Monday, January 3, 2022

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః

                                                -----------శ్రీరామోజు హరగోపాల్

ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజులకు గద్దెలు కట్టి జాతరచేయడానికి కారణం వాండ్లు కాకతీయులతో పోరాడి వీరమరణం పొందడమేనని కైఫీయత్తులు చెప్తున్నాయి.

          గిరిజనులలో ‘అమ్మ’ దేవతారాధన అతిప్రాచీనమైనది. గిరిజనులు తమ నాయకుల్ని గౌరవాదరాలతో చూడ్డమే కాదు, వారిని అర్ధదేవతలు(Semi-Gods)గా పూజిస్తారు కూడా. వారికి ప్రత్యేకంగా అతీతశక్తులున్నాయని నమ్ముతారు. గిరిజనప్రజలు తమ పాలకులను దేవుళ్లుగా కొలువడంకూడా సాధారణమే. గిరిజనుల జాతరలు మైదానప్రజల దేవతారాధనలకు భిన్నంగా వుంటాయి. ఎక్కువమట్టుకు పున్నమిరోజుల్లోనే ఈ పండుగలు చేయడం విశేషం. వానాకాలం పంటలు చేతికందిన తర్వాత ఈ ఉత్సవాలు చేస్తుంటారు. ప్రకృతిని ఆరాధించే గిరిజనులు వానని, పుష్పించిన అడవిని, బతుకునిచ్చే చెట్లను, నీటిచెలిమెలను, గుట్టలను, పులివంటి జంతువుల్ని దేవతలుగా కొలుస్తారు.

కూడలిదేవతలను కొలిచే తంతు గిరిజనులదే. ఇప్పుడు పెద్దపల్లెలుగా, చిన్నపట్టణాలుగా మారిన వూర్ల పొలిమేరల్లో ఈనాటికి కూడలిదేవతలను మనం చూడొచ్చు. ఈ కూడలిప్రదేశాలు ఏడెనిమిది నుండి పదివూర్ల పొలిమేరలు కలిసినచోట్లు. అక్కడ పొలిమేర దేవతలను నిలుపుకున్నారు. వారికి గద్దెలు కట్టడం, గూళ్ళు ఏర్పరచడం. జాతరలు చేయడం ఆనవాయితి. కోయలకు దేవీదేవతలు చాలామందే వున్నారు. ముఖ్యంగా వారు మామిలి,కొమ్మలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ, కాటురుడు, ఏడమరాజు, కుడిదేవర, ముసలమ్మలను ఆరాధిస్తారు. ఏ దేవతకు గుడిలేదు. విగ్రహాలు లేవు, మంత్రాలు లేవు. అంతా ప్రాకృతిక పూజలే. మరాఠాకోయలు దేవుణ్ణి ‘పేన్’ అని పిలుస్తారు, తెలుగుకోయలు ‘వేల్పుల’ని.

సమ్మక్క అంతర్థానమైనాక చందా కుటుంబం మూడుగుంపులుగా విడిపోయింది. సమ్మక్కదేవర సంబంధించిన పూజావస్తువుల్ని మూడు భాగాలుగా పంచుకున్నారు. ఒక గుంపు చందాకు వెళ్ళింది. రెండో గుంపు బయ్యక్కకు చేరుకుంది. మూడోగుంపు ఖమ్మంజిల్లాలోని సిరిమల్లెకు వచ్చింది. సమ్మక్క తల్లిదండ్రులు నివసించిన గ్రామం సిరిమల్లె అని గిరిజనుల విశ్వాసం. సమ్మక్క జాతర జరుపాలని నిశ్చయించిన చందావారు జాతర నడిపే బాధ్యతలను పంచారు. 1944 నుండి సమ్మక్క జాతర మొదలైంది. కాని, మేడారంలో సమ్మక్కను ప్రతిష్టించింది 1962లో. జాతర నడిపే హక్కుల గురించి 1967లో రాష్ట్ర హైకోర్టు  తీర్పునిస్తూ జాతర ఆదాయంలో పూజారులకు ఒకభాగం, చందావారికి ఒక భాగం, మూడోభాగం ప్రభుత్వానికని చెప్పింది. బయటిప్రజలకు వెల్లడైనప్పటినుంచి సమ్మక్క జాతర పెద్ద ఎత్తున సాగుతున్నది.

