గుడిమల్లం దేవాలయంపై
కొత్తదృష్టి-ఒక ఆలోచనః
గుడిమల్లం :
తిరుపతికి దగ్గరలో
వున్న గుడిమల్లం దేవాలయం ప్రాచీనసంస్కృతికి కట్టినగుడి. గుడిమల్లం గుడి నిర్మాణంలో గర్భగుడి గజపృష్టాకారంలో
వుంది. అది బౌద్ధచైత్యలక్షణం. ఈ గుడిమీద చేసిన పరిశోధనలు
అసంపూర్ణంగానే వుండి పోయాయి. ఈ దేవాలయం
ప్రాధాన్యతంతా ఆ లింగంలో వుంది. ఎక్కడాలేనివిధంగా పురుషాంగ రూపంలో చెక్కబడింది. ఈ లింగం చాలా
పురాతనమైనదని, క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినదని చెప్పబడుతున్నది. దేవాలయం
ప్రాంగణంలో దొరికిన 9వ శతాబ్దపు శాసనాలు అది పరశురామేశ్వరాలయమని పేర్కొన్నాయి. ఈ శాసనాలు
గుడినిర్మాతలను పేర్కొనలేదు. కాని, వారీ
గుడికి చేసిన వస్తు, ధన, భూమి,
గోవుల
వంటి కానుకలను గూర్చి తెలియజేస్తున్నాయి. 1973లో చరిత్రకారులు
చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన పెద్దఇటుకలు (42‘21‘6 సెం.మీ.),నలుపు,
ఎరుపురంగు
కుండపెంకులు ఆంధ్ర శాతవాహనుల కాలం, క్రీ.శ.
1,2 శతాబ్దాలను
సూచిస్తున్నాయి. అందువల్ల కొందరు
చరిత్రకారులు ఈ గుడిని శాతవాహన కాలానిదని అంటున్నారు.
చరిత్రకారులు ఈ
గుడిపేరును, చరిత్రను అందరు
అంగీకరించడం లేదు. అక్కడి శాసనాలు పల్లవ, గాంగపల్లవ, బాణ, చోళ కాలాలకు చెందినవని తెలుస్తున్నది. ఇందులో తొలిశాసనం పల్లవ
నందివర్మ(క్రీ.శ.802)కు చెందినది. కాని,ఇక్కడి శాసనాల్లో ఎందులో కూడా గుడిమల్లం అన్న పేరులేదు. గుడిలోని అంతరాళం, ముఖమంటపాల కన్నా గర్భగుడినేల లోతుగా వున్నది. లింగంపై చెక్కివున్న
శివరూపం ఆటవిక వేటగానివలె వున్నాడు.
శాసనాల్లో
ఈ గ్రామం విప్రపీఠంగా చెప్పబడింది.
లింగం
స్థానికమైన నల్లరాతిలో చెక్కబడింది.
అది
5 అ.ల ఎత్తు,1 అ. వ్యాసంతో వుంది. ఆ లింగంపై ఒక అందమైన రెండు చేతుల శివుడు స్థానకభంగిమలో
అర్ధశిల్పంగా కనిపిస్తున్నాడు.
ఈ
శిల్పం అపస్మారపురుషుడు లేదా కుబ్జుని లేదా యక్షుని మీద నిలుచున్నట్లుగా వుంది. ఆ దేవుని కుడిచేతిలో
గొర్రెపిల్ల, ఎడమచేతిలో ఒక చిన్న
జలపాత్ర వున్నాయి. ఎడమభుజంపై
పరశువు(గండ్రగొడ్డలి) వుంది.
అతని
రెండుచేతులకు ముంజేతులపై సగందాకా కడియా లున్నాయి. శిల్పం తల మీద జటలు జటాభారం వలె
చుట్టివున్నాయి. అతని చెవులకు ఎన్నో
చెవిపోగులున్నాయి. పైకి కట్టిన ధోవతి
ధరించివున్నాడు. అతని నడికట్టు బట్ట
మొత్తం లింగాన్ని కప్పినట్టుగా పారదర్శకంగా కనిపిస్తుంది. అతనికి జందెం లేదు. ఈ అలంకరణంతా కురుబసంస్కృతిని పోలివుంది.
