుల మందంతో కూడా లభించాయి.
‘బ్రెటన్’ భాషలో డోల్మెన్ అంటే ‘రాతిబల్ల’ అని అర్థంగా చెప్తారు.
డోల్మెన్లు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంటాయి. యూరపులోని బ్రిటనీ, ఫ్రాన్సు, స్కాండినేవియా, బ్రిటన్, ఐర్లాండు, స్విట్జర్లాండు, ఇటలీ, మధ్యధరా సముద్రదీవులు, ఆఫ్రికా,ఆసియాలలోని కొన్నిదేశాలలో 30వేలకు పైగా ఎన్నుకున్న డోల్మెన్లు, ప్రపంచంలోని అన్ని డోల్మెన్లలో ఐదింట రెండువంతులు ఒక్క కొరియాలోనే వున్నాయి. వాటిలో కొన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది.

No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...