           మేడారంలో జరిగే సమ్మక్క-సారక్కల జాతర గిరిజనుల సాంప్రదాయికమే. రెండేండ్లకొకసారి చేసే ఈ పండుగ వారి ఆనవాయితీ. మేడారంలో లెక్కనె దామెరవాయిలో కూడా రెండేండ్లకొకసారి జాతరచేస్తారట. అక్కడి ఆచార, సంప్రదాయాలు మేడారంజాతరను పోలివుండడం విశేషం.

          కాకతీయులు ఎందునాగాని ఇంత చిన్న మేడారం పరగణా మీద దాడిచేయడానికి పగిడిద్దరాజు చక్రవర్తులకు పన్నుకట్టకపోవడమన్నది కారణం అవుతుందా? కాదు. అంతకన్నా మించిన మూలకమేదో వుండివుండాలి. ప్రతాపరుద్రచక్రవర్తి కాలంలో అతని మంత్రి యుగంధరుడి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పబడుతున్న జంపన్నవాగు యుద్ధం ఏ ప్రతాపరుద్రునికాలంలో జరిగివుంటుంది.

          ఇటీవల ప్రచురించబడ్డ ‘Goddess of Folk- Sammakka  and Saralamma Jatara’లోని 277వ పేజీలో పేర్కొనబడ్డ శాసనంలో

          ‘సమ్మక్క దేవతల ఉత్సవ.....కాకతీయ రాజ్య...కానుకలు.....బంగారము మా ప్రజల నుంచి చేర్చమని వినతి............... పగిడిద్దరాజు జ్ఞా.... పౌర్ణమి కానుకలు కాకతీయసైన్యాధిపతి ఆజ్ఞ మేరకు’  అనివుంది. ఈ శాసనమెప్పటిది. శాసనలిపి, భాషలను బట్టి మొదటి ప్రతాపరుద్రుని కాలంనాటిదని గ్రంథకర్తల అభిప్రాయం. (శాసన ప్రతిబింబం లేని శాసనం. ఇటువంటి శాసనభాష ఏ కాకతీయుల శాసనంలో కన్పడదు. దీనిలో ఆజ్ఞ చేసినవారు కాకతీయ చక్రవర్తి కాదు. సైన్యాధిపతి పేరులేదు. ఈ శాసనం విశ్వసనీయంగా లేదు.)

          ఒకవేళ మొదటి ప్రతాపరుద్రుడే ఈ యుద్ధకారకుడైతే తానే ఈ జాతరకు కానుకలు పంపమని ఎందుకు ఆజ్ఞలు చేస్తాడు. ఈ శాసనం విశ్వసనీయం అనిపించదు....

          చారిత్రక ఆధారాలను వెతికితే... కాకతీయ సామ్రాజ్యానికి, మేడారానికి సబబైన యుద్ధకారణాలు  మనకు దొరకవచ్చు.

          కాకతీయ రుద్రదేవుని(1158-1195)కాలంలోనే ఈ మేడారం యుద్దం జరిగివుంటుంది.

                మేడారం ప్రాంతాన్ని పాలించే సామంతుడైన(?) పగిడిద్దరాజు కప్పం చెల్లించలేకపోయినందుకు మొదటి రుద్రదేవుడు పంపించిన సేనాధిపతి గంగాధరమంత్రితో యుద్ధం చేయవలసివచ్చిందా? ఔనని ఒక కథనం. కాకతీయ సైన్యం ముందర గిరిజనసైన్యం నిలువలేకపోయింది. పగిడిద్దరాజు కుటుంబం సర్వం నిశ్శేషంగా హతమైంది. ఈ యుద్ధానికి సంబంధించిన శాసనాధారాలేమీ దొరకలేదు. కప్పం కట్టకపోతే చక్రవర్తి పగిడిద్దరాజును బంధించవచ్చు. శిక్షించవచ్చు. కప్పం రాబట్టే విధానం యుద్ధం కాదుకదా. మరొక విధంగా కాకతీయరాజ్య విస్తరణలో భాగంగానే మేడారం రాజ్యాన్ని వశపరచుకోవడానికే రుద్రదేవుడు ఈ యుద్ధం నడిపించాడా?కావచ్చు.

ఇంకొక విధంగా తలపోస్తే....        