ఉజ్జయినిలో దొరికిన
రాగినాణాలపై గుడిమల్లంలోని లింగాన్ని పోలిన బొమ్మలున్నాయి. ఆ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్దివి. మధుర మ్యూజియంలో కూడా 1వ శతాబ్దానికి చెందిన శిల్పాల్లో ఒకటి గుడిమల్లం
శివలింగాన్ని పోలివుంది. గుడిమల్లంలో తవ్వకాలు జరిపిన కార్తికేయశర్మ ‘ముక్కుకొసపై చూపునిలిపిన దేవునికళ్ళు విరూపాక్షుడు మరియు
యోగ దక్షిణామూర్తులను సూచిస్తున్నాయన్నాడు. గొర్రెపిల్లను
చేతపట్టుకోవడం భిక్షాటనామూర్తిని సూచిస్తున్నదన్నాడు.
గుడిమల్లం ఎవరి గుడి? పరశురాముని గుడి అంటారు. శైవచిహ్నం లింగానికి, విష్ణ్వావతారాలలో ఒకడైన పరశురామునితో సంబంధమేమిటి. ఏ పురాణాల్లోను, ఆరాధనాపద్ధతుల్లోను లేని ఈ ద్వంద్వమతాల కూర్పేమిటి. ఇది ఏ పురాణగాథల్లో వున్నదో, ఏ జానపదగాథల్లో వున్నదో అన్వేషించాలి.
గుడిమల్లం ఎవరి గుడి? పరశురాముని గుడి అంటారు. శైవచిహ్నం లింగానికి, విష్ణ్వావతారాలలో ఒకడైన పరశురామునితో సంబంధమేమిటి. ఏ పురాణాల్లోను, ఆరాధనాపద్ధతుల్లోను లేని ఈ ద్వంద్వమతాల కూర్పేమిటి. ఇది ఏ పురాణగాథల్లో వున్నదో, ఏ జానపదగాథల్లో వున్నదో అన్వేషించాలి.
జనపదుల పురాణాల్లో
మల్లన్నదేవుడు శివాంశుడు.
శ్రీశైలంలో
మల్లికార్జునుడు సంస్కృతీకరించబడిన మల్లన్నే. మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం కొల్లాపురిపట్టణం కేంద్రంగా నడిచే కథ
మల్లన్న, బీరప్పల గురించిన కథ. మల్లన్న కురుమ, కురుబ,
కురుంబ(న్)ల
దేవుడు. బీరప్ప వారి కులగురువు. మల్లన్నకు గొర్రెలను
వరంగా యిచ్చింది శివుడే. గొడ్డలి ధరించి
అడవుల్ని నరికి వ్యవసాయం చేసింది మల్లన్నే. ఆ
అడవుల్లో గొర్రెలు కాచుకుంటు కురుమలకు ఆరాధ్యదైవమైనవాడు మల్లన్న. మహారాష్ట్రులకు
ఖండోబారాయుడు, కన్నడిగులకు బీరప్ప(వీరప్ప), తమిళులకు మల్లన్నసామి సాక్షాత్తు మల్లన్నే. అతని చేతిలో
గొర్రెపిల్ల వుండడం సహజం.
అది
అతడు గొర్రెలకాపరి అని తెలుపుతుంది.
చేత
గొడ్డలి అతని ఆయుధం. ఆ జటాఝూటం వంటి జుట్టు
శివుని ప్రతిరూపమని చెపుతుంది.
అందువల్ల
గుడిమల్లం మల్లన్నగుడి కావడానికి అవకాశం ఎక్కువగా వుంది.
ఈ రూపలక్షణాలన్నీ
గుడిమల్లంలోని లింగం ముందర విగ్రహానికి వున్నాయి. ఆ విగ్రహం వెనక వున్న లింగం పురుషజననాంగం వలె వుండడం
అనాగరిక, ప్రాథమిక శిల్పం తీరు. అమరావతిలోని
అమరేశ్వరలింగం కూడా పురుషాంగ రూపంలోనే వున్నదని చెపుతారు. లింగం,
విగ్రహాల
చుట్టుకట్టిన వేదిక అంచుకు ముందర చక్రం చెక్కబడివుండడం కూడా బౌద్ధధర్మచక్రాన్ని
స్మరణకు తెస్తున్నది.
చర్చించండి.






No comments:
Post a Comment