గుండరాజు, ప్రోలరాజులు కళ్యాణీచాళుక్యులకు సైన్యాధికారులుగా, ప్రాంతీయపాలకులుగా వుండేవారు. రెండవ మేడరాజు పొలవాస పాలకుడిగా వుండేవాడు. మేడరాజు పాలనలో పొలవాసరాజ్యం వరంగల్లుకు 30 కి.మీ.ల దూరం విస్తరించి వుండేది. అప్పటి కాకతీయరాజ్యానికి పొలవాసరాజ్యం రెట్టింపు విస్తీర్ణంలో వుండేది.

          క్రీ.శ.1128నాటి గోవిందపురం శాసనం మేడరాజు కుటుంబచరిత్ర నందిస్తుంది. యక్షేశ్వరి ఆరాధకుడైన మాధవచక్రవర్తి వంశంలో దుర్గరాజు-కు, 1వ మేడరాజుకు, జగ్గరాజు కు, 2వ మేడరాజు ఇంకా గుండరాజులు పుట్టారు. మేడరాజు-2 పొలవాస రాజు, గుండరాజు మంత్రకూటరాజు.

          కాలచురిరాజు బిజ్జలుడికి కళ్యాణీచాళుక్యరాజ్యంపై ఎప్పటినుండో ఆశవుంది. బిజ్జలుడు తన కొడుకు మైలగికి రెండవ మేడరాజు, గుండరాజు, దొమ్మరాజు, భీమదేవచోడులతో మిత్రసమాఖ్యనేర్పరచి, మూడో తైలపుణ్ణి  రెండవ జగదేకమల్లున్ని సింహాసనం నుంచి తొలగించడానికి ఉసిగొలిపాడు. తైలపుడు రెండవ జగదేకమల్లుని సమర్థించే 2వప్రోలునిపై కూడా దాడి చేసాడు. రెండవప్రోలునితోపాటు మొదటి రుద్రదేవుడు, గోకర్ణదేవచోడుడు యుద్ధంలో పాల్గొన్నారు.

నగునూరు ప్రభువు దొమ్మరాజు, పొలవాస రాజు మేడరాజులు కాకతీయులతో శత్రుత్వం కారణంగా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. ఈ యుద్ధంలో(క్రీ.శ. 1150 ప్రాంతంలో) దొమ్మరాజు మరణించాడు. మైలగి కళ్యాణి వరకు తరిమివేయబడ్డాడు. మేడరాజు అడవుల పాలయ్యాడు. హన్మకొండ శాసనంలో(క్రీ.శ.1163) పొలవాసరాజు ఏ(మే)డరాజు పరాజయాన్ని, పలాయనాన్ని గుండరాజు మరణాన్ని గురించి చెప్పబడివుంది.

 ఈ సందర్భంలోనే రుద్రదేవుడు మేడరాజు తన ఓటమిని అంగీకరించి, కూతురు(?) సమ్మక్కను ఇవ్వవలసిందిగా సంధి రాయబారం చేసివుంటాడు. అందుకు అంగీకరించని మేడరాజు రుద్రదేవునికి అందనంత దూరం అడవుల్లోపలికి వెళ్ళిపోయాడు. మేడరాజు జాడలు కనుక్కుని, మేడరాజుకు ఆశ్రయమిచ్చిన పగిడిద్దరాజు మీద గంగాధరమంత్రి చేత దాడి చేయించివుంటాడు రుద్రదేవుడు. సమ్మక్కబిడ్డలు జంపన్న, సారలమ్మలు యుద్ధంలో పాల్గొనివుంటే వారు యుక్తవయస్కులై వుండాలి. అంటే ఈ యుద్ధం 1190కి ముందో, వెనకో జరిగివుంటుంది. ఆ తరువాత 1195లో జైతుగితో యుద్దంలోనే రుద్రదేవుడు మరణించాడు.

          ఇటీవలి పరిశోధనల ప్రకారం సమ్మక్కతల్లి చందంబోయిరాలు  చంద్రాపూర్ రాజధానిగా రాజ్యమేలిన రాచగోండుల వంశానికి చెందిన స్త్రీ, తండ్రి రాయిబండనిరాజు మేడారం పరగణా నాయకుడు. సమ్మక్కను పెండ్లాడిన పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. తమకల్లుడైన పగిడిద్దరాజు మామ మేడరాజుకు మద్ధతుగా నిలిచారు రాచకోయలు.

          మొదటి రుద్రదేవునికి కాకతీయరాజ్య విస్తరణకు అడ్డుగా వున్న కోయరాజ్యాన్ని లోబరచుకోవాలన్నది ఒక కారణమైతే, తనకు లొంగకుండా, అడిగినా బిడ్డనివ్వకుండా అడివిలో చేరి రాచగోండుల రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నాడన్నది రెండవ కారణం. శత్రుశేష నిర్మూలన, రాజ్యవిస్తరణ కాంక్షలతో రుద్రదేవుడు పగిడిద్దరాజు వద్దకు మంత్రి గంగాధరుణ్ణి సర్వాధికారాలతో ఆజ్ఞలు చేసి పంపివుంటాడు.

          ఆత్మాభిమానధనులైన రాచకోయలు కాకతీయులకు లొంగడానికి, మేడరాజును అప్పగించడానికి ఇష్టపడ నందువల్లనే ‘జంపన్నవాగు’ ఒడ్డున యుద్ధం జరిగింది. సమ్మక్క, సారమ్మలు యుద్ధంలోనే మరణించివుంటారు. మేడరాజు కూడా యుద్ధంలోనే బలైవుంటాడు. బలవంతులైన కాకతీయుల సైన్యంతో తలపడి ఆత్మసమర్పణం చేసుకున్నది ఒక గిరిజన స్వతంత్రరాజ్యం. మేడరాజు పేరుమీద గూడాలు వెలిసాయి. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్కల పేరుమీద వీరగద్దెలు కట్టి జాతర ప్రారంభించారు మేడారం పరగణా ప్రజలు. సమ్మక్క దేవతయింది. వీరారాధన దేవతారాధనగా మార్పు పొందింది.

Sunday, January 2, 2022

ఆమనగల్లు-రాష్ట్రకూట శంకరగండరస శాసనం:

ఆమనగల్లు-రాష్ట్రకూట శంకరగండరస శాసనం:

ఆమనగల్లు, వేములపల్లి మండలం, నల్లగొండ జిల్లా,తెలంగాణ రాష్ట్రం

ఈ శాసనం 94 పంక్తులది.లిపి తెలుగు,భాష కన్నడం.రాజ్యం రాష్ట్రకూట,రాజు అకాలవర్షుడు(రెండవ కృష్ణుడు).కాలం ప్లవంగ నామ సంవత్సరం.క్రీ.శ.888 సం.(ఎణ్డు నూఱఱుపత్తు=810 శక సం.+78 కలిపితే 888 క్రీ.శ.)

మహా సామాన్తాధిపతి, జయధీర, భువనయ్క రామ,అభిమాన ధవళ, రట్టర మేరు, రాజ భూరిశ్రవ,విద్విష్ట నారాయణీం ధర్మరత్సాగరం అని ప్రశస్తిగల  శ్రీమత్సంకర గండరస క్రొళ్ళిపాక-2000నాడు( కొలనుపాక)ను రాజధానిగా పాలించినప్పటి శాసనం. ఆమనగల్లు గుట్ట మీద పూర్వముండే ఆగుర్బుళు జైనబసదికి  వామదేవయ్య తదితర గ్రామ గావుండాలు, ప్రజలు చేసిన భూదాన, ధనదాన వివరాలు ఈ శాసనంలో వున్నవి.

 

ఆమనగల్లు శాసనం:

మొదటివైపుః

గుడిగోపురం,ఆవు-దూడ,శివలింగం,నంది బొమ్మలు

       1.            స్వస్త్యకాలవర్ష దేవ

       2.            శ్రీపృథ్వీవల్లభ మహారా

       3.            జాధిరాజ పరమేశ్వర ప

       4.            రమ భట్టారక ప్రవర్థమా

       5.            న విజయరాజ్యాభివృ

       6.            ద్ధి యుత్తరోత్తర సల్బత్తి

       7.            ర తత్పాదపద్మోప సేవి.

       8.            సమధిగత పంచమహా

       9.            శబ్ద మహా సామాన్తాధి

   10.            పతి జయధీర భువనయ్క

   11.            రామనభిమాన ధవళ ర

   12.            ట్టర మేరు రాజభూరిశ్రవ

   13.            విద్విష్ట నారాయణీం ధర్మ

   14.            రత్సాగరం శ్రీమత్సంకర గండ

   15.            రస క్రొళ్ళిపాకే రాజధాన

   16.            యాగిర్పత్తోఱ్చాసిరనాళు..

   17.            మా దుష్టనిగ్రహ విశిష్ట ప్రతి

   18.            పాలకాది చోరారి దామరాప

రెండోవైపుః

   19.            సర్గంగళం విమర్దే

   20.            సి సుఖ సంకథ

   21.            వినోదంగళినవు

   22.            వఱ్దిన్న మా చన్ద్రార్క

   23.            బరమరసు గేయు

   24.            త్తుమిరే శక భూపా

   25.            ళ సంత్సర శతం గళే

   26.            ణ్డు నూఱఱు వత్తేర.

   27.            దనేయ ప్లవంగ సం

   28.            వత్సరదిం బృహతి

   29.            మకరదోళ్ ప్రవత్తి

   30.            సేఱీమధునాళ పే

   31.            గ్గేళేపన్దుయుం  సేనపీ

   32.            చనప్పణయు మేల్గ

   33.            ణ్డనప్పయు నుత్తరణ

   34.            వామదేవయ్యనాగే

   35.            నాద ప్రజెగె..ళ్ళ

   36.            క్షితినాల్కని....బా

   37.            చదోళ కోరకోణ్డుది

   38.            ..లు ణ్పఱియాదుళే

   39.            ...మం సలిసువగ్గొము

   40.            ...న పరిహారవుత్తిద

   41.            ...జమానమేణ్ణత్తు మా

   42.            ...మ మఱువత్తు కని

   43.            ష్టం నాల్పత్తు మర్తర్నేలనం

   44.            సలిసియుత్తివకెమూ

   45.            ఱు గద్యణం మధ్యమకేర

   46.            దు గద్యణం కనిష్టకేవు

మూడో వైపుః

నాగలి గుర్తు

   47.            ...ళ్వరణం పోన్నకోవ్వ.. ళి

   48.            ఱ్పిణలికి గావున్డి దో..

   49.            న్నోవఱెజమదియనుప

   50.            లివోం భోగపతి గోన్వకేయు

   51.            ల్లదగ్గళం సల్లదు పరివార వ

   52.            రానువుఱ్పోరుళ్దోదే గావుణ్డ

   53.            గోకలాగుఱ్బుళు బిసదికా

   54.            ఱంగే కోరనికిళి పిఱియ

   55.            ఖణ్డుగ దోకూటమల్లదే పే

   56.            ఱ దేవుళుం సల్లదు ఆణె

   57.            మికోదం పియ్దోదం పో

   58.            య్దోదం మూఱుగద్యణ

   59.            సురిగేగిఱ్తీదయ్దు గ

   60.            ద్యణం హిఱెయిఱిదోటో

   61.            దే గాప్పొత్తయ్దు గద్యణం

   62.            సామేమిఱిదోదెల

   63.            య్పత్తు గద్యణం నామన

   64.            నిఱిదోదె నూఱు గద్య

   65.            ణ ళిళర్గణరళవింగే

   66.            ళిన్ద కీర్మదియుమయ్దు

   67.            గద్యణం పొన్ను మంద

   68.            ణ్డం గోళ్వరు ఆవోదో

  69.        ఆయ్వమయుంపిరేదాం శ్రీ

నాలుగొవైపుః

   70.            సంగో...... తేననల్ల

   71.            దోదవృద్ధిదోమాదల

   72.            గనణ్డరేవకోళగా

   73.            ...పరళ్దరికీప్పత్తయ్ద్యు గద్య

   74.            ణం రిఱ్గెలదవగ్గె మూ

   75.            ఱు గద్యణం మినిత కే

   76.            ...వాగాసామిల్లళోం స

   77.            ..ల్లణ్డవేపువోసణ్డద

   78.            మాదేటో సకనాల్వతి

   79.            ఱి దేఱెకోట్వరుగోవ్మమా

   80.            త్యళ మేళాపుతాఱుయుమి

   81.            పసువుం కొట్టిగేఱ్ఱు మల్ల

   82.            పుఱి చకిఱుదేఱేయై

   83.            వుళుం సల్ల పూ

   84.            ..సితియాళోదపన్నసే

   85.            పరిహారమాదువేల్ల

   86.            మప్రవాహదరుహణ

   87.            మకొణ్డుసలిసువదు

   88.            గొన్తిసితియం తప్పద ధనధా

   89.            న్య సన్నిద్దరాగి యాచన్ద్రతారా

   90.            ర్క సుఖహిఱ్విరు బహుభిర్వన్

   91.            సుధానుక్తా రాజనాసగరాది

   92.            భి యస్య యస్య యదాభూమి

   93.            తప్య తస్య తదాఫల సామా

   94.            న్యోయం ధమ్మసేతు నృపాణకా

 

ఈ శాసనంలో పేర్కొనబడ్డ శంకరగండరస

1.       వరంగల్ జిల్లా శాసనసంపుటిలో 3వది, తేదీలేని  ఆకునూరు  శాసనంలో...

‘‘సమధిగత పం/చ మహాశబ్ద మహా/సామాన్తాధిపతి జ/యధీర ఛెవణరజు/అభిమాన ధవళ ర/ట్టశూరరు రాజభూరి(శ్ర)/వ విట్టినారాయణ/ సత్యాణ్నవ ధర్మర/త్సాగర శ్రీమత్సంక(ర) /గణ్డరసరు కొళ్ళి(పా) /కెనాడ రాజ్యాభివృద్ధ/దె ఇప్పత్తిచ్ఛాసిరల/ నాళుత్తిరె ఆకునూర’’ అని...

2.       నల్లగొండ జిల్లా శాసనసంపుటిలో 15వది, తేదీలేని తుమ్మలగూడెం శాసనంలో

‘స్వస్తి స/మధిగత పంచ/మహాశబ్ద మ/హా సామాన్తా/ధిపతి జయ/ధీర భువనయ్క/రామ నభిమాన/ధవళ రట్టర మే/రు రాజభూరిశ్ర/వ విద్విష్టనారా/యణ ధర్మరత్నా/కర శ్రీమత్సంక/ర గణ్డరస జ/యధీర జినాలయక్కె’ అని వుండడం వల్ల ఆమనగల్లు శాసనంతో పోల్చినపుడు శంకరగండరస ప్రశస్తి సమానంగా వుండడం చేత కొలనుపాక-2000నాడును పాలించిన శంకరగండరస మూడింటిలోను ఒక్కరేనని తేలుతున్నది.ఆమనగల్లు శాసనంలో రాజు అకాలవర్షుడు, శాసనకాలం క్రీ.శ.888 వుండడంతో శంకరగండరస కాలం వెల్లడి అయింది. నల్లగొండ జిల్లా శాసనసంపుటిలో తుమ్మలగూడెం శాసనంలో శంకరగణ్డరస కాలాన్ని చెప్పుటకు అవకాశమున్నది.

3.       వరంగల్ జిల్లా వేల్పుగొండ(జాఫర్ గడ్) శాసనంలో కూడా శంకరగండరస ప్రశస్తి సవివరంగా ఉంది.

4.       మెదక్ జిల్లా మల్లికార్జునపల్లి శాసనంలో శంకరగండరస మొదటిసారిగా ప్రస్తావించబడ్డాడు.

          ఈ శాసనంపై మొదటివైపు దేవాలయగోపురం,ఆవుదూడలు,శివలింగం,నంది గుర్తులు చెక్కబడివున్నవి. మూడోవైపు ‘నాగలి’ గుర్తు చెక్కబడివుంది.ఇది అరుదైన చిహ్నం.ఈ ఆమనగల్లు శాసనం అపూర్వమైనది.ఈ శాసనంలో ‘చిత్రమేళి’ వుంది.చిత్రమేళి అంటే అందమైన మేడిగల నాగలి అని అర్థమని ఇటీవల ఈమని శివనాగిరెడ్డిగారు చరిత్రశకలాలు-42 (21.02.2016 నాటి ఆదివారం ఆంధ్రజ్యోతి)లో రాసారు.చిత్రమేళి అంటే రైతులసమాఖ్యనట.1197 నవంబరు 21న నెల్లూరులోని రంగనాయకస్వామి దేవాలయంలోని చిత్రమేళి మండపంలో రైతులసభ జరిగినట్లు శాసనంవల్ల విదితమైనట్లు ఆ వ్యాసంలో చెప్పబడ్డది.కాని, ఇక్కడి ఆమనగల్లు శాసనం పైనున్న నాగలిగుర్తు అప్పటికి 309 యేండ్లు పూర్వపుది,ఇప్పటికి 1118 యేండ్ల కిందటనే రైతుల శాసనం వున్నట్లు తెలుపుతున్నదికదా.ఇది తెలంగాణచరిత్రలో అరుదైన సందర్భం.

          (పలుకుబడిలో మేళి మేడిగా మారినట్లుంది.)

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...